30, డిసెంబర్ 2008, మంగళవారం

పేరులో 'నేం' ఉంది !!?

పోయిన వారాంతంలో ఒక కొలీగూ, ఇంకా చూస్తే ఒక వెయ్యి కిలోమీటర్ల "దూరం"లో బంధువూ, అన్నిటికంటే మించి మంచి మిత్రుడూ అయిన మా మధుగాడి కూతురి బాలసారె మరియు నామకరణ మహోత్సవానికి సకుటుంబసపరివారసమేతంగా హాజరయ్యాము.

అందరూ (చాలామంది) అనేట్టు, అది "బారసాల" కాదట!, "బాలసారె" అట (!?) పంతులుగారు చెప్పారు.. అంటే అప్పటిదాకా తల్లి చీరలతో చేసిన పొత్తిగుడ్డల్లో ఉండే (మగైనా, ఆడైనా) బాలకి మొదటిసారి "సారె" పెట్టడం.. అంటే మొదటిసారి కొత్తబట్టలు వెయ్యడం అన్నమాట. తెలుసుకుని నేను చాలా "హా"శ్చర్యపోయాను.


సరే, మావాడు వాళ్లమ్మాయికి మామూలుగానే కాస్త ఆధునిక పోకడలతో ఉండేది, ఇంకా ఇప్పటిదాకా ఎవరూ పెట్టుకోనిదీ (Unique) పేరు పెట్టుకున్నాడు. అది ఇక్కడ అప్రస్తుతం కాబట్టి దాని సంగతి వదిలేద్దాం.


కార్యక్రమం అంతా అయినతరువాత, పంతులుగారితో పిచ్చాపాటీలో, ఆయన చెప్పిన ఒకానొక "నామకరణ"మహోత్సవవైభవాన్ని .. చిత్తగించండి.


మనందరికీ తెలుసు, (దాదాపుగా) మనతరం పేర్లన్నీ మన పూర్వీకులనుండీ వంశపారంపర్యంగా వచ్చినవే!.. అలా
కాకపోతే గనక నాపేరులా "రవి" అయినా అయ్యుండాలి, లేకపోతే "శ్రీనివాసు"నో, "వెంకటేశ్వర్రావు"నో అయ్యుండాలి.. అవునా?.

సరే, విషయానికొస్తే..

ఒకానొక నామకరణమహోత్సవ సందర్భంలో, తల్లిదండ్రుల్లిద్దరూ పిల్లవాడికి పేరుపెట్టేవిషయంలో వాదులాడుకుంటున్నారు.

ఒక పెద్దమనిషి వాళ్లదగ్గరకెళ్లి అడిగాడు "ఏమిటి సంగతి?" అని.


పక్కనున్నవాళ్లలో ఎవరో చెప్పరు పిల్లాడి తల్లి "పిల్లవాడికి మా నాన్న పేరు పెట్టాలి" అంటే, తండ్రి "మా నాన్న పేరు పెట్టాలీ" అని వాదించుకుంటున్నారూ అని.

మరేమో ఈయన "పెద్ద"మనిషి కదా!. అందుకని పిల్లాడి తల్లిదండ్రుల దగ్గరకెళ్లి వాళ్లకి సర్ది చెబ్తూ, "ఇంత
చిన్నదానికి అంత రాద్ధాంతం ఎందుకర్రా చేస్తున్నారు?. మీమీ నాన్నల ఇద్దరి పేర్లూ కలిసొచ్చేట్టు పెట్టుకుంటేపోలా.."
అన్నాడు సమస్యకి పరిష్కారం చూపిస్తూ.

అక్కడితో ఆగకుండా "మీ నాన్న పేరేమిటి అబ్బాయి?" అడిగాడు.
"పిచ్చేశ్వర్రావు" అన్నాడు తండ్రి.

"మీ నాన్న పేరేమిటి తల్లీ?"
"పుల్లారావు" తల్లి సమాధానం.


"అంతేకదా, ఇప్పుడు మీమీ నాన్నల పేర్లూ రెండూ కలిసొచ్చేట్టు మీవాడికి భేషుగ్గా "పిచ్చి పుల్లయ్య" అని పేరు పెట్టుకోండీ!. శుభస్య శీఘ్రం!.."

