13, ఆగస్టు 2011, శనివారం

ఒక సినిమా డైలాగు మీ జీవితాన్ని మార్చేస్తుంది..

ఏంటీ.. ఒక ఐడియా కదా జీవితాన్ని మార్చాల్సిందీ.. అప్పుతచ్చుగానీ పడిందా అనుకుంటున్నారా?.
లేదండీ.. మీరు కరెక్టుగానే చదివారు.

అయినా మనలోమన మాట.. మీకెప్పుడూ ఇలాంటివి జరగలేదా?. నాకు అయితే జరిగింది..

ఆ "కబురు"ఏమిటో చెవిన వేసుకోండి మరీ..!!!


                                                ************* **************

మా అమ్మాయికి మూడునెలల వయస్సప్పుడు, నాకు ఆన్‌సైటు ఆఫర్ వచ్చేసరికి..
చంకలుగుద్దేసుకుని..
నేను ఎగేసుకుని..
శ్రీమతినీ, చంటిదాన్నీ ఎగరేసుకుని.. వచ్చి చికాగోలో వాలిపోయాం.

నా ఫ్రెండు హరి చికాగోలోనే ఉండడం, వాడి ఆఫీసు, నా అఫీసు ఒకే బిల్డింగులో ఉండడం, వాడు ఉంటున్న ఇల్లు ఆఫీసుకి 10 నిమిషాల డ్రైవ్ దూరంలోనే ఉండడం..లాంటివన్నీ కుదరబట్టి మేముకూడా వాడుండే అపార్టుమెంటు కాంప్లెక్సులోనే తొందరగానే సెటిలయ్యాము. వాడికి కూడా 6,7 నెలల బాబు ఉండడం నాకు చాలా ఊరట(ధైర్యం) కలిగించిన విషయం.

త్వరలోనే శ్రీమతి, చంటిది వాతావరణానికి అలవాటుపడ్డారు. శ్రీమతి మిగతా దేశీయవనితలతో కూడిన "మహిళామండలి"లో సభ్యత్వం సాధించి త్వరలోనే అందులో అంచెలంచెలుగా ఎదిగి "పరమవీర యాక్టివ్ మెంబర్" బిరుదాంకితురాలయ్యింది.

చంటిదికూడా "శిశుమండలి"లో తన ప్రాతినిధ్యాన్ని సుస్థిరం చేసుకునేందుకు దాని సాయశక్తులా ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

నేను సరే సరి.. పొద్దున్నే నేను ఆఫీసుకి తయారయ్యేసరికి, తల్లీ కూతుళ్లిద్దరూ "గుర్రు"లు కొడుతూ ఉండేవారు. ఏం చేస్తాం.. ఫ్రిజ్జులోంచి పాలు తీసుకుని, అందులో సెరెయల్ గుమ్మరించుకుని తినేసి ఆఫీసుకెళ్లేవాడిని.

(నాకు మామూలుగానే, పాలలోగానీ, కాఫీలోగానీ వచ్చే మీగడతరకలు అంటే కాస్త అదో "ఇది". అలాంటిది, ఇంగ్లీషు సినిమాల్లో వాళ్లు ఫ్రిజ్జులోంచి పాల డబ్బా తీసి ఎత్తుకుని తాగుతుంటే "ఏదో"లా ఉండేది. అలాంటివాడ్ని.. ఇలా.. హ్మ్.. విధి వైపరీత్యం అంటే ఇదేనేమో?")

సరే.. ఆ తర్వాత, 10కో, 11కో అమ్మగారికి "సుప్రభాత"సేవ ఉండేది. మరి లేకపోతే, మధ్యాహ్నం "భోజనం" సంగతేమిటి?. ఇంక సాయంత్రం ఆఫీసునించి రాగానే చంటిదానితో కాలక్షేపం.

