చెప్తే పోతుందంటారు కదా!?. అందుకే చెప్తున్నాను.
అవ్విధంబెట్టిదనిన..
మొన్న సోమవారం, మహాశివరాత్రి నాడు.. మామూలుగానే కాలకృత్యాలు తీర్చుకుని, దేవుడుకి ఓ నమస్కారం పెట్టి, శివరాత్రి కాబట్టి శివుడ్ని కాస్త గట్టిగా "పట్టుకుని ఊపేసి", తయారయ్యి, నా శ్రీమతి అందించిన లంచ్ బాక్సు అనబడు చద్ది అన్నమును మూట కట్టుకుని "ఏరువాకా సాగారో.." అని పాడుకుంటూ కొలువుకి బయలుదేరాను.
ఔను.. మర్చిపోయాను.. ఆరోజు ఒక్క శివరాత్రి మాత్రమే కాదు.. ఆస్కార్ రాత్రి కూడా!!
(ఈ పై వాక్యాన్ని చిన్నప్పుడు సినిమాహాల్లో ప్రభుత్వ ప్ర్రయోజిత అడ్వర్టైజుమెంట్లలో వినిపించే వ్యాఖ్యానంలా చదువుకోవాలి!!)
కార్లో FM రేడియో రెహమాన్ మోత, ఆస్కార్ మోతతో దద్దరిల్లిపోతోంది. రేడియో మిర్చీలో హేమంత్, రేడియో సిటీలో వంశీ ఆస్కార్
కార్యక్రమానికి లైవ్ కామెంటరీ ఇచ్చేస్తూ, స్లం డాగ్ మిలీనేర్‌కి గానీ, రెహమాన్‌కి గానీ ఆస్కార్ వస్తే, హర్షాతిరేకంతో కేకలు పెట్టేస్తూ తెగ హడావిడి పడిపోతున్నారు. ఆ రెండు FM స్టేషన్లూ ఆరోజు (డబ్బింగు పాటలే అయినా కూడా) రెహమాన్ పాటలు మాత్రమే వినిపిస్తూ, పూర్తిగా రెహమాన్‌కి అంకితం అయిపోయాయి.. Only Rehaman, Rehaman all the way.
నేను కూడా రెహమాన్ స్వరాల విందుని ఆస్వాదిస్తూ, వేటూరి, రాజశ్రీల పదాలతో నంజుకుంటూ, అక్కడక్కడ పంటికింద తగులుతున్న A.M.రత్నం రాళ్లని తీ(ఊ)సిపారేస్తూ నా ప్రయాణాన్ని సాగిస్తున్నాను.
ఇంతలో..
కాస్త దూరంలో ఉన్న చౌరస్తాలో సిగ్నలు కనబడింది.. గ్రీనే!. కానీ దాని పక్కనె ఉన్న కౌంటరు 8 చూపిస్తోంది. నేను దాని దగ్గరకి వెళ్ళేటప్పటికి అది 4లోకి దిగింది. నేను సిగ్నలుని దాటిపోదామని ఆత్రంగా యాక్సిలరేటరు మీద బలాన్ని పెంచాను. కాని నా ముందు ఉన్న రెండు కార్లవాళ్లకి నా అంత ఆత్రమున్నట్టులేదు, వాళ్లిద్దరూ ఒకళ్ల తర్వాత ఒకళ్లు ' కస్స్..' అని బ్రేకువేసి ఆగారు. ఇంక తప్పక,నేను కూడా ' కస్స్.. '.
ఇక్కడ కాస్త జనరల్ నాలెడ్జ్..