18, డిసెంబర్ 2008, గురువారం

తెలుగుదేశం-బ్రహ్మానందం-కమ్యూనిస్టుపార్టీ

స్థలం: రాజోలు, (తూ.గో.జి).
సమయం:సుమారు 12 సంవత్సరాల క్రితం సంగతి (ఇంకా, ఎక్కువేనేమో!!!)
సందర్భం: ఏదో సినిమా షూటింగు.

షాట్ గ్యాప్‌లో విశ్రాంతి తీసుకుంటున్న బ్రహ్మానందం గారి దగ్గరకి ఒకతను వచ్చి తనని తాని బ్రహ్మానందం గారి అభిమానిగా పరిచయం చేసుకుని, ఆయన నటన తనని ఎంత ఆనందింపచేస్తుందో, ఇంకా ఆయన సినిమాల్లో తనకిష్టమైన సినిమాలు వగైరాలు అన్నీ చెప్తూ తన సంతోషాన్ని ఆయనతో పంచుకున్నాడు.

బ్రహ్మనందంగారు కూడా అతని పొగడ్తలకి లొల్లోపలే ఉబ్బితబ్బిబ్బు అవుతూ, అభిమాని కోరిక మీద అతనితో ఫోటో దిగారు.

మరుసటి రోజు.. (ఆ రోజుతో జరుగుతున్న షెడ్యూల్ పూర్తి అయిపోతుంది)ఆ అభిమాని మళ్లీ షూటింగు జరుగుతున్న స్పాట్‌కి వచ్చి, బ్రహ్మానందంగారిని కలుసుకుని, తన వెంట తెచ్చిన సంచీలో రెండు పెద్ద హార్లిక్సు సీసాలని తీసి ఆయనకి ఇచ్చాడు.

"ఏమిటివి?" అని అడిగిన బ్రహ్మానందంగారికి అతను "ఇవి మా ఇంట్లో ఇప్పుడే పెట్టిన ఆవకాయ, మాగాయనండీ. రాత్రే వీటి రుచి చూసానండీ. నాకు పిచ్చపిచ్చగా నచ్చేసినాయండీ. మీరు గూడా రుచి చూసి బాగున్నాయంటే నాకు బాగుంటదండీ.. ఆయ్!" అన్నాడు.

బ్రహ్మానందంగారు అతని భుజమ్మీద ఆప్యాయంగా తడుతూ, "చూడు బాబూ! మరీ రెండు సీసాలనీ పూర్తిగా ఇప్పుడే రుచి చూడడం కాస్త కష్టంగానీ, ఇవాళ రాత్రికి నేను హైదరాబాద్ వెళ్తున్నాను. అక్కడకి వెళ్లగానే వీటి రుచి చూస్తాలే. అయినా వీటిని చూస్తుంటేనే నోరూరుతోంది.. తప్పకుండా మాంచి రుచిగా ఉండుంటాయిలే!" అన్నారు.
అతను ఆనందంగా తల ఊపుకుంటూ వెళ్లిపోయాడు.
*** **** ****
స్థలం: మళ్లీ రాజోలే!
సమయం: సుమారు ఒక నెల తరువాత.
సందర్భం: మళ్లీ సినిమా షూటింగే!.
నటీ నటులు: చాలామందితోపాటు.. బ్రహ్మానందం గారు

(ఆ రోజున నేను కూడా ఆ షూటింగు జరుగుతున్న ప్రాంతంలో ఉండడం తటస్థించింది)
షాట్ గ్యాప్‌లో విశ్రాంతి తీసుకుంటున్న బ్రహ్మానందం గారి దగ్గరకి ఆ అభిమాని మళ్లీ వచ్చి తనని తాను మళ్లీ పరిచయం చేసుకోబోయాడు.

మధ్యలోనే అతని మాటలని అడ్డుకుంటూ, "గుర్తున్నావోయ్! బాగున్నావా?" అంటూ చిరునవ్వుతో పలకరించారు బ్రహ్మానందం.

ఆ మాత్రం దానికే ఉబ్బుతబ్బిబ్బైపోయాడు ఆ అభిమాని.

