మా అమ్మాయిని LKGలో జాయిన్ చేసినప్పటినుంచీ మా ఆవిడకి ఒక కోరిక..
.. మా అమ్మాయి స్కూల్ డేనాడు జరిగే ఫంక్షనులో ప్రైజు తీసుకుంటుంటే చూసుకోవాలనీను, ఆనందభాష్పాలు (?) రాల్చాలనీను..!
ఈ విషయమేమీ ఆ చంటిదానికి తెలియకపోయినా, ప్రతీ సంవత్సరం దాని శాయశక్తులా ప్రయత్నించి అది చదువులోనో, ఆటల్లోనో, ఇంకా స్కూలువారు నిర్వహించే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లోనో ప్రయిజు(లు) తెచ్చుకుంటూ ఉండేది.
(ఇంకా తెచ్చుకుంటూనే ఉంది.. Touch wood :-) )
కాకపోతే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే..
దాని స్కూల్ డే వచ్చేసరికి, మేము ఆరోజు ఏదన్నా ఊరు వెళ్లడమో, లేకపోతే చంటిదానికి ఒంట్లో బాగోకపోవడమో, ఇంకా ఏఏ కారణాలవల్ల ఐతేనేమి, మేము ఆ స్కూల్ డే ఫుంక్షనుకి వెళ్లలేకపోతూ ఉండేవాళ్లం. స్కూలువాళ్లు తర్వాత ఎప్పుడో దీనికి రావాల్సిన ప్రైజులు దీనికి ఇచ్చేస్తూ ఉండడంతో పిల్లది వాటిని చూసుకుని, అడిగినవాళ్లకీ, అడగనివాళ్లకి అందరికీ చూపించుకుని, కొన్నిరోజులపాటు వాటితోనే సహజీవనం చేస్తూ మురిసిపోయేది.
కాని..
..కన్నతల్లి కోరిక తీరనేలేదు.
ఈనేపధ్యంలో, పోయినేడాది.. మా ఆవిడ ముందునుంచే నాకు విప్ జారీచేసేసింది, చంటిదాని స్కూల్‌డే ఫంక్షను రోజుల్లో ఊరిపొలిమేరలు దాటటానికి వీల్లేదని. ఇక నానేటి అంతను.. "అయితే వాకే!!" అంతను.
ఆ తర్వాత, రకరకాల మొక్కులు మొక్కేసింది, ఇంక ఏ అవాంతరాలు రాకూడదని.
స్కూల్‌డే దగ్గరకొస్తున్నకొద్దీ మా ఆవిడకి టెన్షను.. కాళ్లూ చేతులు ఆడడంలేదు.. రాత్రుళ్లు ఏవేవో కలవరింతలు..ఇంట్లో అంతా అదోరకమైన ఉద్రిక్తత(!!?)..
సరే.. మొత్తానికి ఆరోజు రానే వచ్చింది..
సాయంత్రమెప్పుడో ఫంక్షనంటే మా ఆవిడ పొద్దున్న నాలుగింటికల్లా అలారం పెట్టుకుని తను లేచి, మమ్మల్ని లేపేసి అందరికి నలుగులు పెట్టి మరీ (ఈ నలుగు కార్యక్రమానికి నాకు మినహాయింపు దొరికిందిలెండి) తలంట్లుపోసేసి అందరినీ ఒక చోట బుద్ధిగా కూర్చోమని చెప్పి (నన్ను కూడా.. :-( ), స్కూల్‌డే స్పెషల్స్ చెయ్యటంలో ముణిగిపోయింది.
సుష్టుగా భోంచేసి కాస్త నడుం వాలుద్దామనుకుంటుంటే, "ఠ్ఠాఠ్.. ఫంక్షను మొదలైపోతుంది" అంటూ హడావిడి పెట్టేసి, మమ్మలని తయారు చేసేసి, తను గిన్నీసుబుక్కులోకి ఎక్కించాల్సినంత రికార్డు టైములో తయారయిపోయి మమ్మలనందరినీ బయలుదేరదీసేసింది.
అనుకున్నట్టుగానే మేము అక్కడకి వెళ్లేసరికి, ' సుయ్ లేదు ',' సయ్ లేదు.. '. ఇంకా కుర్చీలు, బల్లలు సర్దుతున్నారు. అలా ఒకటి, రెండు, మూడు యుగాలు గడిచిన తర్వాత ఒక్కొక్కళ్లే రావడం మొదలుపెట్టారు.