శుక్రవారంనాడు ఆఫీసునుండీ రాగానే, దేశీయ కూరల మార్కెట్టుకెళ్లి వారానికి సరిపడా కూరలు, అక్కడనుండే వారానికి సరిపడే తెలుగు, హిందీ సినిమాల క్యాసెట్లూ పుష్కలంగా తెచ్చిపడేసుకునేవాళ్లం. వీకెండ్లో షికార్లు సరేసరి.

               *******         *******
చంటిది "ఊ.." కొట్టడం మొదలుపెట్టింది..


         .. మేము ఇండియానుంచి తెచ్చిన ఉగ్గుగిన్నెలని పంచాం.
         .. అక్కడ నాయనమ్మా, అమ్మమ్మలు కూడా ..

               *******         *******

చంటిదాని ఫోటోలు తీసి, వాటిని Develop చేసి, రెండు రెండు కాపీలు తీసి నాయనమ్మావాళ్లకి ఒకటి, అమ్మమ్మావాళ్లకి ఒకటి పంపిస్తున్నాం.

వారానికి (కనీసం)రెండుసార్లు అటూ, ఇటూ పెద్దవాళ్లతో "పాపాయి ముచ్చట్లు" పంచుకుంటున్నాం.

               *******         *******
చంటిది బోర్లా పడింది. మేం బొబ్బట్లు పంచాం.


శ్రీమతి ప్రాణస్నేహితురాలి పెళ్లి అయ్యింది. ఫోను చేసి శుభాకాంక్షలు అందజేసాం. పెళ్లికి వెళ్లలేకపోయినందుకు బాధపడింది శ్రీమతి.

              *******         *******
చంటిది పాకడం మొదలుపెట్టింది. పాకుండలు (పాకం ఉండలు?) చెయ్యడంరాక పాయసం వండి వడ్డించాం.

మా బ్రహ్మచారి సహోద్యోగు(గిను)లు చంటిదాని ఎదుగుదలని చాలా నిశితంగా, ఉత్సాహంగా గమనిస్తూండేవాళ్లు.. మరి వాళ్లకి కనీసం ఒక రోజు/పూట స్వయంపాకం బాధ తప్పుతోంది కదా..? :)

              *******         *******

గడపదాటిందని గారెలు, అడుగులు వేసిందని అరిసెలు(లాంటివి!!??) చేసి పంచాం.. తిన్నాం.

నెలపుట్టినరోజులు సరేసరి..

            **********              ************

పాపాయి మొదటి పుట్టినరోజు వేడుకలు మిత్రులు, సహోద్యోగులమధ్య  చేసుకున్నాం.
  
    .. ఎక్కడో చిన్న వెలితి ఫీలింగ్.. "పెద్దవాళ్ల" అక్షంతలు పడలేదే అని.

    .. ఫొటోలు చూసి పెద్దవాళ్లు ఆనందపడ్డారు. వాళ్ల గొంతులో కూడా వినిపిస్తోందా ఆ వెలితి?

            **********              ************

నాన్నగారికి ఫోను చేస్తే, ఆయనగొంతులో ఏదో తేడా.. చాలా బాధపడుతున్నట్టు..

మరీ మరీ అడిగితే చెప్పారు.. ఆయన ప్రాణస్నేహితుడూ, మా కుటుంబానికి ఎంతో ఆప్తుడూ అయిన మా "మావయ్య" కాలంచేసారని.

.. ఫోనులో నాన్నగారిని ఎలా ఓదార్చాలో నాకర్ధం కాలేదు.. నావల్లకాలేదు..


            **********              ************

అలా, నా మానాన నేను మాడిపోయిన మసాలాదోశ తింటూ కాలక్షేపం చేస్తుంటే, అప్పుడు ఊడి పడ్డారు "ఆ ఇద్దరు" నా జీవితాన్ని మార్చటానికి "ఆ సినిమా" లో "ఆ డైలాగు"తో.


ఆ సినిమా: నువ్వు నాకు నచ్చావ్

ఆ ఇద్దరు: త్రివిక్రం శ్రీనివాస్.. "ఆ" డైలాగు రచయిత
           విక్టరీ వెంకటేష్ .. ఆ డైలాగుని పలికిన (మగ)చిలక

ఆ డైలాగు :మరి ఆ సీను/డైలాగు ఏమిటో మీరే చూడండి/వినండి/చదవండి..

===========================================



".. ఇన్నాళ్లూ కష్టపడి చదివించింది నువ్వు అనకాపల్లిలో వ్యవసాయం చేసుకోడానికా?"


"అంటే పాతికేళ్లుగా పెంచారుగాబట్టి, నేను అమెరికా వెళ్లి పదేళ్లు డబ్బు పంపిస్తే లెక్క సరిపోద్ది.. చెల్లు.. ఇదేమన్నా బిజినెస్సా?. ఇప్పుడు నేను అమెరికా వెళ్లి డబ్బులు సంపాదించి కారు కొంటాను. దాని పక్కన నిలబడి ఒక ఫోటో తీసుకుని పంపించాలి. అంతేగానీ దాన్లో మానాన్నని ఎక్కించుకుని తిరగ్గలనా? లేదు. అదే మావూళ్లో వ్యవసాయం చేసుకుంటుంటే కనీసం మానాన్నని స్కూటరెక్కిచ్చుకుని తిప్పగలను. అది నాకు హాపీగా ఉంటుంది.."


".. మా నాన్నకి జ్వరమొస్తే అమెరికానుంచి ఫోనుచేసి టాబ్లెట్ వేసుకో నాన్నా అనే చెప్పగలను.. అదే టాబ్లెట్ నా చేత్తో వేసి పక్కనుండి చూసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది.."


".. నేను పెరిగిన ఇల్లు.. నేను తిరిగిన ఊరు.. నన్ను పెంచిన నాన్న.. నన్ను ప్రేమించే స్నేహితులు.. అందర్నీ వదిలేసి అక్కడికెళ్లి ఏమి సాధించాలి?. నా పదెకరాలు, ట్రాక్టరు నాకు చాలు. సాయంత్రందాకా పొలం దున్నుకుని, సరదాగా ఫ్రెండ్సుతో ఓ దమ్ముకొట్టి.. సెకండ్‌షో సినిమాకెళ్లొచ్చి పడుకుంటే చాలదా? .."


".. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్లూ, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్లూ, నలుగురులేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏమీ ఉండదు.."

============================================

ప్రత్యేకంగా చివరి మూడు వాక్యాలు, నన్ను ఎక్కడో తాకాయి.. ఆలోచింపజేసాయి.. నా పరిస్థితులనే ప్రతిబింబిస్తున్నట్టు..  శ్రీమతితో నా ఆలోచనలు పంచుకున్నాను. తనుకూడా సానుకూలంగా స్పందించింది. కొన్ని తర్కవితర్కాలు, కాసిని తర్జనబర్జనల తర్వాత "గృహ"మంత్రి నిర్ణయానికి రాష్ట్ర"పతి" ఆమోదముద్ర వేసారు(ను).


అంతే.. తదుపరి సత్వర అవకాశాన్ని అందిపుచ్చుకుని, మేము తట్టా బుట్టా సర్దుకుని చికాగోలో బిచాణా ఎత్తేసి, భాగ్యనగరంలో జెండా పాతేసాం. చంటిది ఒకటిన్నరో ఏట మళ్లీ మొదటిపుట్టినరోజు జరుపుకుంది "అందరి"మధ్య.


.. చికాగోలో ఆరోజు మేము తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాల్సిన అవసరం మాకెప్పుడూ రాలేదు..

కాస్త బాగా "సెంటీ" అయినట్టున్నాను కదూ..

