10, సెప్టెంబర్ 2011, శనివారం

బేకారు కబుర్లు


.. అంటే "పనికిరాని కబుర్లు" అని కాదు. అలా అని పనికొచ్చే కబుర్లు అని కూడా కాదు. గతవారం కారు సర్వీసుకెళ్లడమ్మూలాన పుట్టిన కబుర్లు.. "కారు" లేని కబుర్లు. బే"కారు" కబుర్లు.  అదన్నమాట!  :)

                         ****************               ***************
ఇక్కడో చిన్న ముందుమాట..

మనముండే స్ఠలంలో/ఏరియాలో/పేటలో ఎండ విరగకాస్తూ ఉంటుంది, కానీ పక్కపేటలో ఉండే మనవాళ్లకి ఫోను చేస్తే అక్కడ కుంభవృష్టిగా వర్షం పడుతూఉందంటారు. భాగ్యనగరవాసులకి ఇది చాలావరకు అనుభవంలో ఉన్న సంగతే!. ఇది వేరే ఊళ్లల్లో కూడా నిజమవ్వొచ్చుగాక!, అక్కడ అంత పట్టింపు లేకపోవచ్చుగాక!. కానీ మన ఆఫీసు ఊరికి ఓ చివర ఉండి, మన ఇల్లు ఇంకో చివరన ఉంటే గనక ఇది పెద్ద సంగతే!.

సరే, విషయానికొస్తే.. కారులేదని చెప్పానుగా!. ఆరోజు ద్విచక్రవాహనమ్మీద ఆఫీసుకి వెళ్లాను. సాయంత్రం ఆఫీసు దగ్గర బయలుదేరినప్పుడు అక్కడ ఆకాశం చాలా నిర్మలంగా, ప్రశాంతంగా ఉంది. ముందు చెప్పుకున్నట్టుగా ఏనిమిషానికి ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, సాధ్యమైనంత తొందరగా ఇంటికి చేరుకోవాలని అనుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాను.

ఒక ఏరియాలోకి వచ్చేసరికి, అల్లంతదూరంలో నాలుగు రహదారుల కూడలిలో నాకు గ్రీన్ సిగ్నల్ కనబడుతోంది. ఎలాగూ సిగ్నల్ దగ్గరకి వెళ్లేసరికి అది ఎరుపులోకి మారటం ఖాయం కాబట్టి, నా బండి వేగాన్ని తగ్గించాను. అనుకున్నటుగానే, సిగ్నల్ ఎరుపులోకి మారింది. నేను బండిని ఆపాను. నా ముందు రెండు వరసల్లో మరి కొంత మంది ద్విచక్రవాహనచోదకులు ఆగి ఉన్నారు.

నేను చాలా తీవ్రంగా సిగ్నల్‌కేసే చూస్తున్నాను. కాసేపటికి సిగ్నలు ఆకుపచ్చలోకి మారింది. కానీ నా ముందున్న రెండువరసల ద్విచక్రవాహనచోదకులు కదలడంలేదు. నేను హారన్ కొట్టాను. ఇంతలో నావెంక ఉన్నవాళ్లు కూడా హారన్ కొట్టడం మొదలుపెట్టరు. నేను వెనక్కి తిరిగి ముందువాళ్లు కదలడంలేదన్నట్టు సైగ చేసి, మళ్లీ గట్టిగా, అసహనంగా హారన్ కొట్టాను.

అప్పుడు నా ముందు వరసలో ఉన్న ఒకతను "నువ్వెళ్లాలంటే పక్కనుండి వెళ్లు" అన్నట్టుగా చేత్తో సైగ చేసాడు. తనబండి ఏమన్నా ఆగిపోయిందేమో అనుకుంటూ అతన్ని దాటుకుని ముందుకువెళ్తే ముందువరసలో అతను కదలడే?. మళ్లీ హారన్ కొట్టాను. ఆ ముందు వాడు నావంక కాస్తంత చిరాగ్గా చూసి కొద్దిగా దారి ఇచ్చాడు.

ఆకుపచ్చ సిగ్నలు పడ్డా కదలని వాళ్ల అజ్ఞానానికి నవ్వుకుంటూ నా బండి వేగాన్ని పెంచబోయిన నాకు, ఎవరెంత జ్ఞానులో వెంటనే అర్ధమయ్యి "కస్స్.." మని బ్రేకు వేసి బండిని ఆపాను.

ఎందుకంటే..

నాకు ఎదురుగా కనబడుతున్న ఆకుపచ్చ లైటు వెలుగుతున్న సిగ్నలు స్థంభం మొదలుకుని మేము వెళ్లాల్సిన దారి అంతా కుండపోతగా వర్షం పడుతోంది మరి!!!!

విచిత్రంగా, మేము నిల్చున్నచోట ఒక్క వర్షపు చినుకు కూడా లేదు. ఎవరో గీతగీసినట్టుగా,మేఘాలకి గోడ కట్టినట్టుగా సిగ్నల్‌కి ఆవతలపక్కనే వర్షం పడుతోంది.!!!

అలా రెండు సిగ్నళ్లు గడిచేసరికి ఆటోవాళ్లకి, కార్లవాళ్లకి, బస్సులవాళ్లకి అసహనం పెరిగిపోయింది. వాళ్లకి దారి ఇచ్చి, వర్షం ఓ మాదిరిగా శాంతించి మేము బయల్దేరేసరికి 7,8 ఆకుపచ్చ సిగ్నళ్లకోసం ఎదురుచూడాల్సొచ్చింది ఆరోజు..!

                         ****************               ***************

                         ****************               ***************

పై సంఘటన జరిగిన తర్వాత రోజు రిస్కు ఎందుకులే అని, ఆరోజుకి బాషా (ఆటోవాలా)ని ఉధ్ధరిధ్ధామని నిర్ణయించుకున్నాను. సరే, ఉదయం అలాగే ఆటోలో ఆఫీసుకి వెళ్లిపోయాను.

సాయంత్రం, ఆఫీసునుండి బయటపడేసరికి సన్నగా తుంపరలు పడుతున్నాయి. రోడ్డు మీదదాకా వచ్చి ఆటో గురించి ఎదురుచూస్తున్నాను. ఆటోలు వస్తున్నాయి, పోతున్నాయి.. వచ్చినవాటిలో అంతకుముందే జనాలు ఉండడంతో కొన్ని ఆటోలు ఆగకపోతే, ఒకటో రెండో ఖాళీ ఆటోలు నాదగ్గరకొచ్చి ఆగి, నేనెళ్లాల్సినచోటు పేరు చెప్పేసరికి రామంటూ తుర్రుమన్నాయి.

ఈలోపల వర్షం పెద్దదవుతోంది. చుట్టుపక్కలెక్కడా తలదాచుకునే స్థలం కనబడలేదు. "తాదూరకంత లేదు.." అన్నట్టు భుజమ్మీద లాప్‌టాప్ అనే డోలొకటి!.

ఇక లాభంలేదు. ఇప్పుడు ఏ ఆటోవాడు వచ్చినా వాడు ఎక్కడదాకా తీసుకెళ్తానంటే అక్కడదాకావెళ్లి, కావాలంటే అక్కడనుండి వేరే ఆటో మాట్లాడుకుని ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను.

ఇంతలో.. ఏదేవుడో వరమిచ్చినట్టుగా నాకు ఓ పది అడుగులదూరంలో ఓ ఆటో ఆగింది. అందులో ఉన్న జనాలు దిగి ఆటో అతనికి డబ్బులు ఇచ్చి వెళ్లిపోతున్నారు.

నేను ఆటోకి, ఆటోలోంచి దిగినవాళ్లకి ఎదురుగా వడివడిగా అడుగులువేసాను. ఆటోలోంచి దిగినవాళ్లలో ఒకతను నావంక చూస్తూ కాస్తంత వెటకారంగా నవ్వినట్టనిపించింది. వేరే సంధర్భంలో అయితే నేనుఎలా ప్రవర్తించి ఉండేవాడినోగానీ ఆ సమయానికి పెరుగుతున్న వర్షంలో ఆటోని అందుకోవడమే నా ధ్యేయంగా సాగుతున్న నన్ను ఆవెటకారం నవ్వు ఏమీ చెయ్యలేకపోయింది.

నేను ఆటోదగ్గరకి వచ్చేసరికి ఆటోవాలా ఏదో అంటున్నాడు. అతను ఎటువైపు వెళ్తుంటే నేను కూడా అటే వెళ్లాలని ముందే నిర్ణయించుకుని ఉండడంవల్ల, "నేనూ అటే వస్తాను పద" అంటూ లోపలకి ఎక్కబోయాను. కానీ అతను ఖంగారుగా చేతులూపుతూ ఏదో చెప్తున్నాడు. ఇంక అతను ఏమి చెప్తున్నాడో నాకు వినక తప్పలేదు.

"ఏమిటీ" అని రెట్టించి అడిగాను.

అతను చూపుడువేలు, మధ్యవేలు కలిపి V ఆకారంలో పెట్టి అంటున్నదేమిటంటే"భాయిసాబ్! ముఝే అర్జెంట్ నంబర్ 2 జానా హై. ఇసీలియే ఉన్ లోగోంకో భీ ఉతార్ దియా" (అన్నా! నేను అర్జెంటుగా నంబర్ 2 కి వెళ్లాలి. అందుకనే వాళ్లని కూడా దింపేసాను).

అది నాకు పూర్తిగా అర్ధమయ్యేలోపే, గన్నులోంచి బయటకి వచ్చిన బుల్లెట్టులాగా, వింటిని విడిన బాణంలాగా ఆటోతో సహా మాయమైపోయాడు.

అప్పుడు తెలిసింది నాకు ఇందాక అతని వెటాకారపు నవ్వుకి అర్ధం..

.. ఇంగ్లీషులో ఏదో అంటారు చూడండీ.. Shit Happens..!!!.. అచ్చం ఇలాగే!  :(

3, సెప్టెంబర్ 2011, శనివారం

నా "కుచేల"మిత్రుడు


పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి.. ఒక జ్ఞాపకంగా, గుర్తుగా మిగిలిపోయాడనుకున్న ఒక బాల్యమిత్రుడు ఎక్కడినుండో ఊడిపడ్డాడు..

.. మొన్నీమధ్యన ఫోను చేసాడు.

                               **********    *********

నాకు తెలియక అడుగుతానూ?. ఎవరైనాసరే అసలు పరిచయంలేనివాళ్లని ఎలా సంభోదిస్తారూ? "ఏవండీ","మీరు" వగైరా వగైరా కదా?. సరే, అప్పటికి ఇంకా మేము ఏడోతరగతే చదువుతున్నాం కాబట్టి, మహా అయితే "నువ్వు".. కదా?

కానీ వీడ్నేమనాలండీ..?, మొదటిరోజు క్లాసులోకి వస్తూనే పక్కన కూర్చుంటూ, ముక్కూ మొహం తెలియనివాడ్ని పట్టుకుని, "ఏరా బావా?" అనేవాడిని..??!!

తెల్లబోయి, బిక్కమొహంవేసుకుని చూస్తున్న నామొహంవైపు ఓ వంకరనవ్వు విసిరి, "ఏంట్రా? బావా అన్నానని ఫీలయ్యావా?" అంటూ పక్కవరస బెంచీల్లో కూర్చున్న అమ్మాయిలవంక చూపిస్తూ, "వాళ్లందరూ నీకు 'సిస్టర్స్' అయితే నువ్వు నాకు బావవే కదరా?" అన్నాడు కళ్లెగరేస్తూ..

అదీ, మా తొలిపరిచయం..!

                               **********    *********

మీకిప్పటికే అర్ధమైఉండాలి వాడెంత అల్లరివాడో! ఎంత ఆకతాయివాడో!. వాడి పిచ్చివేషాలకి నేను బలైన సంధర్భాలు కోకొల్లలు. అదేమంటే "మరీ అంత మెత్తగా, అమాయకంగా ఉంటే ఎలారా బావా?. నువ్వలా ఉంటే నాలాంటివాళ్లకి నిన్ను మెత్తబుద్ధేస్తది.. ఇలా ఇరికించబుద్ధేస్తది" అనేవాడు.

