27, జూన్ 2020, శనివారం

చట్టబద్ధమైన హెచ్చరిక - ఓ కథ

.


** ధూమపానం ఆరోగ్యానికి హానికరం మరియు కాన్సర్‌కు కారకం **
** మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం **
** మద్యం సేవించి వాహనములు నడుపరాదు **
** అతివేగం ప్రమాదకరం - హెల్మెట్, సీట్‌బెల్ట్ ధరించండి **

** చట్టం తనపని తాను చేసుకుంటూపోతుంది - చట్టాన్ని మీ చేతుల్లోకి తీసుకోకండి **

*************************

మామూలుగా అయితే మూసేసే సమయం అయ్యిందనే సూచనతో గానీ ముగించనివాడు ఇవాళ చాలా తక్కువ మోతాదులో సేవనంతో, తొందరగా ముగించి బార్‌లోనుంచి బయటకి వచ్చి చివరిదాకా కాలిన సిగిరెట్టుని కాలికిందవేసి తొక్కుతూ చుట్టూ చూసాడు. 

రోజూ తను చూసేదానికంటే ఎక్కువ రద్దీతో, ఎక్కువ ధ్వనులతో, ఎక్కువ కాంతితో పరిసరాలంతా గందరగోళంగా ఉన్నాయి.

"ఏవిటో అందరికీ ఇంత హడావిడి.. ఇంటికిపోయి తిని పడుకోవడం తప్పితే చేసేది ఏముంటుంది ఇప్పుడు? ..హ్మ్..  ఇంట్లో మనకోసం ఎదురుచూసేవాళ్లుంటే నేను కూడా ఇలాగే పరిగెత్తేవాడ్నేమోలే..!"

"నాలాంటి ఏక్‌నిరంజన్‌గాడికి ఇల్లైనా ఒకటే, బార్అయినా ఒకటే.. అయినా ఇప్పుడు ఇంటికిపోయి చేసేదేముంది, మళ్లీ లోపలకే వెళ్తే బెటరేమో..!!"

కాస్తంతదూరంలో ఒక కారు విపరీతమైన వేగంతో వస్తోంది..

"ఒరేయ్.. ఎందుకురా అంత స్పీడూ!.. పోతావురా!!..నువ్వు పోయిందేకాక జనాలని కూడా చంపుతావ్.."

.. సందులోంచి మైన్‌రోడ్‌మీదకి వచ్చేటప్పుడు వెనకాలవచ్చే ట్రాఫిక్‌ని చూసుకోవాలనే ఇంగితంలేని ఒక టూవీలర్‌మీద వెళ్తున్నవాడిని వెనకాల్నించి దాదాపుగా గుద్దబోయి, చివరిసెకన్లలో చాకచక్యంగా తప్పించినా, కారు సైడ్లు టూవీలర్‌వాడ్ని బలంగా రాసుకుంటూ వెళ్లాయి.  దాంతో బైకుమీద ఉన్నవాడు బాలెన్స్‌తప్పి కిందపడి, బండితోపాటుగా జారుకుంటూ చాలాదూరం వెళ్లి ఆగాడు.. చలనం లేకుండా..!

కారు స్పీడు కాస్త తగ్గినట్టే తగ్గి, మళ్లీ వేగం అందుకుని వెళ్లిపోతోంది.

"ఒరేయ్.. మనిషిని గుద్దింది కాక, కనీసం వాడు బతికున్నాడో, లేదో అనికూడా చూడకుండా వెళ్తున్నావా?.. ఉండు, నీ పని చెప్తా.. నిన్ను వదిలేదిలేదురోయ్..!! "

తనకార్లో కూర్చుని ముందుకు ఉరికించాడు. అల్లంత దూరంలో ఆ కారు కనబడింది. 

తనకారు వేగం మరింత పెంచాడు. ముందుకారు చాలావేగంగా, అటూ ఇటూ కదులుతూ, లేన్లు మారుతూ, మిగతావాహనాలని అధికమిస్తూ వెళ్తోంది.

"ఇంత ఫాస్ట్ వెళ్తున్నాడూ అంటే, బాగా తాగి ఉన్నాడా?.. డ్రగ్స్ తీసుకున్నాడా?.. లేకపోతే ఏ దొంగతనమో, హత్యో చేసి పారిపోతున్నాడా?.."