వెంటనే, "పచ్చళ్లు రుచి చూసారా సర్? ఎలా ఉన్నాయి" అడిగాడు అతను ఆత్రంగా.
అప్పటిదాకా, ప్రసన్నవదనంతో, చిరునవ్వుతో ఉన్న బ్రహ్మానందంగారి మొహం కాస్త కళ తగ్గినట్టయింది. అయినా
సర్దుకుని, కొద్దిగా "ఇబ్బంది(?)" మొహంతోనే "పచ్చళ్లు చాలా బావున్నాయయ్యా!" అన్నారు.

ఆయన మొహంలో వచ్చిన మార్పుని గమనించిన అతను, కాస్త ఖంగారుగా, "ఏంటి సర్! మొహమాటంగా చెప్తునట్టున్నారు. పచ్చళ్లు నిజంగా బాగున్నాయా? లేవా?" అని అడిగాడు.

బ్రహ్మానందంగారు "అట్లా ఏమీ లేదయ్యా.. పచ్చళ్లు చాలా బాగున్నాయి. ఇంకా చెప్పలంటే, వాటి రుచి మాకు ఎంతగా
నచ్చిందంటే నేనూ మా ఇంట్లోవాళ్లం అందరం కలిసి, రెండు సీసాలనీ రెండు వారాల్లో ఖాళీ చేసేసాం" అన్నారు.

"మరి ఇందాక మొహం అలా ఎందుకు పెట్టారు సర్?" అని అడిగాడు అతను అప్పటికీ అనుమానం వీడకపోవడంతో.
అతని మొహంలోకి కాసేపు అలానే చూస్తూ ఉండిపోయిన బ్రహ్మానందంగారు, "మొత్తానికి ఒదిలేట్టులేవు గదా..!" అంటూ తనదైన స్టైల్లో, తనవైన ముఖకవళికలతో, "ఏం చెప్పమంటావు నాయనా!.. తిన్నప్పుడు బాగానే ఉంది.. మాంచి దిట్టంగా, ఆవకాయ దట్టించి, పేరు నెయ్యి తగిలించి తిన్నంతవరకూ బానే ఉంది నాయనా!.. రెండు సీసాలు అయిపోయిన తరువాత అరే! అప్పుడే అయిపోయాయా అనిపించింది నాయనా!.. కానీ.."

.. అంటూ తన మొహాన్ని అరచేతులతో నలిపేసుకుంటూ..

".. ఆ తర్వాతే నాయనా!.. ఆ వేడికి ముందు నుంచీ తెలుగుదేశం (పసుపు రంగు).. వెనకనుంచీ కమ్యూనిస్టు పార్టీ (ఎరుపు రంగు) వెంబడపడుతుంటే నాయనా..!!! ఏమి చెప్పమంటావు నాయనా ఆ బాధని?.. ఎలా వర్ణించమంటావు ఆ ఆనందాన్ని?.. అదే అర్ధంకాక నాయనా నా మొహాన్ని అలా పెట్టాను.."

..అని బ్రహ్మానందంగారు అంటుంటే.. మీరేగనక అక్కడ ఉంటే ఏమి చేసి ఉండేవారు?

12, డిసెంబర్ 2008, శుక్రవారం

రేడియో - టీవీ

మా ఆఫీసులో ఒక కొలీగ్ ఉండేవారు. పేరు రమేష్.

మనిషి మంచివాడు, తెలివితేటలున్నవాడు, మృదుభాషి.. అన్నిటినీ మించి ఎప్పుడూ నగుమోముతో ఉంటూ, చుట్టుపక్కలవాళ్లవారి మొహాల్లో కూడా (చిరు)నవ్వులు పూయించగల నేర్పరి.

మేమిద్దరం ఒకేసారి ఆ ప్రాజెక్టులో చేరాము. పరిచయాలు అవటంతోనే మా రుచులు (రోజుకోచోట ఫుడ్డు ప్రయత్నిస్తూ ఉండేవాళ్లం), అభిరుచులు కలిసాయి.. అది స్నేహంగా మారటానికి ఆట్టే సమయం పట్టలేదు.

సరే.. ఇక విషయానికొస్తే..