అయినాకూడా వాడెంతో నచ్చేవాడు నాకు.. ఎందుకంటే.. నేను చెయ్యాలనుకుని, ఇంట్లోవాళ్ల భయంవల్లగానీ, స్వతహాగా నాకు ధైర్యం లేకపోవడంవల్లగానీ చెయ్యలేకపోయిన ఎన్నో పనులు వాడు సునాయాసంగా చెయ్యగలిగేవాడు.. అందుకు!!

అప్పటికీ, వాడి సావాసంలో నేను చాలా ఘనకార్యాలు సాధించాను.. మొదటిసారి సిగరెట్టు తాగాను, అప్పుడే కిందకి దించిన కుండలో నురగలు కక్కుతున్న కల్లు రుచి చూసాను, వాడు అమ్మాయిలవెంటపడుతుంటే వాడివెనకాల నేను వెళ్లాను.. అమ్మాయిలతో చీవాట్లు తిన్నాను.. నాకున్న కొద్దిపాటి "గుడ్‌విల్" తో వాళ్ల అన్నదమ్ములతో తృటిలో దెబ్బలు తప్పించుకున్నాను. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో!!

                               **********    *********

ఇంటర్మీడియట్ అయినతర్వాత నేను ఇంజనీరింగులో చేరడానికెళ్తుంటే (వాడు B.Scలో చేరాడు), నాకు వీడ్కోలు పలకడానికి వచ్చిన వాడి కళ్లల్లో నీళ్లు..!!. నాకు చాలా ఆశ్చర్యమేసింది.. ఎందుకంటే అట్లాంటి సున్నితత్వం నేను అంతకుముందెన్నడూ వాడిలో చూడని, ఎరగని కోణం.

ఈ-మెయిళ్లు,చాట్లు, సెల్ ఫోన్లు లేని ఆరోజుల్లో, కాలేజీ ఉన్న రోజుల్లో ఉత్తరాలలో,  సెలవలకి వచ్చినప్పుడు మా ఊళ్లో మా స్నేహం సాగింది. అంతలోనే వాళ్ల నాన్నగారు కాలం చెయ్యడంతో, వాళ్లు తన మేనమామావాళ్ల ఊరు వెళ్లిపోవడం, నేను థీరీలు, ప్రాక్టికల్సు, మార్కుల వెనక పరిగెడ్తూ ఉండడంలో మా మధ్య ఉత్తరాల సంఖ్య కూడా నెమ్మదిగా తగ్గిపోయి.. కొన్ని రోజులకి పూర్తిగా ఆగిపోయాయి.

                        ********** *********
ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు అందులో ఏదైనా సీను నా స్కూలు రోజులని గుర్తు చేస్తే వెంటనే నాకు వాడే గుర్తొచ్చేవాడు.. మేమిద్దరం కలిసి గడిపిన సమయం గుర్తొచ్చేది.. నా పెదవులమీద చిరునవ్వు విరిసేది.

ఉద్యోగంలో చేరిన తర్వాతా, నేను పెళ్లి చేసుకోబోయేటప్పుడు, ఇంకా అనేక సంధర్భాల్లో వాడి ఆచూకీకోసం పరస్పరమిత్రుల దగ్గర చాలా ఆరాలు తీసాను. ఫలితం శూన్యం. ఇంకా చెప్పాలంటే, కొంతమంది స్నేహితులు అట్లాంటివాడు ఒకడుండేవాడని కూడా పూర్తిగా మర్చిపోయారు.. అంతలా వాడు "అంతర్ధానం" అయిపోయాడు.
                             ********** *********

అట్లాంటివాడు ఇప్పుడు మళ్లీ "ప్రత్యక్షం" అయ్యాడు..

..వాడే నాకు ఫోను చేసాడు.

"ఏరా బావా? బావున్నావా?" అని ఫోనులో వాడి పలకరింపుతో నా మనసు పులకించింది.

కానీ.. వాడి మాటల్లో, వాడి గొంతులో ఏదో తేడా..!. అంతకు ముందు మేమెప్పుడు కలిసినా వాడు "వక్త" అయితే, నేనెప్పుడూ "శ్రోత"ని. అలాంటిది ఇప్పుడు మా పాత్రలు తారుమారు అయ్యాయి. నేను ప్రశ్నలు వేస్తుంటే వాడు ముక్తసరిగా, నసుగుతున్నట్టుగా, సంకోచంగా, దాటవేసే సమధానాలు ఇస్తున్నాడు.

సడెన్‌గా నా బుర్రలో ఏదో మెరిసింది..నాకు అర్ధమయ్యింది.. వాడు అలా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో?. వాడు ఆర్ధికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నాడు.. Yes! That's it! He is not able to make both ends meet. అందుకని నా దగ్గరనుంచి సహాయం ఆశిస్తున్నాడు.

వాడిని ఆ స్థితిలో కలుసుకోవడం బాధగా ఉన్నా, వాడికి నేను సహాయపడగలను అన్న ఆలోచన నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. కాని వాడు ఏక్కడ ఉంటున్నాడో, చిరునామా ఏమిటో తెలుసుకొనేసరికి నా తలప్రాణం తోకకొచ్చింది. ఏమో! వాడి పేదరికాన్ని నేను చూడకూడదనుకుంటున్నాడేమో?.

వాడ్ని తొందర్లోనే కలుస్తానని భరోసా ఇచ్చి ఫోను పెట్టేసాను.
 
                                      ******** ************
 
ఆఫీసులో పని ఒత్తిడులవల్ల, ఆ "తొందర్లోనే" రావడానికి ఓ వారం పట్టింది. వాళ్ల ఊర్లో దిగినతర్వాత వాడి చిరునామాని చాలా సులభంగానే కనుక్కున్నాను.. కానీ..
 
.. నేను ఊహించిన దానికి, నేను చూస్తున్నదానికి "అస్స్..స్స్..సలు" పొంతనలేనేలేదు.
 
..ఎందుకంటే, నేను ఒక పే..ద్..ద్ద బంగళా ముందు నుంచోని ఉన్నాను. దాని విస్తీర్ణమంతా చూడడానికి నేను తల ఆమూలనుంచి ఈమూలదాకా తిప్పాల్సివచ్చింది. గేటు దగ్గర తచ్చాడుతున్న నన్ను చూసి వాచ్‌మ్యాన్ బయటకి వచ్చాడు. నేను నాపేరు చెప్పి, ఎవరిని కలవడానికొచ్చానో చెప్పాను. తను ఇంటర్‌కాంలో మాట్లాడి, తలఊపి నన్ను చాలా మర్యాదగా లోపలకి పంపించాడు.
 
నేను ముందుకి నడుస్తూ చుట్టూ చూసాను..సుమారు 100 అడుగులున్న "డ్రైవ్ వే"కి ఒకవైపు అంతా రంగురంగుల పూలమొక్కలుంటే, రెండోవైపంతా పచ్చటిగడ్డితో మిలమిలా మెరుస్తోంది. డ్రైవ్ వేకి ఆ చివర, ఇంటిబయట.. బట్టతలతో, బానలాంటి పేద్ద పొట్టతో, రెండుచేతులూ నడుము మీద ఉంచుకుని ఒక వ్యక్తి నుంచొని ఉండడం గమనించాను..
 
ఇంకాస్తముందుకి నడిచాను.. ఇప్పుడు అక్కడ నిల్చున్న వ్యక్తి 36 పళ్లూ బయటపెట్టి పళ్లకిచ్చలా నవ్వడం కనబడుతోంది.. కాస్త తేరిపార చూసాను..ఆ వ్యక్తిలో "వాడి" పోలికలు కనబడుతున్నాయి. వాడి పోలికలేవిటీ? అది "వాడే!!!!".. నా మొహంలో ఖంగారుని, నా హావభావాలని చూస్తూ, వాడు నామీదవేసిన ప్రాక్టికల్ జోకుని "ఎంజాయ్" చేస్తూ.. వాడే!!
 
చేతులు చాచి వాడు ముందుకి నడిచాడు. నేను కూడా వడివడిగా ముందుకి అడుగులువేసాను. మరుక్షణంలో మేమిద్దరం గాఢాలింగనంలో బంధింపబడి ఉన్నాం. మా ఇద్దరి మధ్యా ఏమీ మాటల్లేవు.. కానీ మేమిద్దరం మా స్కూలురోజుల్లోకి వెళ్లిపోయాము. నా కళ్లల్లో తడి నాకు స్పష్టంగా తెలుస్తోంది.
 
అప్పుడే బయటకి వచ్చిన తన శ్రీమతిని , "ఇదిగోరా బావా! నీ అక్కా, చెళ్లెళ్ల లిష్టులో ఇంకో చెల్లెలు.. " అని పరిచయం చేస్తూ పెద్దగా నవ్వుతుంటే, "వీడు ఏబాధల్లోనూ లేడు" అన్న నిజం నా మనసుని దూదిపింజలా తేలికచేస్తే, నేను కూడా మనసారా వాడి నవ్వుతో శృతి కలిపాను.
 
                                      ******** ************
 
తర్వాత మాటలమధ్యలో, వాడిని కలవకముందు వాడి గురించి నేను చేసిన ఆలోచనలగురించి Confess చేస్తే, "అవునురా బావా! నువ్వనుకున్నదాంట్లో ఏతప్పూలేదు. Definitely I am not able to make both ends meet.చూడు.." అంటూ నడుముమీద రెండు చేతులుపెట్టుకుని, "ఈ చుట్టుకొలతతో ఎంత పొడుగుబెల్టుపెట్టుకున్నా రెండు కొసలు అస్సలు కలవటల్లేదురా!!!" అని పెద్దగా నవ్వేసాడు.. ఏమనాలండీ వీడ్నీ??
 

20, ఆగస్టు 2011, శనివారం

నా "దోస్తానా"


అప్పుడెప్పుడో జరిగిన "కబురు" ఇది..

నేనూ, మరి కొందరు మిత్రులు ఒక శనివారం సాయంత్రం పిచ్చాపాటీగా కలుసుకోవాలని నిర్ణయించుకున్నాం .. "కాఫీ డే" లో. (చూసారా?.. మేము ఎంత బుద్ధిమంతులమో?)

ఎప్పటిలాగానే, అందరికంటే ముందుగా నేను నిర్ణీత సమయానికి, నిర్ణీత స్థలానికి చేరుకున్నాను. (అందరిలోకి నేనింకాస్త ఎక్కువ బుద్ధిమంతుడ్నన్నమాట!).

అందరికీ ఫోన్లు చేస్తే తేలిందేమిటంటే.. అందరికంటే ముందు రాగలిగినవాడు రావడానికి కనీసం ఇంకా అరగంట పడుతుందీ అని.

నేను wait చెయ్యాల్సిందే!. సరేనని బయట గొడుగులువేసి, వాటికింద కుర్చీలు వేసిన ఒక ప్లేసు చూసుకుని, కూర్చుని చుట్టూ చూస్తే.. నేనొక్కడ్నే ఏ"కాకి"ని.. మిగతా ప్లేసులన్నిటినీ జంట"పక్షులు" ఆక్రమించేసుకున్నాయి. రెండో నిమిషానికే నాకర్ధమయ్యింది నేనొక్కడ్నే కాకినెందుకయ్యానో?. అక్కడ ఉన్న దోమలని భరించడానికి తప్పనిసరిగా ప్రేమలో ఉండి తీరాలి.. ఎందుకంటే ప్రేమకి మాత్రమే దేన్నైనా భరించగలిగే శక్తి ఉంటుంది కదా..? :)

ఈసురోమనుకుంటూ రెస్టారెంటు లోపలకెళ్లాను. ఇక్కడ వాతావరణం కొద్దిగా వేరుగా ఉంది.. ఉంటే అమ్మాయిలు గ్రూపుగా ఉన్నారు, లేకపోతే అబ్బాయిలు గ్రూపుగా ఉన్నారు.. అక్కడక్కడా కొన్ని మినహాయింపులు ఉన్నాయనుకోండి. అన్ని గుంపుల మద్యలో నేనొక్కడినే ఒంటిగాడ్ని.. సరే ఏంచేస్తాం.. ఒక సీట్లో అసీనుడ్నై చుట్టుపక్కల అంతా మళ్లీ పరికించా.. సరిగ్గా నా ఎదురుగా ఉన్న అమ్మాయిల గుంపులో నావైపే "ఫేస్" చేసి కూర్చున్న ఓ అమ్మాయి "మస్తు"గా ఉంది. నేను కూర్చున్న సీట్లోనుంచి ఆ మస్తు అమ్మాయి మాంచి వ్యూలో కనబడుతూ ఉంది.