ఈ మధ్యన మన హై' టెక్కు ' నగరంలో, ట్రాఫిక్ పోలీసులు నిభంధనలు అతిక్రమించిన వాళ్లని ఆపి చలాన్లు రాయడం మానేసారు.. దీనికి బదులుగా వాళ్లు మన బండి నంబరు నోట్ చేసుకుని, దాని ఆధారంగా RTA ఆఫీసునుంచి మన చిరునామా సంపాదించి, చలానుని మన ఇంటికే పంపిస్తారు. ఈ చలానాని మనం దగ్గరలో ఉన్న ఈ-సేవా సెంటరులో కానీ, పోలీసు స్టేషనులో కానీ కట్టెయ్యాలన్నమాట. కాదూ, మీరేమీ నిభధనలు అతిక్రమించలేదూ అనుకుంటే మీరు భేషుగ్గా కోర్టుకు వెళ్లొచ్చు.అందుకే మీరు గనక గమనిస్తే, సిగ్నళ్ల దగ్గర కాస్త మూలగా
ఒక పోలీసు (సాధారణంగా ఒక హోంగార్డు) ఒక పుస్తకంలో చాలా శ్రద్ధగా రాసేస్తూ ఉంటాడు. కొండొకచో డిజిటల్ కెమేరాలని పట్టుకుని ఫోటోలు తీసే పోలీసులని కూడా చూడొచ్చు.
నా ఉద్దేశ్యం ప్రకారం, ఇలా చెయ్యడంలో పోలీసులకి ఒక సౌలభ్యం ఉంటుంది. వాళ్లు ఎవరిదైనా కారుని ఆపగానే, కారులో వాడు "నేను
ఎవరినో తెలుసా?" అంటూ చెప్పే వారి పుట్టుపూర్వోత్తరాలు వినక్కరలేదు. అలాగే, బళ్లకి అడ్డుపడి వాటిని ఆపి, తద్వారా మరింత ట్రాఫిక్ జాములు సృస్టించక్కర్లేదు.
సరే, విషయానికొస్తే.. రోజూ అదేదారిలో వెళ్లే నాకు తెలుసు అది రెండున్నర నిముషాల (150 సెకండ్ల) సిగ్నలని. ఆ కౌంటర్ని ఏమి చూస్తాంలే అనుకుంటూ, రేర్ మిర్రరులో నా అందాన్ని ఒకసారి చెక్ చేసుకుని, ముందరి అద్దాన్ని (wind sheild) ఒకసారి
శుభ్రం చేసుకుని, మళ్లీ ఇంకోసారి అందాన్ని సరి చేసుకుని, మొబైల్లో ఏమన్నా SMSలు వచ్చాయా (ఉత్తినే!.. ఏమీ రావు,
రాలేదని తెలిసినా కూడా!) అని చెక్ చేసుకుంటున్నాను.
ఇక్కడ ఓ చిన్న ట్రివియా..
సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మనం ఏమేమి పనులు చేసుకోవచ్చు?..
- అందాలని సరిదిద్దుకోవచ్చు.
- కార్లో ఉంటే, లోపలా బయటా శుభ్రపరుచుకోవచ్చు.
- SMS లు, calls చెక్ చేసుకోవచ్చు.
(ఈ మూడు నేను already చేసేసాను కదా!!. ఇంకా..)
- పక్కబళ్లవారికి సైటు కొట్టుకోవచ్చు. (తదనంతర పరిణామాలకి నేను భాద్యుడ్ని కానే కాదు!).
- పక్కనవారిని ఓ ఫైవ్ అప్పడగొచ్చు.
- పక్కవాళ్ల చీరలు, డ్రెస్సులు ఎంత బాగున్నాయో చూపించి నాకూ అట్లాంటిది కొనొచ్చుగా అని అడగొచ్చు.
- ప్రొవొకేటింగుగా ఉన్న వాల్‌పోస్టర్లనీ, హోర్డింగులనీ (ఒంటరిగా ఉంటే ధైర్యంగా, better half పక్కన ఉంటే దొంగచూపులతో)
చూడొచ్చు.