ఈ మనిషి.. ఆఫీసుకొచ్చిన అరగంటలోనే, ఇంటిదగ్గరనుంచీ ఫోను వచ్చేది. ఈయన ఇంటి దగ్గర బయలుదేరినప్పటి నుండీ, ఆఫీసుకి వచ్చేలోపల ఈయన ప్రయాణ అనుభవాలు, ఇంకా ఆఫీసులో అప్పటిదాకా జరిగిన సంగతులు పూసగుచ్చినట్టుగా వాళ్లావిడికి చేరవేసేవాడు.

అలాగే, అటునుండి ఆవిడ కూడా ఈ అరగంటలో జరిగిన విషాయాలన్నీ ఈయనకి update చేసేది.

మళ్లీ ఇంకో అరగంట, గంట అయినతరువాత మళ్లీ ఇదే తంతు repeat అయ్యేది. ఇలా రోజు మొత్తమ్మీద ఒక 8-10 సార్లు ఈ ఫోనులో "ఇచ్చిపుచ్చుకోవడాలు" అవుతూ ఉండేవి. ఎంత సభ్యత కాకున్నా, పక్క సీట్లోనే ఉండడంవల్ల అవి (ఈయన మాట్లాడేవి) నా చెవిలో కూడా పడుతూ ఉండేవి.

దీనివల్ల, నాకొక సమస్య వచ్చి పడింది.. అదేమిటంటే..

ఒకసారి ఎప్పుడో మా అవిడతో ఈ విషయం అన్నా. అంతే..!. మా ఆవిడ నా మీద ఇంతెత్తున లేచింది.. "మీరూ ఉన్నారు ఎందుకూ? ఎప్పుడూ ఒక మాట ఉండదు, మంతి ఉండదు. అదేమంటే నువ్వు చెప్పు నేను వింటాను అంటారు?. బయటకి వెల్లొచ్చేది మీరు అయినప్పుడు విషయాలు మీ దగ్గర ఉంటాయా? నా దగ్గర ఉంటాయా?.. వగైరా.. వగైరా.." అంటూ.

నేను తలపట్టుకోక తప్పింది కాదు.

ఇంక తట్టుకోలేక మరుసటిరోజు, లంచ్ విరామంలో (ఆయన ఫోను మాట్లాడకుండా ఉన్నప్పుడు),ధైర్యం చేసి ఆయన్ని అడిగేసాను, "గురూగారూ! మీరు ప్రతీ అరగంటకి, గంటకి మీ శ్రీమతికి ఫోనులో జరిగినవన్నీ చెప్పేస్తూ ఉంటారు కదా!. మీరు రాత్రికి ఇంటికెళ్లి ఇంకేమి మాట్లాడుకుంటారు?" అని.

దానికి ఆయన చిద్విలాసంగా నవ్వి, నా మొహంలోకి చూస్తూ, "ఇంకేముంటాయి గురూగారూ! ఇవే విషయాలు మళ్లీ రిపీట్. కాకపోతే అప్పుడు కాస్త హావభావాలతో. అంటే పగలంతా రేడియో, రాత్రయితే టీవీ.. అంతే" అన్నాడు.

ఆయన చెప్పిన తీరుకి, నవ్వీ నవ్వీ నాకళ్లెంబట నీళ్లు తిరిగాయి.

5, డిసెంబర్ 2008, శుక్రవారం

గణపతి.. డాన్సింగ్.. why?

భ్లాగుదామనే సంకల్పంతో, బ్లాగుని మొదలుపెట్టిన తరువాత కూడా కొన్ని కారణాంతరాలవల్ల బ్లాగలేకపోవడంతో, విఘ్నాలు కలగకుండా చూడమని గణేశుడ్ని కోరుకుంటూ, ఆయన ప్రస్తావనతోనే మొదలుపెడుతున్నాను..
****
మొన్నీమధ్యన జరిగిన వినాయక చవితికి, మా ఇంటిముందు పెట్టిన వినాయకుడి మండపం ముందు జరిగిన సాంస్కృతిక కార్యక్రమాల్లో ఒక బుడ్డోడు (అంటే, నిజంగానే బుడ్డోడే.. 6,7 ఏళ్లు ఉంటాయనుకుంటా) చెప్పిన సరదా సంగతి.. ఆలకించండి..
****
అనగనగనగా ఒకసారి టైటానిక్ లాంటి ఓ పేద్ద పడవ చాలామంది జనాల్నేసుకొని వెళ్తూ ఉంటే, దానికి ఏదో అయింది.. మొత్తానికి మునిగిపోయేట్టుంది.