మొత్తానికి ఫంక్షను మొదలయ్యింది.
ముందు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయనీ, ఆ తర్వాత బహుమతి ప్రధానం ఉంటుందనీ, అందువల్ల ఈ రెంటిలో ఏదో ఒకటిగానీ, రెండింటిలోగానీ ఉన్న పిల్లలని క్లాసు టీచరుకి అప్పగించవలసినదిగా ముందే ఇచ్చిన లిఖితపూర్వక ఆఙ్నానుసారం మా అమ్మాయిని వాళ్ల టీచరుకి అప్పగించాం.
అన్నట్టు, మా అమ్మాయి ఒక నృత్యరూపకంలో కూడా పాలుపంచుకుంటొంది.
వందనాలు, భాషణాలు అయినతర్వాత కల్చరల్ యాక్టివిటీస్ మొదలైనాయి.
మా అమ్మాయి పాల్గొంటున్న నృత్యరూపకం జరుగుతున్నంతసేపూ మా బుడ్డిగాడితో పోటీ పడుతూ,చిన్నపిల్లలా ఎంజాయ్ చేసింది.
అందరు తల్లులూ అలాగే ఉంటారేమో!. కాని ఆ సమయంలో తన ఆనందాన్ని చూస్తే, చెప్పొద్దూ.. చాలా ముద్దొచ్చింది. ఆసమయంలో మా అమ్మాయితోపాటు, ఈ అమ్మాయిగారిని నేను తీసిన ఫోటోలని చూసుకుంటుంటే నా కెమేరా పనితనానికి నాకు నేనే వేలవేల వీరతాళ్లు వేసేసుకుంటూ ఉంటాను.
ఆ తర్వాత, అసలు ఘట్టం.. అదే, బహుమతి ప్రధాన కార్యక్రమం మొదలయ్యింది.
క్లాసులవారీగా, సెక్షన్లవారీగా పిలుస్తున్నారు. పిల్లలందరూ టీచర్ల దగ్గరే ఉండడంవల్ల, వరసగా పిల్లలు వస్తున్నారు.. ప్రైజులు తీసుకుంటున్నారు.. వెళ్తున్నారు. వాళ్ల వాళ్ల తల్లిదండ్రులు స్టేజీకి కొద్దిగా దగ్గరకి వెళ్లి ఫోటోలు తీసుకుంటున్నారు.
మా అమ్మాయి క్లాసు వచ్చేటప్పటికి మళ్లీ మా ఆవిడ హడావడి మొదలయ్యింది. కాదు మరీ!.. తన కోరిక తీరబోతోంది.. కల నెరవేరబోతోంది..
ఉన్నట్టుండి లేచింది.. నా చేతిలో ఉన్న కెమేరాని లాక్కుని స్టేజీ దగ్గరకి దూసుకెళ్లింది, నేను పిలుస్తున్నా వినకుండా!.
చేసేదేమీ లేక, బుడ్డిగాడిని పట్టుకుని నేను కూర్చుండిపోయాను.
మా అమ్మాయి పేరు పిలిచారు..
అది స్టేజీ మీదకి వచ్చింది..
దాని ప్రైజు తీసుకుంటోంది..
బుడ్డిగాడి ఇక్కడినుండే ' అదిగో అక్క, అదిగో అక్క ' అంటూ నాకు చూపిస్తున్నాడు.
ఇన్ని రోజులనుంచీ మా ఆవిడ ప్రభావం నా మీద పడడంవల్లనేమోగాని, నా కళ్లకి ఓ పల్చటి నీటితెర కమ్మింది.
మా అమ్మాయి నడుచుకుంటూ స్టేజీ దిగి వాళ్ల టీచరు దగ్గరకి వెళ్లిపోయింది.
ఈ హడావిడిలో మా ఆవిడగురించే మర్చిపోయాను. ఎక్కడుందా అని చూసాను. ఎన్నో సామ్రాజ్యాలు జయించిన సామ్రాఙ్నిలా తరలి వస్తోంది. తన కళ్లల్లో స్పష్టంగా కనబడుతున్న కన్నీళ్లు..నా పక్కకి వచ్చి, నా భుజమ్మీద తలవాల్చి కూర్చుంది. అంత గొడవలోనూ, మా మధ్యా, మా చుట్టూతా నిశ్శబ్ధం. కాసేపటికి సర్దుకున్నాం.