- బస్సులలో ఉన్నవాళ్లయితే తమ నోట్లో ఉన్న పాన్‌మసాలాతో పక్కన ఉన్న బళ్లవాళ్లమీదా, పక్కన నడుస్తున్నవాళ్లమీద మీదా రంగురంగుల అద్భుతాలని సృష్టించొచ్చు..
.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో!!
సరే, బాగా సైడుట్రాకు అయిపోయినట్టున్నాను. విషయానికొస్తే..
అలా నా క్రాఫుని సరిచేసుకుంటూంటే, నా కారుకి రెండుపక్కలనుంచీ ఇద్దరు ద్విచక్రవీరులు వచ్చి నా వంక కోపంగా చూస్తూ నన్ను ఏదో అంటున్నారు. నాకు ఏమీ అర్ధంకాలేదు కానీ, ఎందుకులే వాళ్లతో పెట్టుకోవడం అని ఊరుకున్నాను.
ఇంతలో ఒకతను, ఇంకా పెద్దగా అరుస్తూ, కిటికీ అద్దాలు దించమన్నట్టు సైగ చేస్తుంటే, నాలో దూర్వాసుడు మేల్కున్నాడు.
దురుసుగా అద్దాలు దించుతూ నాకు దగ్గరలో ఉన్న ఆయనతో, "ఆ!! ఏవిటీ?" అన్నాను.
అతను నాకంటే దురుసుగా, "వెనకాళ్ల వాళ్లని చూసుకునే పని లేదా?" అని అంటూ మీదమీదకి వస్తున్నాడు.
నాకస్సలు అర్ధం కావట్లేదు.
"వెనకాలవాళ్లని నేను ఎందుకు చూసుకోవాలి?" అన్నాను నేను అమాయకంగా!.
ఇదంతా జరుగుతున్నంతసేపూ, నా కారుకు రెండో వైపు ఉన్నాయన, రెండు చేతులూ గాల్లో ఊపుతూ, ఏదో భావవిన్యాశం చేస్తూనే
ఉన్నాడు.
నాకేదో కొద్దిగా అర్ధం అయినట్టనిపించిది. ఇందాక సిగ్నలు పడ్డపుడు నేను కాస్త సడెన్ బ్రేకు వేసాను కదా. నా వెనకాల ఉన్న ఈ క్యాండేట్లు ఇద్దరూ, నాలాగా అర్జంటుగా బ్రేకు వెయ్యలేక (మరి అందరూ, నాలా Spontaneousగా ఉండరు కదా!?)కాస్త కిందామీదా అయినట్టున్నారు. మరి అది వాళ్ల తప్పుకదా? నన్నంటారేమిటి?. వాళ్లు కదా జాగ్రత్తగా ఉండాల్సింది?.
అంతే, నేను కూడా వాళ్లమీదపడి అ(క)రిచెయ్యడం మొదలుపెట్టాను.
చుట్టుపక్కల ఉన్న వాళ్లు, మమ్మలని శాంతపరచడానికి ప్రయత్నిస్తున్నారు.
ఇంతలోకి, సిగ్నలు మారడంతో, "పోరా!" అంటే "పోరా!" అనుకుంటూ బయలుదేరాం. ఆ ద్విచక్రవీరులిద్దరూ, నా ముందుకొచ్చి ఒకసారి మళ్లీ నావంక కౄరంగా చూసి, జయ్యిమని వెళ్లిపోయారు.
నేను కూడా, "శాంతి.. శాంతి.." (అమ్మాయికాదు.. Peace) అనుకుంటూ నన్నునేను చల్లబరుచుకుని వెళ్తూఉంటే..
.. మళ్లీ సిగ్నలొచ్చింది.
.. మళ్లీ ఆగాను.