అలా అని, ఏమండోయ్! నేనేదో ఇప్పుడు పూర్తిగా మాతాపితరుల సేవలో తరిస్తున్నాననో, ఫ్రెండ్సుతో రోజూ సెకండ్ షో సినిమాలు కుమ్మేస్తున్నాననో అనేసుకోగలరు.. అంత లేదండీ!.

నాన్నగారితో మాట్లాడడం అలా ఉంచండి.. ఒకే ఇంట్లో ఉంటూ ఆయన్ని చూడకుండా కూడా ఎన్నో రోజులు గడిచిపోతున్నాయి ఇప్పుడు. ఏదో  ఇంతకు ముందు చెప్పినట్టు  , నా శ్రీమతిని మాధ్యమంగా ఉంచుకుని మేమిద్దరం మాటలు అటూ ఇటూ చేరవేసుకుంటూ ఉంటాం.. అలా ఎందుకు? అంటారా..

వాళ్లు లేచేసరికి నేను ఆఫీసుకి వెళ్లిపోవడం.. వాళ్లు పడుకున్న తర్వాత ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి చేరుకోవడం.. ఇట్టాంటివన్నీ చాలారోజులు జరిగేసరికి, మా బుడ్డిగాడు ఓ అందమైన ఆదివారంనాడు నన్ను అడిగాడు.. "నాన్నా! నువ్వు నాకు సండే ఒక్కరోజే కనబడుతున్నావు.. నువ్వేమన్నా "సండే డాడీ"వా అని..  :(

అందువల్లచేతనన్నమాట..

అదండీ సంగతి..


11 కామెంట్‌లు:

  1. మీ దమ్ము అందరికీ ఉండదు.
    మీ నిర్ణయాన్ని మనస్పూర్తిగా అభినందిస్తున్నా.
    చాలా మంది ప్రవాస భారతీయ భంధువులు, మిత్రులనీ చూసా
    వాళ్ళ తల్లి దండ్రులనీ చూసా
    అందరూ మీలా ఆలోచించరు.
    డబ్బు అన్నిటికీ పరిష్కారం కాదు.
    మానవ సంభందాలు మొదట ఇంట్లోంచే మొదలవుతాయి...
    స్వాతంత్ర దినోత్సవం స్వదేశంలో జరుపుకుంటున్న మీకు మరో సారి నా అభినందనలు.
    గాడ్ బ్లెస్ యు అండ్ యువర్ ఫ్యామిలీ !!

    రిప్లయితొలగించండి
  2. అవును. భాగ్య నగరం వచ్చాకా.. నా జీవితం కూడా తల్లకిందులైంది. హరే రామ ! కానీ అదో తుత్తి. కనీసం సెలవు పెట్టుకునైనా.. అందరినీ కలవొచ్చు. పిల్లలకి ముఖ్యంగా పెద్దవాళ్ళ ఆప్యాయతలు దొరుకుతాయి. ఈ విషయం లో నేను ఫుల్లు హేపీస్.

    రిప్లయితొలగించండి
  3. mottaniki maa manusulu karigincharu
    cinama dialog...Nijajivitam lo inta manchi pani chesinda ...Thank you very much...............
    ***Rams*******

    రిప్లయితొలగించండి
  4. చాలా యాదృచ్చికం.. మొన్ననే మిత్రులొకరు ఆ సినిమాలో ఆ సన్నివేశాన్ని గురించి మాట్లాడారు.. వారినీ ప్రభావితం చేసిందని.. జాబితాలో మీరుకూడా ఉన్నారన్న మాట!!

    రిప్లయితొలగించండి
  5. వ్యాఖ్యలుంచిన బ్లాగ్మితృలందిరికీ "స్వాతంత్రదినోత్సవ శుభాకాంక్షలు."

    @ఆత్రేయ: "మానవ సంభందాలు మొదట ఇంట్లోంచే మొదలవుతాయి...". చాలా బాగా చెప్పారు.ధన్యవాదాలండీ..