పిల్లలని తీసుకెళ్లాలని తల్లిదండ్రులకి అనౌన్సు చేస్తుంటే, వెళ్లి అమ్మాయిని తీసుకొచ్చుకున్నాం. దానికిచ్చిన ప్రైజు చూసుకుని మురిసిపోయాం. మా ఆవిడ సంగతి వేరే చెప్పక్కర్లేదు కదా!.
ఇంటికెళ్లేటప్పుడు అడిగాను, ఎన్ని ఫోటోలు తీసావు? అని. సుమారు నాలుగైదు తీసానంది. అప్పటికప్పుడే రీలు కడిగించమని పురమాయించింది. ' దేవీ గారి చిత్తం ' అంటూ ఇంటికి దగ్గర్లో ఉన్న ఫోటో స్టూడియోలో రీలు ఇచ్చి ఇంటికొచ్చి పడ్డాం.
మొత్తానికి మా ఆవిడ హ్యాపీస్!.
ఇందులో పేద్ద గొప్పేముంది. మీ అమ్మాయి గురించి బడాయిలు చెప్పుకోకపోవడానికి కాకపోతే, దీనిగురించి మా టైమెందుకు వేస్టుచేసావంటారా?. అక్కడికే వస్తున్నాను.
మరుసటిరోజు, ఫోటోలు తీసుకురావడానికి ఫోటో స్టూడియోకెళ్లి, మనవా కాదా అని నిర్ధారణ చేసుకోవడానికి పైపైన ఒకటి రెండు ఫోటోలు చూసి, అన్నీకలిపి కవరులోపల పెట్టి ఇంటికొచ్చాను.
లోపలకొస్తున్న నా చేతిలోంచి మా ఆవిడ కవరులాక్కుంది.
కానీలే అని, లోపలకెళ్లి బట్టలు మార్చుకొచ్చాను.
హాల్లోకొచ్చేసరికి అనిపించింది.. ఏదో జరగబోతోందని..
ఎప్పుడూ వసపిట్టలా మాట్లాడుతూనే ఉండే మా ఆవిడ ( వసపిట్ట అని అనకూడదట.. గలగలా మాట్లాడుతుంది అనాలట).. నిశ్శబ్ధంగా.. భావరహితంగా.. చేతిలో ఉన్న ఫోటో వంక తీవ్రంగా, తీక్షణంగా చూస్తోంది.
నెమ్మదిగా తన పక్కన కూర్చుంటూ ఏమిటా అని చూసాను.
ముందు అర్ధం కాలేదు.. తర్వాత కొద్దిగా నవ్వొచ్చింది..
తమాయించుకోవటానికి ప్రయత్నించాను.. వల్లకాలేదు..
మళ్లీ నవ్వబోతూ, నోటికి చేతులు అడ్డుపెట్టుకున్నను.. ఊహు.. పొలమారి దగ్గొచ్చింది..
దగ్గుతూనే, మిగతా ఫోటోలన్నీ చూసాను.
అంతసేపూ, మా ఆవిడ ఉన్న చోటినుంచీ కదలలేదు.. మొహంలో ఏభావమూ లేదు.. ఒక్కటంటే ఒక్క మాటకూడా లేదు.
ఎందుకంటారా?. తను వీరావేశంతో తీసిన నాలుగైదు ఫోటోల్లో ఇదొక్కటే వచ్చింది. అదేమిటో మీరే కింద చూడండి.
అయ్యా.. అదండీ సంగతి!.
ముగింపు: ఇంత జరిగిన తర్వాతకూడా, నేను బతికి బట్టకట్టి మీకు ఇది ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే దానికి కారణం - స్కూలు యాజమాన్యం ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌ని పెట్టి అన్ని ఫోటోలనీ తీయించి, తగిన రుసుము(??) తీసుకుని ఎవరి ఫోటోలు వారికి అందజెయ్యడంవల్లనూ, ఆ ఫోటో మా షోకేసులో విరాజిల్లుతూండడడంవల్లనూ - అని గమనించాలి.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి