27, జూన్ 2020, శనివారం

చట్టబద్ధమైన హెచ్చరిక - ఓ కథ

.


** ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు కాన్సర్‌కు కారకం **
** మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం **
** మద్యం సేవించి వాహనములు నడుపరాదు **
** అతివేగం ప్రమాదకరం - హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించండి **

** చట్టం తనపని తాను చేసుకుంటూపోతుంది - చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి **

*************************

మామూలుగా అయితే మూసేసే సమయం అయ్యిందనే సూచనతో గానీ ముగించనివాడు ఇవాళ చాలా తక్కువ మోతాదులో సేవనంతో, తొందరగా ముగించి బార్‌లోనుంచి బయటకి వచ్చి చివరిదాకా కాలిన సిగిరెట్టుని కాలికిందవేసి తొక్కుతూ చుట్టూ చూసాడు. 

రోజూ తను చూసేదానికంటే ఎక్కువ రద్దీతో, ఎక్కువ ధ్వనులతో, ఎక్కువ కాంతితో పరిసరాలంతా గందరగోళంగా ఉన్నాయి.

"ఏవిటో అందరికీ ఇంత హడావిడి.. ఇంటికిపోయి తిని పడుకోవడం తప్పితే చేసేది ఏముంటుంది ఇప్పుడు? ..హ్మ్..  ఇంట్లో మనకోసం ఎదురుచూసేవాళ్లుంటే నేను కూడా ఇలాగే పరిగెత్తేవాడ్నేమోలే..!"

"నాలాంటి ఏక్‌నిరంజన్‌గాడికి ఇల్లైనా ఒకటే, బార్అయినా ఒకటే.. అయినా ఇప్పుడు ఇంటికిపోయి చేసేదేముంది, మళ్లీ లోపలకే వెళ్తే బెటరేమో..!!"

కాస్తంతదూరంలో ఒక కారు విపరీతమైన వేగంతో వస్తోంది..

"ఒరేయ్.. ఎందుకురా అంత స్పీడూ!.. పోతావురా!!..నువ్వు పోయిందేకాక జనాలని కూడా చంపుతావ్.."

.. సందులోంచి మైన్‌రోడ్‌మీదకి వచ్చేటప్పుడు వెనకాలవచ్చే ట్రాఫిక్‌ని చూసుకోవాలనే ఇంగితంలేని ఒక టూవీలర్‌మీద వెళ్తున్నవాడిని వెనకాల్నించి దాదాపుగా గుద్దబోయి, చివరిసెకన్లలో చాకచక్యంగా తప్పించినా, కారు సైడ్లు టూవీలర్‌వాడ్ని బలంగా రాసుకుంటూ వెళ్లాయి.  దాంతో బైకుమీద ఉన్నవాడు బాలెన్స్‌తప్పి కిందపడి, బండితోపాటుగా జారుకుంటూ చాలాదూరం వెళ్లి ఆగాడు.. చలనం లేకుండా..!

కారు స్పీడు కాస్త తగ్గినట్టే తగ్గి, మళ్లీ వేగం అందుకుని వెళ్లిపోతోంది.

"ఒరేయ్.. మనిషిని గుద్దింది కాక, కనీసం వాడు బతికున్నాడో, లేదో అనికూడా చూడకుండా వెళ్తున్నావా?.. ఉండు, నీ పని చెప్తా.. నిన్ను వదిలేదిలేదురోయ్..!! "

తనకార్లో కూర్చుని ముందుకు ఉరికించాడు. అల్లంత దూరంలో ఆ కారు కనబడింది. 

తనకారు వేగం మరింత పెంచాడు. ముందుకారు చాలావేగంగా, అటూ ఇటూ కదులుతూ, లేన్లు మారుతూ, మిగతావాహనాలని అధికమిస్తూ వెళ్తోంది.

"ఇంత ఫాస్ట్ వెళ్తున్నాడూ అంటే, బాగా తాగి ఉన్నాడా?.. డ్రగ్స్ తీసుకున్నాడా?.. లేకపోతే ఏ దొంగతనమో, హత్యో చేసి పారిపోతున్నాడా?.."