ఇంకా పరిసరాల్ని గమనిస్తూంటే గోడకి తగిలించిన టీవీలో క్రికెట్ మ్యాచ్ వస్తోంది. ఎవరెవరు ఆడుతున్నరూ? ఓహ్.. ఇండియా శ్రీలంకానా?. అరే.. అసలు ఈ మ్యాచ్ గురించే మర్చిపోయానే? సర్లే కానీ..!

అలా కాసేపు (డైరెక్టుగా)టీవీ వంక, కాసేపు (తను చూడకుండా)ఆ అమ్మాయి వంకా మార్చి మార్చి చూస్తూ ఉన్నాను. ఇంకా చెప్పాలంటే టీవీని తక్కువ.. అమ్మాయిని ఎక్కువ.. :)

నేను చూస్తూండగానే ద్రావిడ్ ఔటయ్యాడు. యువరాజ్ వచ్చాడు. వికెట్లకి దూరంగా వెళ్తున్న బంతికి బ్యాటుని ఎలా తాకించాలా అని తెగ ప్రయత్నిస్తున్నాడు. మొత్తానికి కొన్నిబంతుల తర్వాత అందులో విజయం సాధించి వికెట్‌కీపరుకి క్యాచ్ ఇచ్చి ఇంటికి బయల్దేరాడు.

ఆ తర్వాత రైనా దిగాడు రంగంలోకి. స్ట్రెయిటుగా పాయింటుకి వచ్చేసి ఫస్టుబాలునే వికెట్‌కీపరుకి క్యాచ్ ఇచ్చి, దీని గురించి 6 బంతులు వేస్టు చేసావా యువరాజూ అన్నట్టు కెమేరాలోకి చూస్తూ పెవిలియన్లో కూలబడ్డాడు రైనా.

హ్మ్.. వీళ్లని ఎవరూ బాగుచెయ్యలేరు.. ఈ మ్యాచ్ చూసి ఫీలయ్యేకంటే..

ఔనూ.. ఏదీ నా మస్తమ్మాయీ?.హా.. ఇక్కడే ఉంది. మొత్తానికి తను కూడా నేను తనని చూస్తున్నానని గమనించేసినట్టుంది.. ఈ ఆడాళ్లకి ఎట్లా తెలిసిపోతుందో కదా?. తన గ్యాంగ్ వాళ్లతో మాట్లాడుతూ, నవ్వుతూ అప్పుడప్పుడూ నా మీద కొన్ని చూపులు విసిరేస్తోంది. ఎందుకో నేను అలా చూడడం తనకి ఏమీ అభ్యంతరం ఉన్నట్టు కనబడలేదు. (ఏమో.. నాకు అలా అనిపించింది బాబూ!)

మళ్లీ టీవీ వంక చూసాను. చరిత్ర పునరావృతమౌతూనే ఉంది. ఫ్లడ్ లైట్ల వెలుగులో ఎక్కువసేపు ఉంటే చర్మం కందిపోతుందేమోనని భయపడుతున్నట్టున్నారు మనవాళ్లు.. తొందర తొందరగా డ్రెస్సింగ్ రూముకెళ్లి కోల్డ్ క్రీం రాసుకుని కూర్చుంటున్నారు. థూ..!(ఇక్కడ కొన్ని బూతులు).
 
అలా నేను మావాళ్ల గురించి ఎదురుచూస్తూ, మన ఇండియన్ క్రికెట్ టీంని తిట్టుకుంటూ, మధ్య మధ్యలో ఆ మస్తమ్మాయిని చూసుకుని నన్ను నేను ఉత్సాహపరుచుకుంటూ.. ఇలా నా మానాన నేను మాడిపోయిన మశాలాదోస తింటుంటే(ఏదో ఉపమానం బాగుందని వాడానులెండి .. "కాఫీ డే" లో మశాలాదోస దొరకదు).. 
 
..నాకెందుకో అనిపించింది నన్ను ఎవరో గుచ్చి గుచ్చి చూస్తున్నారని..
 
..ఆ వైపు చూసేసరికి, మస్తమ్మాయి కాదు.. అసలు అమ్మాయే కాదు.. ఒక "అతను"!. నేను అతన్ని అంతకుముందు గమనించలేదు. నా తర్వాత వచ్చినట్టున్నాడు. తను కూడా ఒక్కడే ఉన్నాడు. నేను అటు చూసేసరికి సిగ్గుపడ్డట్టుగా తల తిప్పుకున్నాడు.

ఏదో యాదృచ్చికంగా, యాక్సిడెంటల్‌గా అయ్యుంటుందిలే అని లైటు తీసుకుని మళ్లీ నేను నా కార్యక్రమంలో పడ్డాను. ఊ హూ.. అతను అలా నావంక చూస్తూనే ఉన్నాడు.. అచ్చం నేను ఆ మస్తమ్మాయిని ఎలా చూస్తున్నానో.. సేం టు సేం. నేను నా సీట్లో కొద్దిగా అటూ ఇటూ జరిగాను. టీవీ చూస్తున్నట్టుగా చూస్తూ, కంటి చివర్లనుంచి అతనివంక చూసాను. కన్‌ఫర్ముడ్.. అతను నన్నే చూస్తున్నాడు.

పక్కన ఉన్న డెకరేషన్ అద్దంలో మొహం చూసుకున్నాను.. "మొహమ్మీద ఏమన్నా ఉందా?".. "ఏమీ లేదే??!!".

"కొంపదీసి జిప్పు పెట్టుకోలేదా?".. "పెట్టుకున్నానే!".
 
అంతా బాగానే ఉంది, కాని నాకే "ఏదో"లా ఉండి పిచ్చెక్కేట్టుంది.
 
అప్పటికి నేను మస్తమ్మాయి గురించి పూర్తిగా మర్చిపోయాను. అప్పుడు నాకనిపించింది, నేను ఎవర్నన్నా అమ్మాయిని చూసినప్పుడు ఆ అమ్మాయి "ఇప్పటి నాలానే" ఇబ్బంది పడుతుందేమోనని. ఆ ఆలోచనతో నా మీద నాకే సిగ్గేసింది. ఒక (గుణ)పాఠం నేర్చుకున్నట్టయింది.
 
చెయ్యగలిగిందేమీలేక ఇంక మనసులోనే దేవుడిని వేడుకోవడం మొదలుపెట్టాను "ఆ జీవిని ఇక్కడనుంచి పంపిచెయ్యి" అని. "అలా చేస్తే,ఇంకెప్పుడూ ఏ అమ్మాయి వంక కన్నెత్తికూడా చూడను" అని మొక్కులుకూడా మొక్కాను. కానీ నా మనసు విరగబడి నవ్వుతోంది "ఏందిబే! జోకులేస్తున్నావా?" అని.

ఊ హూ.. అస్సలు లాభంలేదు.. ఈ ఆలోచనలనుంచి నాకు డైవర్షన్ కావాలి.. కరెక్ట్..

టీవీ వంక చూసాను. లాస్ట్ బ్యాట్స్ మన్ కూడా ఔట్. ఖర్మ!

పోనీ మస్తమ్మాయిని చూసుకుందామా?. నా "ఆరాధకుడు" నన్నే చూస్తున్నాడే??
 
ఇంక నేను తట్టుకోలేకపోయాను.. నా సీట్లోంచి లేచి, చేతులు పైకి మడిచి.. నా "ఆషిక్" దగ్గరకెళ్లి నిల్చున్నాను.
 
"ఇందాకట్నుంచి చూస్తున్నాను ఏవిటీ నావంకే అదోలా చూస్తున్నావు?. ఒళ్లేవన్నా కొవ్వెక్కిందా? గుడ్లు తోడేస్తా జాగ్రత్త!!" అన్నాను.
 
.. కాదు అన్నాను అనుకున్నాను.
 
నా నోట్లోంచి ఏ శబ్ధమూ రాలేదు.
 
అతని మొహంవంక ఒక 4,5 సెకన్లపాటు చూసి వెనక్కివచ్చి నా సీట్లో కూర్చుండిపోయాను..
 
.. ఎందుకంటారా?

.. అతనికి మెల్లకన్ను.

అతను కూర్చున్న చోటినుంచి తను టీవీ చూస్తుంటే నాకు అతను నన్ను చూస్తున్నట్టు అనిపించిందన్నమాట.

అతనివంక చూసాను. అతని మొహంలో భావమేవిటి?.. "ఎందుకొచ్చావ్? ఎందుకెళ్లావ్?" అని ప్రశ్నార్ధకమా? "ఇది నాకు మామూలేలే!.." అని తేలికభావమా?. నాకు తెలియలేదు.

మస్తమ్మాయివంక చూసాను. వాళ్లల్లోవాళ్లు మాట్లాడుకుంటున్నా, నా గురించే మాట్లాడుకుంటున్నారేమోనని "ఫీలింగ్".

తలకొట్టేసినట్టయింది. వెళ్లిపోదామని లేచాను. కరెక్టుగా అప్పుడే కూడబలుక్కునట్టుగా నా మిత్రులందరూ లోపలకి తగలడ్డారు. ఏం చేస్తాం..? తేలుకుట్టిన దొంగలా మళ్లీ సీట్లో కూర్చుండిపోయాను.


13, ఆగస్టు 2011, శనివారం

ఒక సినిమా డైలాగు మీ జీవితాన్ని మార్చేస్తుంది..

ఏంటీ.. ఒక ఐడియా కదా జీవితాన్ని మార్చాల్సిందీ.. అప్పుతచ్చుగానీ పడిందా అనుకుంటున్నారా?.
లేదండీ.. మీరు కరెక్టుగానే చదివారు.

అయినా మనలోమన మాట.. మీకెప్పుడూ ఇలాంటివి జరగలేదా?. నాకు అయితే జరిగింది..

ఆ "కబురు"ఏమిటో చెవిన వేసుకోండి మరీ..!!!


                                                ************* **************

మా అమ్మాయికి మూడునెలల వయస్సప్పుడు, నాకు ఆన్‌సైటు ఆఫర్ వచ్చేసరికి..
చంకలుగుద్దేసుకుని..
నేను ఎగేసుకుని..
శ్రీమతినీ, చంటిదాన్నీ ఎగరేసుకుని.. వచ్చి చికాగోలో వాలిపోయాం.

నా ఫ్రెండు హరి చికాగోలోనే ఉండడం, వాడి ఆఫీసు, నా అఫీసు ఒకే బిల్డింగులో ఉండడం, వాడు ఉంటున్న ఇల్లు ఆఫీసుకి 10 నిమిషాల డ్రైవ్ దూరంలోనే ఉండడం..లాంటివన్నీ కుదరబట్టి మేముకూడా వాడుండే అపార్టుమెంటు కాంప్లెక్సులోనే తొందరగానే సెటిలయ్యాము. వాడికి కూడా 6,7 నెలల బాబు ఉండడం నాకు చాలా ఊరట(ధైర్యం) కలిగించిన విషయం.