ఏదో శబ్దం వినబడితే పక్కకి చూసాను. ఒక ద్విచక్రవీరుడు (ఇందాకటి ఇద్దరూ కాదు) నావైపు ఉన్న కిటికీ అద్దమ్మీద చిన్నగా కొడుతూ అద్దం కిందకి దించమని అంటున్నాడు. మళ్లీ కోపం నషాలానికంటుతూ ఉంటే, అద్దం కిందకి దించాను తాడో పేడో తేల్చుకుందామని.
కాని ఆ పెద్దమనిషి మొహంలో కోపంలేదు సరికదా, కాస్త సర్దిచెప్పేధోరణిలో ఏదో అంటున్నాడు. ఓ పక్కన "జయ హో!" తో హోరెత్తుతున్న రేడియో సౌండ్ తగ్గించి "ఏవిటీ?" అని అడిగాను.
అప్పుడు ఆయన చెప్పింది వింటూ ఉంటే నా మొహంలో రంగులు గ్యారంటీగా మారి ఉంటాయి.
ఇంతకీ ఆపెద్దమనిషి చెప్పినదాని సారాంశం ఏమిటంటే,నేను ఇందాక సిగ్నలు దగ్గర ఆగినప్పుడు కారు అద్దాన్ని (Wind Shieldని) శుభ్రం చేసేటప్పుడు, మరి alignment లో తేడానో ఏమో గాని, ఫోర్సుగా వచ్చిన నీరు నా కారు అద్దమ్మీదేకాకుండా, గాల్లో బాగా పైకిలేచి వెనకాల ఉన్నవాళ్లని పునీతులని చేసిందనీ, అదే వాళ్ల బాధ(కోపాని)కి కారణమనీ!.
ఆయన చెప్పింది పూర్తిగా విన్న తరువాత నాకు కొద్దిగా బాధేసింది .. మరి కొద్దిగా సిగ్గేసింది. బాధ - వాళ్లని అసౌకార్యానికి గురిచేసినందుకు, సిగ్గు- తప్పు నాదైనా ఎదురుతిరిగి వాళ్లనే తప్పుపట్టినందుకు.
ఇంక ఏమీ చెయ్యలేక, ఈ పెద్దమనిషికే "సారీ"లు అన్నీ సమర్పించుకుని అక్కడనుండి బయలుదేరాను.
అసలు ద్విచక్రవీరులిద్దరికీ, ఈ టపా ద్వారా క్షమాపణలర్పించుకుంటున్నాను.
అదండీ సంగతి!.
చెప్పేసాను.. మరి నా పాపం పోయినట్టేనా? :-)
చేసిన పాపం ఏమిటో చివరి లైన్ వరకూ చెప్పకుండా చాలా చక్కగా రాశారు..
రిప్లయితొలగించండిమీ బ్లాగెలా మిస్సయ్యానబ్బా?
రిప్లయితొలగించండిమీ కబుర్లు బాగున్నాయి, కాకరకాయలా ఏమాత్రం లేవు.. మీ సొంతడబ్బా కూడా అదిరింది..
చివరగా మీ టపా సూపర్బ్..
mi post lu baaguntunnaayi :)
రిప్లయితొలగించండిభలేగా రాశారండీ.. ;)
రిప్లయితొలగించండిమాకు చెప్పెశారుగా.. మీ పాపం పోయింది లెండి :)
హ హ హ.
రిప్లయితొలగించండిచాలా బాగుంది.
నీతి - రద్దీగా ఉన్న చౌరస్తాలో ఎర్రలైటు దగ్గర ఆగి ఉండగా అద్దము మీదికి నీరు చిమ్మకూడదు.
భ్రహ్మాండంగా వ్రాసారు ..:-)
రిప్లయితొలగించండిTrivia part is excellent.
@ మురళి గారు, ఉమాశంకర్ గారు, నేస్తం గారు, మధురవాణి గారు, కొత్త పాళీ గారు, మధు గారు
రిప్లయితొలగించండిమీ స్పందనలు నాకు ప్రోత్సాహకాలు ..
అందుకోండి నా ధన్యవాదాలు