అప్పుడు, అందులో ఉన్న మహమ్మదీయులు అందరూ అల్లాని కాపాడమని ప్రార్ధిస్తే, అల్లా వచ్చి వాళ్లందరినీ కాపాడి తనతో తీసుకెళ్లిపోయాడు.

ఆలాగే, క్రైస్తవులు జీసస్‌ని ప్రార్ధిస్తే, జీసస్ వచ్చి క్రైస్తవులందరినీ అక్కడనుంచి క్షేమంగా తీసుకెళ్లాడు.

ఇంకా మిగతా మతాలవారు వాళ్ల వాళ్ల దేవుళ్లని ప్రార్ధించడం, వాళ్లొచ్చి వీళ్లని కాపాడడం జరిగిపోయాయి.

చివరికి మిగిలింది.. హిందువులు..

వీళ్లు, ముక్కోటిమంది దేవుళ్లున్నా.. మరి ఎందుకోగానీ.. వినాయకుడ్ని ప్రార్ధించారు, తమని కాపాడమని.

వెంటనే గణపతి ప్రత్యక్షమయ్యాడు. అక్కడ ఉన్న వాళ్లందరూ ఆనందపడిపోయి, (వాళ్ల వాళ్ల) తట్ట బుట్ట సర్దుకొని తయారయ్యారు గణపతితో వెళ్లడానికి..

కాని..

గణపతి, వీళ్లని ఏమాత్రం పట్టించుకోకుండా, ముందు చిన్నగా అటూ ఇటూ ఊగడం మొదలుపెట్టి, కాసేపయ్యేటప్పటికి వీరావేశంతో చిందులు, ఎగిరి దూకడాలు, జజ్జినికిడి లు, తీన్ మార్ లు, టప్పాం గుత్తి, బ్రేక్ డాన్సు.. ఇలా ఒకటేమిటి.. అన్ని రకాలుగా తన “నృత్య విన్యాసాలు” అన్నీ ప్రదర్శిస్తున్నాడు.

జనాలందరికీ ఏమీ అర్ధం కాని పరిస్థితి.. పడవేమో మునిగిపోయేటట్టుంది.. ఈయనేమో తనకేమీ పట్టనట్టుగా ఆనందంతో చిందులు, డాన్సులు వేస్తున్నాడు. ఈయన తాకిడికి గంటలో మునిగే పడవ 5 నిమిషాల్లోనే మునిగేట్టుంది.

ఇంక తట్టుకోలేక, జనాలందరూ గణపతిని అన్ని వైపులనుంచీ గట్టిగా పట్టేసుకొని, ఆయన నృత్యాన్ని విరమింపచేసి, కన్నీళ్లతో ఆయన కాళ్లమీద పడి.. “స్వామీ.. మేము ఇలా నీళ్లలో మునిగిపోబోతూ ఉంటే, మమ్మల్ని కాపాడాల్సిన నువ్వు ఇలా ఆనందంతో చిందులు వెయ్యడం ఏమన్నా న్యాయమా?. సమయం ఇంక ఎక్కువ లేదు. మమ్మల్ని త్వరగా కాపాడి ఇక్కడనుండి తీసుకెళ్లు స్వామీ!” అంటూ రకరకాలుగా ప్రాధేపడ్డారు.

గణపతి వాళ్లందరినీ వదిలించుకొని, మళ్లీ డాన్సు చేస్తూ.. “ఔనా?.. ఇందులో అన్యాయం ఏముంది?. మరి వినాయక చవితి అయిన తర్వాత, నన్ను (నా విగ్రహాన్ని) హుస్సేన్ సాగార్లో నిమజ్జనానికి తీసుకెళ్తూ మీరు కూడా ఇలాగే ఒళ్లు తెలియకుండా డాన్సులు చేస్తారే?. అదే కదా ఇప్పుడు నేను కూడా చేస్తుందీ?” అని అమాయకంగా అడుగుతూ అంతర్ధానం అయిపోయాడు గణపతి.


13, నవంబర్ 2008, గురువారం

ఎందరో మహానుభావులు..

..అందరికీ వందనాలు!

తొలిప్రయత్నంగా, నా మొదటి టపా!