త్వరలోనే శ్రీమతి, చంటిది వాతావరణానికి అలవాటుపడ్డారు. శ్రీమతి మిగతా దేశీయవనితలతో కూడిన "మహిళామండలి"లో సభ్యత్వం సాధించి త్వరలోనే అందులో అంచెలంచెలుగా ఎదిగి "పరమవీర యాక్టివ్ మెంబర్" బిరుదాంకితురాలయ్యింది.

చంటిదికూడా "శిశుమండలి"లో తన ప్రాతినిధ్యాన్ని సుస్థిరం చేసుకునేందుకు దాని సాయశక్తులా ప్రయత్నాలు కొనసాగిస్తోంది.

నేను సరే సరి.. పొద్దున్నే నేను ఆఫీసుకి తయారయ్యేసరికి, తల్లీ కూతుళ్లిద్దరూ "గుర్రు"లు కొడుతూ ఉండేవారు. ఏం చేస్తాం.. ఫ్రిజ్జులోంచి పాలు తీసుకుని, అందులో సెరెయల్ గుమ్మరించుకుని తినేసి ఆఫీసుకెళ్లేవాడిని.

(నాకు మామూలుగానే, పాలలోగానీ, కాఫీలోగానీ వచ్చే మీగడతరకలు అంటే కాస్త అదో "ఇది". అలాంటిది, ఇంగ్లీషు సినిమాల్లో వాళ్లు ఫ్రిజ్జులోంచి పాల డబ్బా తీసి ఎత్తుకుని తాగుతుంటే "ఏదో"లా ఉండేది. అలాంటివాడ్ని.. ఇలా.. హ్మ్.. విధి వైపరీత్యం అంటే ఇదేనేమో?")

సరే.. ఆ తర్వాత, 10కో, 11కో అమ్మగారికి "సుప్రభాత"సేవ ఉండేది. మరి లేకపోతే, మధ్యాహ్నం "భోజనం" సంగతేమిటి?. ఇంక సాయంత్రం ఆఫీసునించి రాగానే చంటిదానితో కాలక్షేపం.

శుక్రవారంనాడు ఆఫీసునుండీ రాగానే, దేశీయ కూరల మార్కెట్టుకెళ్లి వారానికి సరిపడా కూరలు, అక్కడనుండే వారానికి సరిపడే తెలుగు, హిందీ సినిమాల క్యాసెట్లూ పుష్కలంగా తెచ్చిపడేసుకునేవాళ్లం. వీకెండ్లో షికార్లు సరేసరి.

               *******         *******
చంటిది "ఊ.." కొట్టడం మొదలుపెట్టింది..


         .. మేము ఇండియానుంచి తెచ్చిన ఉగ్గుగిన్నెలని పంచాం.
         .. అక్కడ నాయనమ్మా, అమ్మమ్మలు కూడా ..

               *******         *******

చంటిదాని ఫోటోలు తీసి, వాటిని Develop చేసి, రెండు రెండు కాపీలు తీసి నాయనమ్మావాళ్లకి ఒకటి, అమ్మమ్మావాళ్లకి ఒకటి పంపిస్తున్నాం.

వారానికి (కనీసం)రెండుసార్లు అటూ, ఇటూ పెద్దవాళ్లతో "పాపాయి ముచ్చట్లు" పంచుకుంటున్నాం.

               *******         *******
చంటిది బోర్లా పడింది. మేం బొబ్బట్లు పంచాం.


శ్రీమతి ప్రాణస్నేహితురాలి పెళ్లి అయ్యింది. ఫోను చేసి శుభాకాంక్షలు అందజేసాం. పెళ్లికి వెళ్లలేకపోయినందుకు బాధపడింది శ్రీమతి.

              *******         *******
చంటిది పాకడం మొదలుపెట్టింది. పాకుండలు (పాకం ఉండలు?) చెయ్యడంరాక పాయసం వండి వడ్డించాం.

మా బ్రహ్మచారి సహోద్యోగు(గిను)లు చంటిదాని ఎదుగుదలని చాలా నిశితంగా, ఉత్సాహంగా గమనిస్తూండేవాళ్లు.. మరి వాళ్లకి కనీసం ఒక రోజు/పూట స్వయంపాకం బాధ తప్పుతోంది కదా..? :)

              *******         *******

గడపదాటిందని గారెలు, అడుగులు వేసిందని అరిసెలు(లాంటివి!!??) చేసి పంచాం.. తిన్నాం.

నెలపుట్టినరోజులు సరేసరి..

            **********              ************

పాపాయి మొదటి పుట్టినరోజు వేడుకలు మిత్రులు, సహోద్యోగులమధ్య  చేసుకున్నాం.
  
    .. ఎక్కడో చిన్న వెలితి ఫీలింగ్.. "పెద్దవాళ్ల" అక్షంతలు పడలేదే అని.

    .. ఫొటోలు చూసి పెద్దవాళ్లు ఆనందపడ్డారు. వాళ్ల గొంతులో కూడా వినిపిస్తోందా ఆ వెలితి?

            **********              ************

నాన్నగారికి ఫోను చేస్తే, ఆయనగొంతులో ఏదో తేడా.. చాలా బాధపడుతున్నట్టు..

మరీ మరీ అడిగితే చెప్పారు.. ఆయన ప్రాణస్నేహితుడూ, మా కుటుంబానికి ఎంతో ఆప్తుడూ అయిన మా "మావయ్య" కాలంచేసారని.

.. ఫోనులో నాన్నగారిని ఎలా ఓదార్చాలో నాకర్ధం కాలేదు.. నావల్లకాలేదు..


            **********              ************

అలా, నా మానాన నేను మాడిపోయిన మసాలాదోశ తింటూ కాలక్షేపం చేస్తుంటే, అప్పుడు ఊడి పడ్డారు "ఆ ఇద్దరు" నా జీవితాన్ని మార్చటానికి "ఆ సినిమా" లో "ఆ డైలాగు"తో.


ఆ సినిమా: నువ్వు నాకు నచ్చావ్

ఆ ఇద్దరు: త్రివిక్రం శ్రీనివాస్.. "ఆ" డైలాగు రచయిత
           విక్టరీ వెంకటేష్ .. ఆ డైలాగుని పలికిన (మగ)చిలక

ఆ డైలాగు :మరి ఆ సీను/డైలాగు ఏమిటో మీరే చూడండి/వినండి/చదవండి..

===========================================".. ఇన్నాళ్లూ కష్టపడి చదివించింది నువ్వు అనకాపల్లిలో వ్యవసాయం చేసుకోడానికా?"


"అంటే పాతికేళ్లుగా పెంచారుగాబట్టి, నేను అమెరికా వెళ్లి పదేళ్లు డబ్బు పంపిస్తే లెక్క సరిపోద్ది.. చెల్లు.. ఇదేమన్నా బిజినెస్సా?. ఇప్పుడు నేను అమెరికా వెళ్లి డబ్బులు సంపాదించి కారు కొంటాను. దాని పక్కన నిలబడి ఒక ఫోటో తీసుకుని పంపించాలి. అంతేగానీ దాన్లో మానాన్నని ఎక్కించుకుని తిరగ్గలనా? లేదు. అదే మావూళ్లో వ్యవసాయం చేసుకుంటుంటే కనీసం మానాన్నని స్కూటరెక్కిచ్చుకుని తిప్పగలను. అది నాకు హాపీగా ఉంటుంది.."


".. మా నాన్నకి జ్వరమొస్తే అమెరికానుంచి ఫోనుచేసి టాబ్లెట్ వేసుకో నాన్నా అనే చెప్పగలను.. అదే టాబ్లెట్ నా చేత్తో వేసి పక్కనుండి చూసుకుంటే నాకు తృప్తిగా ఉంటుంది.."


".. నేను పెరిగిన ఇల్లు.. నేను తిరిగిన ఊరు.. నన్ను పెంచిన నాన్న.. నన్ను ప్రేమించే స్నేహితులు.. అందర్నీ వదిలేసి అక్కడికెళ్లి ఏమి సాధించాలి?. నా పదెకరాలు, ట్రాక్టరు నాకు చాలు. సాయంత్రందాకా పొలం దున్నుకుని, సరదాగా ఫ్రెండ్సుతో ఓ దమ్ముకొట్టి.. సెకండ్‌షో సినిమాకెళ్లొచ్చి పడుకుంటే చాలదా? .."


".. మనం గెలిచినప్పుడు చప్పట్లు కొట్టేవాళ్లూ, మనం ఓడిపోయినప్పుడు భుజం తట్టేవాళ్లూ, నలుగురులేనప్పుడు ఎంత సంపాదించినా ఎంత పోగొట్టుకున్నా తేడా ఏమీ ఉండదు.."

============================================

ప్రత్యేకంగా చివరి మూడు వాక్యాలు, నన్ను ఎక్కడో తాకాయి.. ఆలోచింపజేసాయి.. నా పరిస్థితులనే ప్రతిబింబిస్తున్నట్టు..  శ్రీమతితో నా ఆలోచనలు పంచుకున్నాను. తనుకూడా సానుకూలంగా స్పందించింది. కొన్ని తర్కవితర్కాలు, కాసిని తర్జనబర్జనల తర్వాత "గృహ"మంత్రి నిర్ణయానికి రాష్ట్ర"పతి" ఆమోదముద్ర వేసారు(ను).


అంతే.. తదుపరి సత్వర అవకాశాన్ని అందిపుచ్చుకుని, మేము తట్టా బుట్టా సర్దుకుని చికాగోలో బిచాణా ఎత్తేసి, భాగ్యనగరంలో జెండా పాతేసాం. చంటిది ఒకటిన్నరో ఏట మళ్లీ మొదటిపుట్టినరోజు జరుపుకుంది "అందరి"మధ్య.


.. చికాగోలో ఆరోజు మేము తీసుకున్న నిర్ణయాన్ని పునస్సమీక్షించుకోవాల్సిన అవసరం మాకెప్పుడూ రాలేదు..

కాస్త బాగా "సెంటీ" అయినట్టున్నాను కదూ..

అలా అని, ఏమండోయ్! నేనేదో ఇప్పుడు పూర్తిగా మాతాపితరుల సేవలో తరిస్తున్నాననో, ఫ్రెండ్సుతో రోజూ సెకండ్ షో సినిమాలు కుమ్మేస్తున్నాననో అనేసుకోగలరు.. అంత లేదండీ!.

నాన్నగారితో మాట్లాడడం అలా ఉంచండి.. ఒకే ఇంట్లో ఉంటూ ఆయన్ని చూడకుండా కూడా ఎన్నో రోజులు గడిచిపోతున్నాయి ఇప్పుడు. ఏదో  ఇంతకు ముందు చెప్పినట్టు  , నా శ్రీమతిని మాధ్యమంగా ఉంచుకుని మేమిద్దరం మాటలు అటూ ఇటూ చేరవేసుకుంటూ ఉంటాం.. అలా ఎందుకు? అంటారా..

వాళ్లు లేచేసరికి నేను ఆఫీసుకి వెళ్లిపోవడం.. వాళ్లు పడుకున్న తర్వాత ఎప్పుడో అర్ధరాత్రి ఇంటికి చేరుకోవడం.. ఇట్టాంటివన్నీ చాలారోజులు జరిగేసరికి, మా బుడ్డిగాడు ఓ అందమైన ఆదివారంనాడు నన్ను అడిగాడు.. "నాన్నా! నువ్వు నాకు సండే ఒక్కరోజే కనబడుతున్నావు.. నువ్వేమన్నా "సండే డాడీ"వా అని..  :(

అందువల్లచేతనన్నమాట..

అదండీ సంగతి..


11, ఆగస్టు 2011, గురువారం

భలేమంచి బేరము.. మించినన్ దొరకదు త్వరంగొనుడు..

ఇందు మూలంగా బ్లాగు ప్రజలందరికీ తెలియజేయునది ఏమనగా..