తనకారు మరికాస్త వేగంపెంచి ముందుకారుని అందుకుని దానికి పక్కగా వెళ్లి ఆ కారు డ్రైవరువైపు చూసాడు. వీధిదీపాల వెలుగులోకూడా ఆ డ్రైవరు మొహమంతా చమటలు, అతని కళ్లలో ఆదుర్దా స్పష్టంగా కనిపిస్తున్నాయి.

"పక్కకి తీసి ఆపురా బండినీ.."

చేతులతో సైగ చేసాడు.

ఆ కారువాడు మరికాస్త వేగం పెంచాడు.

"నువ్వు మంచి మాటలతో వినేవాడివికాదు అని నాకు ఎప్పుడో అర్ధమయ్యిందిరా.. ఉండు, నీ పని చెప్తా.."

వేగం పెంచి ఆకారుకి సమాంతరంగా వెళ్లి, తన కారుతో ఆకారుని గుద్దాడు. దాంతో ఆ కారు పక్కనే ఉన్న ఫుట్‌పాత్ ఎక్కినంత పనయ్యి, మళ్లీ సర్దుకుని రోడ్డుమీదకి వచ్చింది.

భయం, ఆందోళన, ఆశ్చర్యం, కోపం, బాధ .. ఇలా ఎన్నో కనబడ్డాయి ఆకారులోని డ్రైవరు మొహంలో ..

"ఇప్పుడు అర్ధమయ్యిందా నేనంటే ఏమిటో.. మళ్లీ చెప్తున్నా.. నిన్ను వదిలేదిలేదురోయ్..!!"

ఈసారి తనకారుతో ఇంకా బలంగా గుద్దాడు ఆకారుని. దాంతో ఆకారు అదుపుతప్పి వేగంగా ఫుట్‌పాత్‌మీదకి ఎక్కి దానిమీద ఉన్న రెండు చెత్తకుండీలని కింద పడేస్తూ వెళ్లి ఓ లైటుస్తంభాన్ని బలంగా గుద్ది ఆగింది. ఆ తాకిడికి లైటుస్తంభం ఓ పక్కకి ఒరిగిపోతే, దానికి ఉన్న లైట్లు పెద్దశబ్ధంతో పగిలిపోయాయి.

కాళ్లలో బలమంతా బ్రేకులమీద ఉపయోగించి కారుని కొద్దిదూరంలో ఆపి, కిందకి దిగి తన కారు వంక పరీక్షగా చూసాడు. ముందు అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి, ఏడమవైపంతా గీతలు, బాగా లోపలకి సొట్టలు పడ్డాయి.

నెమ్మదిగా ఆ కారువైపు నడిచాడు. ఆ కారు హార్న్ ఆగకుండా మోగుతూనే ఉంది.

"సీట్‌బెల్టు పెట్టుకున్నట్టులేడు.. తల స్టీరింగుకి కొట్టుకున్నట్టుంది.."

ఆ కారుడోరు తెరిచి డ్రైవరుని వెనక్కి కూర్చోబెట్టాడు. హార్న్ మోగడం ఆగింది. ఆ డ్రైవరు తలనుంచి రక్తం కారుతోంది.

"హ్మ్.. ఇప్పుడు ఆంబులెన్సుని పిలవాలా? పోలీసుల్ని పిలవాలా?"

"అసలు వీడిని ఇలా వదిలేసి వెళ్లిపోవటమే బెటరేమో .. వీడు అక్కడ ఆ బైకు కుర్రాడిని అలాగే వదిలేసి వచ్చేసాడుగా.."

జేబులోంచి సిగిరెట్టు తీసి వెలిగించాడు.

లైటరు వెలుగులో కారులో వెనకాల ఏదో కనబడినట్టయింది. వెనకాల డోరు తీసి చూసాడు.

అక్కడ..

కారు ముందుసీటుకి, వెనకసీటుకి మధ్యలో.. 

.. విపరీతమైన రక్తస్రావంతో ..

.. ప్రాణం ఉందో లేదో తెలియని స్థితిలో ..

.. కింద పడి ఉంది..