తనకారు మరికాస్త వేగంపెంచి ముందుకారుని అందుకుని దానికి పక్కగా వెళ్లి ఆ కారు డ్రైవరువైపు చూసాడు. వీధిదీపాల వెలుగులోకూడా ఆ డ్రైవరు మొహమంతా చమటలు, అతని కళ్లలో ఆదుర్దా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

"పక్కకి తీసి ఆపురా బండినీ.."

చేతులతో సైగ చేసాడు.

ఆ కారువాడు మరికాస్త వేగం పెంచాడు.

"నువ్వు మంచి మాటలతో వినేవాడివికాదు అని నాకు ఎప్పుడో అర్ధమయ్యిందిరా.. ఉండు, నీ పని చెప్తా.."

వేగం పెంచి ఆకారుకి సమాంతరంగా వెళ్లి, తన కారుతో ఆకారుని గుద్దాడు. దాంతో ఆ కారు పక్కనే ఉన్న ఫుట్‌పాత్ ఎక్కినంత పనయ్యి, మళ్లీ సర్దుకుని రోడ్డుమీదకి వచ్చింది.

భయం, ఆందోళన, ఆశ్చర్యం, కోపం, బాధ .. ఇలా ఎన్నో కనబడ్డాయి ఆకారులోని డ్రైవరు మొహంలో ..

"ఇప్పుడు అర్ధమయ్యిందా నేనంటే ఏమిటో.. మళ్లీ చెప్తున్నా.. నిన్ను వదిలేదిలేదురోయ్..!!"

ఈసారి తనకారుతో ఇంకా బలంగా గుద్దాడు ఆకారుని. దాంతో ఆకారు అదుపుతప్పి వేగంగా ఫుట్‌పాత్‌మీదకి ఎక్కి దానిమీద ఉన్న రెండు చెత్తకుండీలని కింద పడేస్తూ వెళ్లి ఓ లైటుస్తంభాన్ని బలంగా గుద్ది ఆగింది. ఆ తాకిడికి లైటుస్తంభం ఓ పక్కకి ఒరిగిపోతే, దానికి ఉన్న లైట్లు పెద్దశబ్ధంతో పగిలిపోయాయి.

కాళ్లలో బలమంతా బ్రేకులమీద ఉపయోగించి కారుని కొద్దిదూరంలో ఆపి, కిందకి దిగి తన కారు వంక పరీక్షగా చూసాడు. ముందు అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి, ఏడమవైపంతా గీతలు, బాగా లోపలకి సొట్టలు పడ్డాయి.

నెమ్మదిగా ఆ కారువైపు నడిచాడు. ఆ కారు హార్న్ ఆగకుండా మోగుతూనే ఉంది.

"సీట్‌బెల్టు పెట్టుకున్నట్టులేడు.. తల స్టీరింగుకి కొట్టుకున్నట్టుంది.."

ఆ కారుడోరు తెరిచి డ్రైవరుని వెనక్కి కూర్చోబెట్టాడు. హార్న్ మోగడం ఆగింది. ఆ డ్రైవరు తలనుంచి రక్తం కారుతోంది.

"హ్మ్.. ఇప్పుడు ఆంబులెన్సుని పిలవాలా? పోలీసుల్ని పిలవాలా?"

"అసలు వీడిని ఇలా వదిలేసి వెళ్లిపోవటమే బెటరేమో .. వీడు అక్కడ ఆ బైకు కుర్రాడిని అలాగే వదిలేసి వచ్చేసాడుగా.."

జేబులోంచి సిగిరెట్టు తీసి వెలిగించాడు.

లైటరు వెలుగులో కారులో వెనకాల ఏదో కనబడినట్టయింది. వెనకాల డోరు తీసి చూసాడు.

అక్కడ..

కారు ముందుసీటుకి, వెనకసీటుకి మధ్యలో.. 

.. విపరీతమైన రక్తస్రావంతో ..

.. ప్రాణం ఉందో లేదో తెలియని స్థితిలో ..

.. కింద పడి ఉంది..

.. ఓ స్త్రీ..

.. నిండు గర్భిణి.. !!!!

.