దేవుడు ఒక వరమే ఇస్తాడనీ, అదృష్టం ఒక్కసారే మన గుమ్మం తొక్కుతుందనీ.. ఇట్టాంటివి ఇంతకుముందు చాలాసార్లు మనం విని ఉన్నాం..

కాని.. మనకోసమే.. అచ్చంగా మనకోసమే..

.. దేవుడు ఇంకోసారి వరం ఇచ్చాడని..

.. మనమందరం మూకుమ్మడిగా నక్కతోకని కసాబిసా తొక్కేసామని గమనించిన అదృష్టదేవత అందరికీ కలిపి టోకున ఓ వరం ఇచ్చి ఆవతలపాడేసిందని..

.. అని పైన ఉదహరించినవాళ్లిద్దరూ రాత్రి నాకు కలలోవచ్చి చెప్పారుగాబట్టీ, నేనేమో చిన్నప్పట్నించీ "పరోపకారార్ధం ఇదం.." సూత్రాన్ని విపరీతంగా వంటపట్టించుకున్నవాడ్ని కాబట్టీ, మీ అందరితోగూడా ఆ సువర్ణావకాశంగురించి పంచుకుంటున్నానుగాబట్టి మీరందరూ యధాశక్తి నన్ను మెచ్చుకోవాలని మనవి చేసుకుంటున్నాను..

అసలు విషయానికొచ్చేస్తాను.. మనందరికీ మూకుమ్మడిగా దొరికిన ఆ వరం ఏమిటంటే..

ఈ ఆగష్టు 21వ తారీకున..
....
....
....
సాయంత్రం 5 గంటలకి..
....
....
....
మనందరి మానసచోరుడు, నల్లనయ్య, కన్నయ్య .. ఇంకా పౌరాణిక బ్రహ్మ అయినటువంటి "సుమనో"హరుడి సుమధుర దృశ్యకావ్యం "ఉషా పరిణయం" మనందరి టీవీలో ఠీవిగా ప్రదర్శితం కాబోతుంది, గాన చూసి తరించగలరు..


మురళీగారికి, రాజ్‌కుమార్‌గారికి, ఇంకా ఔత్సాహిక బ్లాగర్లందరికీ "చేతినిండా" మళ్లీ పని తగిలింది..

ఇక్కడ మేమంతా waiting మరి.. రెచ్చిపోండి..

6, ఆగస్టు 2011, శనివారం

నేను "మిష్టర్ పెళ్లాం" అయ్యానుపోయిన శుక్రవారం నాకు శూన్య శుక్రవారం, చీకటి శుక్రవారం అంటే Black Friday అన్నమాట.

ముందు, నా లాప్టాప్ క్రాష్ అయ్యి, రిపేరుకెళ్లింది.
ఆ తర్వాత.. నా శ్రీమతి నన్నొదిలేసి వెళ్లిపోయింది.

చాలా రోజుల్నుంచీ ఏదో బెదిరిస్తోందిలే అనుకున్నా కానీ, మరి ఇక సహించలేను అనుకుందో ఏమో, వెళ్లిపోయింది.

అప్పటికీ పిల్లలగురించి బాధపడుతూనే ఉంది, అయినా సరే, నేను గాట్టిగా నొక్కి వక్కాణించి మరీ చెప్పేసా, పిల్లలని తన కంటే బాగా చూసుకోగలనని. అంతే.. ఇంక నిర్ణయం తీసేసుకుంది వెళ్లిపోవాలని.. వెళ్లిపోయింది.

అయినా, ఈ మధ్యన బాగా గమనిస్తున్నా.. మా ఇద్దరి మధ్య అంత సఖ్యత ఉండడంలేదు. ప్రతీదానికీ నామీద నాకే కంప్లైంట్లు చేస్తోంది. అవి కూడా మరీ అర్ధం పర్ధంలేని కంప్లైంట్లు..

మీరే చెప్పండి..

తనని అసలు పట్టించుకోనట.. తనమాట విననట..
.. ఇదేమన్నా భావ్యమా?.

ఏదో పేపరు చదువుకుంటూనో,  మురళిగారు పరిచయం చేసిన పుస్తకాన్ని చదువుతూనో, కంప్యూటర్లో బ్లాగులు రాస్తూనో,చదువుతూనో, కామెంటుతూనో, టీవీ చూస్తూనో ఉంటానన్నమాటేగానీ తను చెప్పినవన్నీ వింటూనే (అంటే విన్నా వినకపోయినా "ఊ.." కొడుతూనే) ఉంటానుకదా?

తనతో అంతకుముందులా మాట్లాడటంలేదుట..
.. దీనికిమించిన పచ్చి అబద్ధం ఇంకేమన్న ఉంటుందా?.

పొద్దున్నే లేవగానే కాఫీ అడుగుతానా?
"టిఫిన్ పెట్టు" అంటానా?
"సాక్సులు ఎక్కడ?" అని గట్టిగా అరుస్తానా?
"కారు తాళాలు ఎక్కడా?" అని విసుక్కుంటానా?,
అలాగే రాత్రి పూట "అన్నంలోకి రోజు విడిచి రోజు ఈ కాబేజీ కూరేంటీ?" అని చిరాకు పడతానా?
రిమోటు కనబడకపోతే "ఈ రిమోటుకి చావూ పుట్టుకా ఉండవు." అని వేదాంతాలు వల్లిస్తానా?.

వీటన్నిటినీ మాటలుకాక ఇంకేమంటారండీ? అహ.. పెద్దమనుషులు.. మీరు చెప్పండి..

అలా తను వెళ్లిపోయిందా..?

నా పరిస్థితికొచ్చేసరికి .. ఆఫీసులో ఎంత బాసుగిరీ వెలగబెట్టినా, ఇంట్లోమాత్రం "మిష్టర్ పెళ్లాం"గిరీ వెలగబెట్టలేక నా తాడుతెగుతుందన్నమాట అక్షరసత్యం.

మా అమ్మాయికి దోశలు కావాలి, బుడ్డిగాడికి ఇడ్లీలు కావాలి. సమయానుకూలంగా మా అమ్మాయి నాకు కాస్త ఉప్పందిచ్చబట్టి తెలిసింది కానీ, లేకపోతే శ్రీమతి దోశల్ని కూడా ఇడ్లీల సైజులో ఎందుకు వేస్తుంది?, అన్న ప్రశ్నకి నాకు సమాధానం ఎప్పటికీ తెలిసేదేకాదు.

మా అమ్మాయికి "స్కార్ఫ్" కనబడడంలేదంటే, వెతగ్గా వెతగ్గా కొండంత ఉన్న ఉతికిన గుడ్డలమూటలో ఎక్కడో నక్కిఉంది అది.

బుడ్డిగాడికి అన్నీ ఎడమకాలి సాక్సులే కనబడుతున్నాయి, కుడికాలి సాక్సు ఒక్కటీ కనబడి చావడంలా!.

శ్రీమతి ఉన్నప్పుడైతే వాళ్లు స్నానంచేసివచ్చేసరికి నీటుగా ఇస్త్రీ చేసిన బట్టలు రుమాలుతోసహా వాళ్ల మంచమ్మీద పెట్టి ఉండేవి.

బయటనుండి స్కూల్ బస్సువాడు హారన్‌తో నా ఢంకా బజాయించేస్తున్నాడు. బుడ్డిగాడు ఆలశ్యానికి నువ్వే భాద్యుడివి అన్నట్టు చూస్తున్నాడు నావంక.

వాళ్ల కళ్లల్లో భావాలు, చురుకుదనంలేని వాళ్ల చేతలు చూస్తుంటే.. నాకనిపించింది పిల్లలు వాళ్లమ్మని "మిస్" అవుతున్నారనీ.. తను వెళ్లిపోవడానికి భాద్యుడ్ని నేనే అనుకుంటున్నారనీ..

ఏమో!. ఆలోచిస్తుంటే నాకది నిజమేనేమో అనిపించింది. నేను "వద్దూ..!" అంటే ఉండిపోయేదేమో!.

కానీ..

నాకు గట్టినమ్మకం.. తను పిల్లల్ని వదిలిపెట్టి ఇన్నిరోజులు ఎప్పుడూ ఉండలేదు కాబట్టి తప్పకుండా తిరిగి వచ్చేస్తుంది.

....
....
....
....
....ఇంకా చెప్పాలంటే ఈ ఆదివారం పొద్దున్న తప్పకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే..

....
....
....
....
....

తనకి రిటర్న్ టిక్కెట్టు బుక్ చేసింది నేనేకదా!!!!!???😃😃😃
నాకు సెలవు కుదరక, పిల్లలకి స్కూలు పోవటం ఇష్టంలేక, వెళ్లక తప్పక,తను వెళ్లింది వాళ్లమ్మవాళ్లతో కలిసి వాళ్ల మేనమామ ఇంటికే కదా????? 😎😎😎


కానీ, ఏదో అంటారు చూడండీ.. ఏవస్తువు విలువైనా అది లేనప్పుడే తెలుస్తుందీ అని.. ఇది మాత్రం అక్షరాలా నిజం..

మరి, మళ్లీ నా లాప్టాప్ రిపేరయ్యి వచ్చేదాకా రెండు రోజులపాటు మరి నేనెంత నరకం అనుభవించాననుకున్నారూ?

27, జులై 2011, బుధవారం

నేను Vs "బాషా" అనబడే ఓ ఆటోకారన్

"ఆటో రిక్షా" అంటే ఏమిటి అని డిక్షనరీని అడిగామనుకోండి  - మూడు చక్రాలు ఉండి, మోటారు ఇంజను మీద నడిచే బండి - లాంటి అర్ధాలు చెప్తుంది. కానీ పాపం ఆ డిక్షనరీకి తెలియనిదేమిటంటే - ఈ ఆటో రిక్షాలకి "Laws of Physics" వర్తించవు అని.. ఇంకా చెప్పాలంటే, వీటికి ఏ Lawలూ వర్తించవూ అని.

ఎక్కడో చదివిన గుర్తు.. బొద్దింక, ఎంత పెద్దదైనా సరే, 1.5మిల్లీమీటర్ల కంత/సందు చాలట అది దాక్కోడానికి/దూరి వెళ్లిపోవడానికి. అలాగే ఈ ఆటోవాళ్లు అనుకుంటారనుకుంటా.. ముందు చక్రం పట్టే ఖాళీ స్థలం ఉంటే చాలు, మిగతా బండి అంతా దానంత అదే దూరిపోతుంది.. అని.


                                   ****          ******


బాగా పేరొందిన మన ఒకానొక  బ్లాగ్వేత్త మద్రాసు (చెన్నయి) పట్టణంగురించి ఒకానొక సందర్భంలో ఇలా ప్రశంసించారు -


"మూడేళ్ళలో సంవత్సరానికి 10 చొప్పున 30 ఎండాకాలాలు చూసాను. మార్చ్, ఏప్రెల్, మే నెలలలో ఎవరైనా మద్రాసు కు పెళ్ళికో, బంధువుల ఇంటికో వచ్చారంటే సిక్కిం బంపర్ లాటరీ కొట్టినట్టే. దగ్గర్దగ్గిర 180 డిగ్రీ సెంటీగ్రేడ్ల ఉష్ణోగ్రతతో ఎంతో ఆహ్లాదంగా ఉంటుంది వాతావరణం. "

ఈయనే,  ఇంకో సందర్భంలో  అక్కడి ఆటోవాళ్లగురించి ఇలా ప్రస్తావించారు -


" If
మద్రాసు ఆటోవాడు = నీచ్, కమీనా, కుత్త్తా..
Then
బెంగళూరు ఆటోవాడు = ఇద్దరు మద్రాసు ఆటోవాళ్ళు "


                                   ****          ******


ఇప్పుడివి ఎందుకంటారా?. ప్రస్తుత సమయంలో మన కబుర్లు వీటిగురించేకాబట్టి.