    @సుజాత: ఔనండీ.. పెద్దవాళ్లూ, పిల్లగాళ్లూ హేపీస్ అయితే మనమూ హేపీస్.. :)
    ధన్యవాదాలండీ..!

    @Rams: ఔను సార్.. చేసింది.. :)
    ధన్యవాదాలు..

    @మురళి: సంతోషమండీ.. నాకూ తోడున్నదని భరోసా ఇచ్చినందుకు.. :)
    ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  6. ఇప్పుడు షికాగోలో ఈ పోస్టు చదువుతూ నేను ఇదే ఆలోచిస్తున్నా :)

    సరదాగా అన్నాలెండి. నేను ఉందామనుకున్నా ఉండలేను. 2 ఏళ్ళ క్రితం బోస్టన్ వచ్చా 6 నెలలకి మొహంమొత్తి ఇండియా వచ్చేసా. ఇప్పుడు కూడా అంతే 6 నెలలకి వచ్చేస్తా.

    రిప్లయితొలగించండి
  7. రవి కిరణ్ గారు
    కబుర్లూ కాకర కాయలూ బ్లాగు నేను చేరినప్పటి నుండీ చూస్తున్నా
    బజ్ లకి అలవాటు బద్దకం పెరిగిపోయి మీ బ్లాగ్ లో కామెంట్స్ మిస్ అయ్యాను :)
    ఒక సినిమా డైలాగు మీ జీవితాన్ని మార్చేస్తుంది..
    మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్లూ, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్లూ, నలుగురులేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏమీ ఉండదు.
    చాలా కరెక్ట్ గా చెప్పారు త్రివిక్రమ్ గారు అది మళ్లే గుర్తు చేసిన మీరు
    ఆత్మ సంతృప్తికి మించిన ఆనందం లేదని రుజువు చేసారు
    thank you for sharing!

    రిప్లయితొలగించండి
  8. @MURALI: నా అభిప్రాయంలో.. షార్ట్ ట్రిప్పులు అయితే పరవాలేదనుకుంటాను సార్!. :)
    ధన్యవాదాలు..

    @హరే కృష్ణ: స్వాగతం హరే!. లేటుగా అయినాసరే లేటెస్టుగా వచ్చేసారు..
    మీ వ్యాఖ్యకి ధన్యవాదాలు..

    రిప్లయితొలగించండి
  9. హమ్మయ్య! నాకులాగా ఆలోచించేవాళ్లు ఇంకొకళ్ళున్నారన్నమాట! చాలా సంతోషంగా ఉంది. ఈ డైలాగు నా జీవితాన్ని మార్చేయలేదుగానీ, ప్రతిసారీ వివరణ ఇచ్చుకోలేక ఈ సన్నివేశాన్ని చూపిస్తుంటా. ఇప్పటికి రెండుసార్లు గొడవపెట్టి తిరిగొచ్చా. ఈ మధ్యన వెళ్ళమని మళ్ళీ‌ గొడవ పెడుతున్నారు - వెళ్ళాలనుకునేవాళ్ళకేమో వీసాలు రావట్లా, ఉండాలనుకునేవాళ్ళకేమో కొనసాగింపు (ఎక్స్‌టెంషన్) దొరకట్లేదు, నాకేమో ౨౦౧౨దాకా వీసా ఉంది‌:-)

    రిప్లయితొలగించండి
  10. ఈ విషయంపై నేను మొదటిసారి అమెరికాలో ఉండగా రాసింది - http://jb-journeyoflife.blogspot.com/2007/04/plight-of-nri-parents.html

    రిప్లయితొలగించండి
  11. @జేబి - JB.. మొదటిసారిగా నా బ్లాగులోకి వచ్చారు.. స్వాగతం.

    ఇక్కడి మీరుంచిన వ్యాఖ్యతో, అంతకుముందు టపాలో మీ భావంతో పూర్తిగా ఏకీభవిస్తాను. ధన్యవాదాలు.. :)

    రిప్లయితొలగించండి