అట్లాంటి పైన చెప్పుకున్నటువంటి ఘనచరిత్ర కలిగిన చెన్నయి నగరానికి విధి వక్రించి నేను చాలాసార్లు వెళ్లవలసివస్తూ ఉంటుంది.. అలాంటి సందర్భాలలో ఈ ఆటోలు/ఆటోవాళ్ల పాలిన పడాల్సివస్తూ ఉంటుంది.


ఇక్కడ ఆటోవాళ్లు.. మాయగాళ్లే కాదు.. మాటగాళ్లు కూడా.. వాళ్ల లాజిక్కులు అసలు నాకైతే ఎప్పటికీ అందవు.


ఎప్పుడో 10,12 ఏళ్లక్రితం ఒక 6 నెలలు చెన్నయిలో ఉద్యోగం వెలగబెట్టి, ఆకాలంలో చూసిన తమిళ్ సినిమాలద్వారా నేర్చుకున్న అరకొర భాషాప్రావీణ్యత నాది. దానితోనే వాడిని బురిడీ కొట్టించాలనుకుంటే ఎలా ఉంటుందీ..? "తాతకి దగ్గులు..", "హనుమంతుండి ముందు కుప్పిగంతులు.." లాంటి సామెతలు గుర్తొస్తున్నాయా?. నాక్కూడా డిటో.. డిటో.


వాళ్లతో నా అనుభవాల్లో కొన్ని మచ్చుతునకలు ... (అనువాదంతో)


(పగటిపూట)
నేను: ఏంటి తంబీ.. అంత ఎక్కువా?
ఆటో: చూడన్నా ఎంత ట్రాఫిక్కో..!(ట్రాఫిక్కుని చూపిస్తూ)


అదే కాస్త చీకటిపడ్డాక.. ట్రాఫిక్ పల్చగా ఉన్నప్పుడు..
ఆటో: నైట్ టైము చార్జెస్ అన్నా!


రెండు బ్యాగులతో స్టేషనులోంచి బయటకొస్తే..
ఆటో: లగేజీ ఉంది కదా అన్నా!


బ్యాగులు లేకుండా స్టేషనులోంచి బయటకొస్తే..
ఆటో: లగేజీ ఉన్నా లేకపోయినా అదే రేటన్నా.. నిన్ను తీసుకెళ్లినప్పుడు నీ లగేజీ కూడా తీసుకెళ్లాలిందే కదన్నా!


ఒకసారి ఏమయిందంటే ..
నేను: ఇక్కడినుండి డిల్లీ ఎంత దూరమో తెలుసా?
ఆటో: ఇల్లియే! (తెలియదు)


నేను: సుమారు 1700-1800 కిలోమీటర్లు
ఆటో: ..


నేను: మరి ఇక్కడినుండి, డిల్లీకి ఫ్లైటులో ఛార్జీ ఎంతో తెలుసా?
ఆటో: తెలియదు


నేను: ఎక్కువలో ఎక్కువ 4 వేలు (4 వేలుని గట్టిగా ఒత్తి పలుకుతూ..)
ఆటో: ..


నేను: అంటే, ఫ్లైటువాళ్లు కిలోమీటరుకి సుమారు 2.50 రూపాయిలు చార్జ్ చేస్తూ ఉంటే, నువ్వు 12కిలోమీటర్ల దూరానికి 180 రూపాయిలు అడుగుతున్నావు, అంటే కిలోమీటరుకి 15 రూపాయిలు. ఎక్కడైనా న్యాయంగా ఉందా?


ఇక్కడ నేను లోపల్లోపలే నా భుజాలు చరుచుకుని, బోల్డన్ని "శభాషో" లు చెప్పేసుకుంటున్నానన్నమాట..


కానీ..బయట సీను వేరేవిధంగా ఉంది. ఆ ఆటో అతను నన్ను ఒక వెర్రిబాగులవాడ్ని చూసినట్టు చూసి..


"అన్నా! నువ్వు ఫైల్ట్లో డిల్లీ వెళ్లేటప్పుడు ఎన్ని కిలోమీటర్లు టైర్లు నేలమీద ఉంటాయంటావ్?"
నేను: (మనసులో కొన్ని లెక్కలేసి) సుమారు 3,4 కిలోమీటర్లు.


ఆటో: మరి నువ్వు నా ఆటోలో 12 కిలోమీటర్లు వెళ్లినప్పుడు ఎన్ని కిలోమీటర్లు టైర్లు నేలమీద ఉంటాయీ?"
నేను: 12 కిలోమీటర్లు (అసలు లాజిక్కేమిటో ఊహించటానికి ప్రయత్నిస్తూ..)


ఆటో: మరి చూడు. 1700 కిలోమీటర్లలో 3 కిలోమీటర్లు నేలమీద ఉండేదానికి నువ్వంత ఇస్తున్నప్పుడు, మొత్తం జర్నీ అంతా నేలమీద చేసేదానికి నేను అడిగింది ఏమి తక్కువన్నా!!???


మీకేమన్నా అర్ధమయ్యిందా ఈ లాజిక్కు????


                                   ****          ******

అలా అని నేను అన్నీ జెల్లకాయలే తింటానని ఫిక్సయిపోకండి. అప్పుడప్పుడూ నేను కూడా మార్గదర్శిలో చేరతాను, కాసిన్ని జెల్లకాయలు ఇస్తాను..


నేను వెళ్లాల్సిన చోటికి మామూలుగా కంటే 50 రూపాయలు ఎక్కువ అడిగాడు.


ఆటో: పెట్రోలు రేట్లు పెరిగినాయి కదా అన్నా!
నేను: ఎంత పెరిగింది?
ఆటో: లీటరుకి 5 రూపాయలు


నేను: నీ ఆటో లీటరు పెట్రోలుకి ఎన్ని కిలోమీటర్లు వెళ్తుంది?
ఆటో: 20 కిలోమీటర్లన్నా!


నేను: అంటే, మనంవెళ్లాల్సిన 10 కిలోమీటర్లకి 2.50 రూపాయలే కదా ఎక్కువయ్యేదీ?
ఆటో: అన్నా..


మీరు చెప్పండి.. బాగా ఇచ్చానా?


సరే.. మనదసలే చాలా జాలి గుండె కదా.. 10 రూపాయలు ఎక్స్ట్రా ఇస్తానని చెప్పి ప్రయాణం కానిచ్చేసాను, అది వేరే విషయం అనుకోండి.


అయినా.. హన్నా!. వాడేమన్నా తనని తాను రజనీకాంత్ అనుకున్నాడా? బాషా అనుకున్నాడా?
బాషా సినిమాని ఒక్క తమిళ్లోనే చూసిన వాడికే అన్ని తెలివితేటలుంటే.. తమిళ్‌తో పాటు (ఈ వృత్తాంతం ఓ విధి వైపరీత్యం.. దీని గురించి ఇంకో సారి..) తెలుగులో, మరీ తిక్క రేగితే రెండు వారాలకోసారి సెట్ మాక్స్‌లో హిందీలో కూడా చూసే నాకు ఇంకెన్ని తెలివితేటలుండాలి?. హన్నా..!


అదండీ సంగతి!


ఇప్పుడు, ఇంత శ్రద్ధగా నా కబుర్లు విన్నందుకు మీకో బంపర్ ఆఫర్:


రజనీకాంత్ సినిమాలు జపనీస్ బాషలోకి డబ్ అవుతున్నాయికదా, అలాగే ఎప్పటికైనా 'బాషా' సినిమా ఇంగ్లీషులోకి డబ్ అవుతుంది అనే (అతి)ఆశతో ఒక ఔత్సాహిక గేయరచయిత ఇంగ్లీషులోకి డబ్ చేసిన "బాషా" పాట మీకోసం.. (courtesy: a fwd mail)

 తమిళ్ నుండి తెలుగు అనువాదగీతం:మాతృకనుండి ఆంగ్లీకరణ:
I am autofellow autofellow
Four knowing route fellow
Justice having rate fellow
Good people mix fellow
Nice singing song fellow
Gandhi borning country fellow
Stick take means hunter fellow
Big people’s relation fellow
Mercy having mind fellow da
I am all poor’s relative fellow da
I am always poor people’s relative fellow da
Achak means achak only; Gumuk means gumuk only
Achak means achak only; Gumuk means gumuk only

Town become big, population become big
Bus expecting, half age over
Life become hectic in time, exist in corner of street
Ada eye beat means love coming they telling
You hand clap means auto coming I telling
Front coming look, this three-wheel chariot
Good come and arrive, you trust and climb up
Mercy having mind fellow da
I am always poor people’s relative fellow da
Achak means achak only; Gumuk means gumuk only
Achak means achak only; Gumuk means gumuk only

Mummy motherfolk, danger not leave
Heat or cyclone, never I never tell
There there hunger take means, many savoury
Measurement food is one time
For pregnancy I come free mummy
Your child also name one I keep mummy
Letter lacking person ada trusting us and coming
Address lacking street ada auto fellow knowing
Achak means achak only ; Gumuk means gumuk only
Achak means achak only ; Gumuk means gumuk only

14, జులై 2011, గురువారం

మా బొమ్మరిల్లులో నటరత్నాలు

రెండు వారాల క్రితం, బెంగళూరులో ఉండే మా తమ్ముడు ఆఫీసుపనిని (స్వామికార్యాన్ని) వారాంతంతో (స్వకార్యంతో) కలుపుకుని హైదరాబాదు వచ్చాడు. మా మరదలికి సెలవు కుదరకపోవడంతో తను రాలేకపోయింది.

ఆదివారంనాడు మధ్యాహ్నం భోజనాలు ముగించి, ఏవో కబుర్లలో పడితే, వేగుల (మా పిల్లలు) ద్వారా మా సినిమాహాల్లో (హోం థియేటరులో) ఏదో సినిమా ప్రారంభం కాబోతుందని సమాచారం అందింది. దాంతో సీను హాల్లోకి మారింది.

ఆనాడు ప్రదర్శించబడుతున్న చిత్రరాజం - అన్నపూర్ణావారి "తోడికోడళ్లు(1957)".

నేనేదో హోం థియేటర్ అని కాస్త ఎక్కువగా చెప్పాననుకుంటునారా?. లేదండీ బాబూ!. మేస్త్రీ సినిమాకి దానారావుగారుకి ఉత్తమనటుడుగా నంది అవార్డు వచ్చిందన్నంత పచ్చి నిజ్జం .

మా ఇంట్లో ఉన్నది నిజంగానే హోం థియేటరే!. కాకపోతే మా హోం థియేటరుకి అర్ధమయ్యే భాష ఒక్కటే.. తెలుగు.

అందులో ఆడే సినిమాల్లో రెండే రంగులు ఉంటాయి.. తెలుపు, నలుపు. దీనికి ఒకటో, రెండో మినహాయింపులున్నాయిలెండి. నాకు తెలిసినంతవరకూ మా ఇంట్లో ఉన్న లేటెస్టు సినిమా అంటే.. స్వాతికిరణమో, సీతారామయ్యగారి మనవరాలో. అది కూడా ఒకటి విశ్వనాథ్ సినిమా అవటంవలానూ, రెండోది ఏయన్నార్‌ది అవటంవల్లనూ..

(మా నాన్నగారు ఏయన్నార్‌కి వీరాభిమానిలేండి. ఒక యాంగిల్లోంచి చూస్తే, ఏయన్నార్‌లానే కనపడతారని స్టూడెంట్లు అనుకునేవారట. నా శ్రీమతి చెప్పింది. తనుకూడా ఒకప్పుడు ఆయన స్టూడెంటేలెండి. దీని గురించి మనమెప్పుడైనా తీరిగ్గా బ్లాగాడుకుందాం)

ఇక్కడో చిన్న ముందుమాట: చదువరులలో ఎవరైనా ఈ సినిమా చూసిఉండకపోతే (ఏదో.. నా అఙ్ఞానంతో ఇలా మాట్లాడాననుకుంటే నన్ను క్షమించెయ్యాల్సిందిగా మనవి), మాలా కుమార్‌గారి  కమ్మటికలలు లో చూడొచ్చు.

సరే! విషయంలోకి వస్తే.. మేమందరం మా మా ఉచితాసనాలని స్వీకరించి సినిమా మీదకి దృష్టి సారించాము. చూస్తూండగానే, "గాలిపటం గాలిపటం" పాట అయిపోయింది.

సుశీల ..అదేనండీ మన సావిత్రి ప్రవేశం. ఎక్కడి దొంగలు అక్కడే గప్‌చుప్!

...
...

సావిత్రి కన్నాంబని అడుగుతోంది, "మందులు వేసుకున్నావా అక్కయ్యా?" అని.

కమల ఏదో చెప్తోంది. అప్పుడు నా శ్రీమతికి గుర్తొచ్చింది, "అత్తయ్యా! మందులు వేసుకున్నారా?" అని అడిగింది మా అమ్మని.

వెంటనే, మా తమ్ముడు అందుకున్నాడు.. "అహా! సావిత్రి, కన్నాంబ" అని నా శ్రీమతిని, మా అమ్మని చూపిస్తూ. గట్టిగా నవ్వుకున్నాం.

ఇంతలో.. "కారులో షికారుకెళ్లే" పాట అయిపోయి, ఏయన్నార్, సావిత్రి మాట్లాడుకుంటుంటే మాతమ్ముడన్నాడు నా వైపు చూపిస్తూ "ఇడిగో నాగేశ్వర్రావు.." అని నావంక చూసి "నువ్వు కూడా అంతే కదరా.. డెలివరీలు, ప్రాజెక్టు డెడ్‌లైనులు, మంత్లీ రిలీజులు, క్వార్టర్లీ రిలీజులు అంటూ వీక్ డేసూ, వీకెండ్లూ అనిలేకుండా ఇల్లు పట్టించుకోకుండా తిరిగేస్తూ ఉంటావుకదా?" అన్నాడు.

నేను సిగ్గుపడి మెలికలు తిరుగుతుంటే .. మళ్లీ నవ్వులు.
...
...

కన్నాంబ చిన్న పిల్లాడిని పక్కన పడుకోబెట్టుకుని కధ చెప్తుంటే, మా తమ్ముడు మళ్లీ, మా బుడ్డిగాడి వంక చూసి, "ఇదిగోరా! ఇది నువ్వే!.."అన్నాడు.
నాయనమ్మ ఒళ్లో కూర్చున్న మావాడు "పో బాబాయ్!.."అంటూ ఆవిడ ఒళ్లోకి మరింత ముడుచుకుపోయాడు..
...
...

"నాన్న! ఇదిగో టిఫిను"అంటూ కూతురు పళ్లెం తీసుకొచ్చిపెడితే, "టిఫినేమిటమ్మా.. అన్నం తింటానుగా" అని ఎస్వీ రంగారావు అంటుంటే "ఇవాళ శనివారం కదా.. టిఫినే తింటావని చెప్పింది పిన్ని"అని కూతురంటే, "ఓహోహో! సుశీల చెప్పిందా.. అయితే సరే" అంటూ ప్లేటు అందుకుంటున్న ఎస్వీ రంగారావుని వేలితో చూపించి, అదేవేలితో నాన్నగారి వంకచూపించాడు తమ్ముడు ఆయన చూడకుండా.. మేమందరం చెయ్యి నోటికడ్డం పెట్టుకుని చిన్నగా నవ్వుకున్నాం, శబ్ధం రాకుండా.
(మా ఇంట్లో మావగారూ, కోడలు ఒక పార్టీలెండి)."ఏడిశావులే! వెధవాయ్!" అన్నారు గంభీరంగా ఉండే నాన్నారు గుంభనంగా నవ్వుతూ. (మా నాన్నగారికి బాగా ప్రేమ కలిగితోనో, బాగా సంతోషం కలిగితేనో దానికి కారకుడైనవాడ్ని అలాగే అంటారు.ఈమాటంటే, చిన్నప్పుడు మాకు ఆరోజంతా పండగే! :-))

...
...

తనవంతు ఎప్పటికైనా వస్తుందనో, లేకపోతే సినిమాలోనూ, బయటా జరుగుతున్న రెండు సంఘటనల్లో పూర్తిగా invlove అయిపోవడంవల్లనో మా శశిరేఖ తన కారెక్టరుగురించి covenientగా మర్చిపోయింది. కానీ మా తమ్ముడ్ని అడిగింది "మరి నువ్వెవరు బాబాయ్?" అని.

అనుకోవడం ఆలస్యం..అరుగుమీద సావాసగాళ్లతో పేకాట ఆడుకుంటూ రేలంగి పాత్ర ప్రవేశం.."ఇదిగోనమ్మా! ఇదే నేను" అన్నాడు తమ్ముడు కొద్దిగా ఇబ్బందిగా మొహం పెట్టి.

"నానమ్మా! బాబాయ్ చూడు.. ఎలా ఉన్నాడో" అని మా అమ్మాయి అంటుంటే అందరం గట్టిగా నవ్వుకున్నాం.

ఇంతలో రేలంగి పాత్రని ఆడిపోసుకుంటూ సూర్యాకాంతం పాత్ర ప్రవేశించింది. అప్పటిదాకా మా అమ్మ ఒళ్లో ముడుచుకునిపడుకుని ఉన్న మా బుడ్డిగాడు ఒక్కసారిగా పైకిలేచి "బాబాయ్! ఈవిడేనా పిన్నీ?" అని అడిగాడు చాలా అమాయకంగా..

కొన్ని సెకండ్లపాటు మేము ఎవ్వరం ఏమీ మాట్లాడలేదు..

అందరం తమ్ముడివంకే చూసాం..

వాడి మొహంలో రంగులు చకచకా మారాయి (చిన్నప్పుడు స్టేజి నాటకాల్లో మొహమ్మీద రంగులకాగితం చక్రం తిప్పినట్టు)

తమ్ముడు బుడ్డిగాడివంక చూసి, ఇంక ఒప్పుకోక తప్పదన్న నిజాన్ని ఒప్పుకుంటున్నట్టుగా "అవును నాన్నా! ఆవిడే మీ పిన్ని.." అని ఆముదంతాగినవాడిలా మొహంపెట్టి నావంక చూసి "మా ఆవిడ ఇక్కడలేదుగాబట్టి బతికిపోయానురాగానీ అన్నాయ్.. తను ఇప్పుడు ఇక్కడ ఉంటేనా.." అంటుంటే.. మేమందరం పొట్టలు చెక్కలు అయ్యేలా నవ్వుతుంటే, మావాడు మా పిల్లలిద్దరితోటీ "ఈ విషయం పిన్నికి చెప్పొద్దూ" అంటూ బ్రతిమిలాడుకునే ప్రయత్నాల్లో పడ్డాడు. :-)

9, జులై 2011, శనివారం

నమస్కారంలో 'అది' ఉందా?

మనలో చాలామంది చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల్లో మన ఉపాధ్యాయులు, పంతులమ్మలు స్కూలు భవనంలోగానీ, ఆవరణలో గానీ, ఆట స్థలంలోగానీ తారసపడితే వారికి వినమ్రంగా నమస్కరించేవాళ్లం.. అభివందనం చేసేవాళ్లం. ఇది స్కూలు ఆవరణ బయటగూడా కొనసాగుతూనే ఉండేది. అంటే గుళ్లో.. మార్కెట్లో.. బజారులో.. కొండొకచో సినిమా హాల్లో కూడా.. కదూ! :-)

ఆ తర్వాత కొన్ని రోజులకి (ఏళ్లకి), అంటే సుమారు 8,9 తరగతుల్లోకి వచ్చేసరికి పాదచర్యం (ఇదేదో బ్రహ్మచర్యంలా ఉంది .. అసలు ఇలాంటి పదం తెలుగులో ఉందా?!!!) అయిపోయి వాహనయోగం పడుతుంది.

అంటే ఏ 'యమహా'నో, 'పల్సరో' అనుకుంటున్నారేమో.. అలా అనుకుంటే మీరు ఆదిత్య 369 ఎక్కి 10,15 సంవత్సరాలు ముందుకు వెళ్లిపోయినట్టన్నమాట. అందువల్లచేత మీరు అలా వెళ్లిపోకుండా, నా కబుర్లని మాత్రమే వినాలని మనవి.

సరే విషయానికొస్తే.. ఇంకా గట్టిగా చెప్పాలంటే, "నూతన" వాహనయోగం అంటే వంశపారంపర్యంగా వస్తున్న "సైకిలు" మాత్రమే అని గ్రహించాలి. కొండొకచో కొందరు యువరాజులకి, అదృష్టజాతకులకి కొత్తసైకిలు కూడా సంభవించవచ్చు.

నమస్కారానికి, సైకిలుకి సంబంధం ఏమిటనుకుంటున్నారా?. అక్కడకే వస్తున్నా..

ముందు అనుకున్నట్టుగా మన ఉపాధ్యాయులు కనబడితే మనం వందనం చెయ్యాలని అనుకున్నాము కదా!. కాలినడకన ఉన్నన్నాళ్లూ దీనికి ఏమాత్రం సమస్యా ఉండేది కాదు. మరి ఇప్పుడు మనం సైకిలు మీద రివ్వుమని, తారజువ్వలా దూసుకెళ్లిపోతున్నామాయే!..

..అయితే మాత్రం ఏమిటి నీ సమస్య ఏమిటంటారా? చెప్తాను వినండి.

మనం సైకిలు మీద బజార్లో వెళ్తున్నాము. మన మాష్టారు అల్లంత దూరంలో కనబడ్డారు. అప్పుడేం చేస్తాం - బ్రేకులేసి సైకిలు ఆపి,దిగి, సైకిల్ని ఒక చేత్తో పట్టుకుని నడిపిస్తూ, "నమస్తే మాష్టారూ" అంటాం రెండో చేతిని గుండెలమీద వేసుకుని.. లేకపోతే ఇంకాస్త "పద్దతి"గా 'ఘరానా మొగుడు'లో చిరంజీవిలాగా.

అలా కాకుండా, మాష్టార్ని బాగా దగ్గరకి వచ్చినతర్వాతగానీ చూడలేదనుకోండి.. అయితే మాత్రం, మాష్టారు కనబడ్డప్పుడు నమస్కారం పెట్టాలి కదా?. అప్పుడు కొన్ని "ఫీట్లు" చెయ్యాలన్నమాట. అంటే, రెండు చేతులతో హాండిల్ బార్ని గట్టిగా పట్టుకుని, కుడికాలుని ఫెడల్ మీదనుంచి తీసి, సీటుమీదగా తీసుకొచ్చి ఎడమ ఫెడల్ మీద ఎడమకాలు దగ్గర పెట్టి .. (ఇదంతా జరుగుతున్నంతసేపూ సైకిలు వెళ్తూనే ఉంటుందన్న మాట).. ఇక్కడ రెండు చేతులూ busyగా ఉన్నాయి కాబట్టి, తల కొద్దిగా కిందకి ఒంచి "నమస్తే మాష్టారూ" అంటామన్నమాట..

ఇలా మనం ఎన్ని పిచ్చి చేష్టలు చేసినా, మన మాష్టారు/టీచరు Basicalగా Very Good Master/Teacher కాబట్టి, చిరునవ్వుతో మనకి ప్రత్యభివాదం చేసేవారు.

ఇంతకీ అసలు కబురు ఏమిటంటే -

నేను తెనాలిలో తాలూకా హైస్కూల్లో 8,9 తరగతుల్లో చదివేటప్పుడు మా తెలుగు మాష్టారు.. ఈయన అచ్చ'తెనుగు' మాష్టారు. రాగరంజితంగా పద్యాలు పాడేవారు. ఆయన గొంతులో మాధుర్యం ఉట్టిపడేది. ఆయన విశదీకరించి, విపులీకరించి చెప్పిన సంధులు, సమాసాలు, చందస్సులు నాకు ఇప్పటికీ గుర్తే!. ఎవరైనా మాష్టారు ఆ రోజు రావడంలేదని తెలిస్తే, మా తెలుగు మాష్టారు ఆ క్లాసు తీసుకోవడానికొస్తే బాగుండు అనుకునేవాళ్లం.. ఎందుకంటే, అలా వేరేవాళ్ల క్లాసు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన అసలు సిలబస్ కాకుండా వేరే వేరే పద్యాలు (పోతన భాగవతం అంతా ఈయనకి కంఠతా వచ్చని అనుకునేవారు) పాడి వాటి అర్ధాలు చెప్తుంటే ఆ పీరియడ్ అంత త్వరగా అయిపోయినందుకు తెగ బాధపడేవాళ్లం.

మళ్లీ నమస్కారంలోకి వచ్చేస్తే.. ఈ తెలుగు మాష్టారు, ఎవరైనా ఎప్పుడైనా మాష్టారికి 'నమస్కారం మాష్టారూ' అని 'విష్' చేస్తే చిరునవ్వుతో "ఒరేయ్! నమస్కారంలో 'మస్కా' ఉంటుందిరోయ్" అనేవారు. మేము నవ్వుకునేవాళ్లం..

మొన్నీమధ్యన ఒక పెళ్లికి తెనాలి వెళ్లినప్పుడు మాష్టారు అక్కడ కనపడితే, వెళ్లి పలకరించాను. పెద్దవయసువల్లగాని, వందల్లో శిష్యగణం ఉండడంవల్లగానీ నన్ను గుర్తించలేకపోయినా ఆసక్తిగా నా బాగోగులు, ఉద్యోగవివరాలు తెలుసుకుని ఆనందించారు.

ఇంతలో మా  ఘటోత్కచుడు పరిగెత్తుకుంటూ నా దగ్గరకి వచ్చేసరికి వాడిని మాష్టారికి పరిచయం చేస్తూ, "తాతగారికి నమస్తే చెప్పు" అన్నాను. వాడు మరీ బుద్ధిగా "నమస్కారం తాతగారూ" అంటూ ఆయన కాళ్లమీదపడి పాదాభివందనం చేసాడు.

ఆయన వాడిని పైకి లేపి ఒళ్లో కూర్చోపెట్టుకుంటే, నేను చిన్నగా నవ్వుతూ చిన్నప్పుడు మేము "నమస్కారం" చేస్తే ఆయన ఏమనేవారో గుర్తుచేసుకుంటున్నట్టుగా ఆయనతో అన్నాను.

ఆయన దానికి అవునన్నట్టుగా పెద్దగా నవ్వి, ఒళ్లో కూర్చున్న మావాడి తల నిమురుతూ, "కానీ ఈ నమస్కారంలో ఏ 'మస్కా' లేదు నాయనా!. ఇందులో 'కారం' మాత్రమే ఉంది. నువ్వు చెప్పినమాట విని ఆచరించిన వీడికి నీపై ఉన్న మమకారం ఉంది.. పెద్దల్ని గౌరవించాలి అన్న మన సంస్కృతీ నుడికారం ఉంది." అని వాడి శిరస్సు మీద చెయ్యి ఉంచి "శతమానం భవతి శతాయుః .." అని ఆశీర్వదిస్తుంటే నా మనసు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది.

మరి మీరేమంటారు?....

25, జూన్ 2011, శనివారం

ఆపండీ....!

ఈ డైలాగు ఎక్కడో విన్నట్టుంది కదూ!!!


ఎక్కడో ఏవిటీ? సరిగ్గా తాళికట్టే సమయానికి ఎన్ని సినిమాల్లో, ఎన్ని కష్టాలు పడి, ఎందరు వచ్చి, ఎన్ని భావావేశాలతో (కోపంతో, బాధతో, ఆవేశంతో, ఆక్రోశంతో, భీభత్సంతో.. వగైరా వగైరా) అనలేదూ ఈ "ఆపండీ!" డైలాగుని అనుకుంటున్నారు కదూ!!! అదంతా సినిమాల్లోనండీ బాబూ!


కాని, నిజజీవితంలో మీరు ఎన్ని పెళ్లిళ్లకి వెళ్లుంటారు, ఎన్ని పెళ్లిల్లు చూసుంటారు, ఎన్ని పెళ్లిళ్లు చేసుకుని ఉంటారు (క్షమించాలి.. మామూలుగా అయితే ఒక్కొక్కళ్లకి ఒక్కొక్క పెళ్లే - కాని అందరికీ కలిపి, వ్యాకరణ దోషాల్లేకుండా చెప్పాలంటే, బహువచనం వాడాల్సి వచ్చింది - అందువల్లచేత అన్నమాట!). అలా నిజజీవితంలో మీరు ఈ డైలాగు ఎప్పుడన్నా విన్నారా?


"పాపము శమించుగాక!"
"అమంగళము ప్రతిహతమగుగాక!"
"నీకిదేంపొయ్యేకాలం.." అనుకుంటున్నారుకదా!!


కాని ఏంచేస్తాం.. ఇది కలికాలం..


నేను నా చెవులారా విన్నాను ఆ డైలాగుని..


ఇంకా చెప్పాలంటే.. ఎక్కడో కాదు..


నా నిజజీవితంలోనే..!
అచ్చంగా నా పెళ్లిలోనే..!
నాకంటూ జరిగిన ఒక్కగానొక్క పెళ్లిలోనే..!


ఎందుకు? ఏమిటి? ఎలా? హౌ? "ఏమి జరిగిందో నాకు తెలియాలి.." అంటారా.. మరి నాతో వచ్చెయ్యండి, ఓ పుష్కరం వెనకాలకి..


వచ్చారా?
ఇవాళ మార్చ్ ఇరవయ్యో తారీఖన్నమాట!
సందర్భం: నా పెళ్లి
సమయం: రాత్రి 9:21 దాటింది..


అదేమిటి? ఎవరైనా 9 దాటింది, తొమ్మిదిన్నర దాటింది అంటారు.. నువ్వేమిటి 9:21 దాటింది అంటావేంటంటారా? అక్కడికే వస్తున్నా..


9:21 కి ముహూర్తం అన్నారు.. అంటే 9:21 కి జీలకర్రా బెల్లం పెట్టాలి కదా? ఆ కార్యక్రమం అయిపోయి, ఇంకాసేపు అయిందన్నమాట!


సరే! తదుపరి కార్యక్రమం మాంగళ్యధారణ.


పురోహితులు మంత్రాలు వల్లిస్తున్నారు. మంగళవాయిద్యాలు మారుమ్రోగుతున్నాయి.
పెద్దలందరూ చేతులలో అక్షింతలతో ఆశీస్సులు అందచెయ్యడానికి సిద్ధంగా ఉన్నారు.


వరుడు (నేను), వధువు (నా శ్రీమతి) మా పెళ్లిపుస్తకంలో రంగవల్లికలు దిద్దడానికి సంసిద్ధులమయ్యాము..


నేను వధువుకి అభిముఖంగా నిల్చున్నాను.


పురోహితుడు నా చేతిలోకి తాళిని ఇచ్చి, వధువు మెళ్లో వేళాడేటట్టు పట్టుకోమన్నారు. వధువుని కిందనుంచి తాళిని పట్టుకోమన్నారు.


ఒకామెడ వెనకనించి వధువు పూలజడని పైకి ఎత్తి పట్టుకున్నారు.


పురోహితుడు మంత్రాలు చదువుతున్నారు.


గట్టిమేళం వాయించమన్నారు.


"మూడు ముళ్లు వెయ్యి నాయనా!" అని నాతో అని "మాంగళ్యం తంతునానేనా.." అందుకున్నారు పురోహితులు.


వాయిద్యాలు గాట్టిగా మ్రోగుతున్నాయి.


నాలో ఎన్నో భావోద్వేగాలు.. చేతుల్లో చిన్న తొట్రుపాటు..
అలా సన్నగా వణుకుతున్న చేతులతో, ఒంగొని, ఒక రకమైన స్వప్నావస్థలో, నా చేతులలో ఉన్న రెండు కొసలనీ ముళ్లు వేస్తున్నాను..


అదిగో.. అప్పుడు..

సరిగ్గా అప్పుడంటే అప్పుడు..వినబడింది..

"ఆపండీ.." అని..

ఒక సారి కాదు, రెండు సార్లు కాదు, మూడు సార్లు..

"ఆపండీ.." "ఆపండీ.." "ఆపండీ.." అని


కాకపోతే, ఈ టపా మొదట్లో అనుకున్నట్టుగా కోపం, బాధ, ఆవేశం వగైరాలతో కాదు.. ఇంకా చెప్పాలంటే కాస్త ఖంగారుగా!


అప్పటికి నేను నా "స్వప్నావస్థ"లోంచి బయటపడి, అలా అన్నవారివైపు చూసాను.


అలా అన్నది, వధువు జడ ఎత్తిపట్టుకొని వెనకాలనిల్చున్న తన మేనత్త (తర్వాత తెలిసింది). ఆవిడ గొంతులోనే కాదు, కళ్లల్లో కూడా ఖంగారు..


నేను ఆవిడవైపు చూసేసరికి అన్నారు "మూడు ముళ్లు అయిపోయినాయి బాబూ!" అని.


"..ఒదిలేస్తే ముప్పై ముళ్లేసేటట్టున్నావ్.." అన్నట్టు ఆమె కళ్లల్లో భావం.


ఏమి చేస్తాం.. ఒక వెర్రి నవ్వు నవ్వి నిటారుగా నిల్చున్నాను.


పురోహితుడు నా చేతుల్లోకి అక్షింతలు ఇచ్చి "ముడుల" మీద వెయ్యమన్నారు. వేసాను.


ఈతడవ మళ్లీ ఇంకో తాళిబొట్టు ఇచ్చి (ఒకటి మగపెళ్లివారిదీ, మరొకటి ఆడపెళ్లివారిదీ కదా?) కట్టమన్నారు.


మళ్లీ ఆవిడే జడ ఎత్తిపట్టుకున్నారు. నేను చాలా బుద్ధిగా "ఒకటీ", "రెండూ", "మూడూ" అని జాగ్రత్తగా లెక్కపెట్టి ముళ్లువేసి, అక్షింతలు వేసి ఆవిడవంక చూసి, "విజయదరహాసం" చేసాను.


ఆవిడమాత్రం "ఆ.. కట్టావులే తాళి.." అన్నట్టు చూసి చిరునవ్వుతో అక్కడనుండి వెళ్లిపోయింది.


ఆతర్వాత ఇక అక్షింతలు, ఆశీర్వచనాలు, చదివింపులు .. అన్నీ మామూలే!.
ఇకపోతే, ఇప్పుడు కొన్ని పక్కదీపాలు.. (హై లైట్సు, సైడు లైట్సు లో సైడు లైట్సు అన్నమాట!)


- ఇప్పటికీ, ఎప్పుడైనా నా శ్రీమతి మా పెళ్లి క్యాసెట్టు గనక చూస్తూ ఉంటే, "తాళికట్టు శుభవేళ.." వచ్చేసరికి "ఏవండోయ్! " అని నన్ను పిలిచి మరీ చూపిస్తూ ఉంటుంది. చూసి నవ్వుకుంటూ ఉంటాము.


- ఈ విషయం ఆనోటా ఈనోటా తెలిసో, లేకపోతే మా పెళ్లి క్యాసెట్లో చూసో గాని, మా చుట్టాల్లో నా తర్వాత పెళ్లైన మగపిల్లలందరూ "బుద్ధిగా" తాళికట్టారు.


- నా శ్రీమతి మేనత్త ఇంకెప్పుడూ ఎవ్వరి పెళ్లిలోనూ వధువు జడ ఎత్తిపట్టుకునే సాహసాలు చెయ్యలేదు. ఆవిధంగా ఫొటోల్లోనూ, వీడియోలోనూ పడడాన్నిగూడా త్యాగం చేసేసారు.


అయ్యా! అదండీ సంగతి..