.. ఓ స్త్రీ..

.. నిండు గర్భిణి.. !!!!

.

4, జూన్ 2020, గురువారం

లయకారుడు



యాభై ఏళ్ల శివయ్య ఓ కుమ్మరి. అది అతని వృత్తి.

శివయ్య పిల్లాజెల్లా లేనివాడు. ఊరికి ఓ మూలగా ఉన్న కొద్దిపాటి స్థలం మధ్యలో ఓ గుడిసె, ఓ పక్కగా కుమ్మరి చక్రం, మిగిలినదాంట్లో పూలూ, కూరగాయల చెట్లు. ఇవీ అతని ఆస్తులు. కుండలు కావాల్సినవాళ్లు అక్కడికే వచ్చి కొనుక్కుంటారు. తానుగా ఎక్కడికీ వెళ్లడు..!

కుమ్మరితనం అతని వృత్తి అయితే, అతని ప్రవృత్తి వేరే ఉంది. ఆ ప్రవృత్తిలో శివయ్య పేరు శివకేశవులు.

కేశవుడు, శివుడు ఎలాగైతే స్ఠితి, లయ కారకులో, శివయ్య శివకేశవులుగా ఉన్నప్పుడు స్ఠితి, లయలను నిర్ణయిస్తాడు.

శివయ్యని, "శివకేశవులూ.." అని సంభోదిస్తూ ఎవరైనా వారింటికి తీసుకెళ్లే ఏర్పాట్లలో వచ్చారంటే వాళ్లింట్లో ఎవరో చావుబ్రతుకుల మధ్య ఉన్నారనీ, వారి భవిష్యత్తు ఏవిటో తెలుసుకోవాలని వచ్చారనీ అర్ధం. కొనఊపిరితో కొట్టుమిట్టాడుతున్నాసరే, ఎంతో పేరుమోసిన డాక్టర్లు కూడా చేతులెత్తేసినా సరే, శివకేశవులు "బ్రతుకుతాడు" అంటే వాడు బ్రతికితీరాల్సిందే.!!

*****                     *****

చిన్నతంలో అనాధగా తిరుగుతున్న శివయ్యని ఓ స్వామీజీ చేరదీసి ఆశ్రయమిచ్చారు. ఆయన ఓ అయుర్వేద వైద్యుడు కూడా. కానీ ఆయన శిష్యగణం, చుట్టుపక్కల గ్రామాల, దగ్గరిలోని పట్టణాల జనాలు ఆయనదగ్గర అతీంద్రియ శక్తులున్నాయని గట్టిగా నమ్మేవారు. ఆయన తన వైద్యానికి రోగి స్పందిస్తున్న తీరునిబట్టి రోగి బ్రతికి బట్టకట్టగలడా లేడా అనేది చెప్పగలిగేవాడు. శివయ్యకి ఆయుర్వేదవైద్యం అబ్బకపోయినా, స్వామీజీ సహవాసంలో చావుబతుకుల "మర్మం" వంటపట్టించుకున్నాడు.

*****                     *****

చేతిలో ఉన్న పుస్తకాన్ని గుండెలదగ్గర హత్తుకుని, తలవంచుకుని వస్తున్న శివయ్యని చూస్తే, ఏపని మీద వచ్చాడో అర్ధమైన ఆ వీధిలో ఉన్నవాళ్లందరూ ఊపిరి బిగపట్టి, నిశ్శబ్దంగా పక్కకి తగ్గి దారి ఇస్తారు.

రోగి ఇంటికి చేరుకున్న శివయ్య ఒక గ్లాసులో నీరు అడిగి ఇప్పించుకుని తాగి, సుమారు ఐదు నిమిషాలపాటు కళ్లుమూసుకుని ధ్యానముద్రలో ఉంటాడు. ఈ ఐదునిమిషాలూ రోగి బంధువులకీ, స్పృహలో ఉంటే రోగికీ కొన్ని యుగాలుగా గడుస్తాయి. కొన్ని సందర్భాలలో శివయ్యని చూడగానే రోగులు కంటతడి పెట్టుకోవడం, ఏడుపులు, పెడబొబ్బలు పెట్టడం కూడా సాధారణం. ధ్యానం తర్వాత శివయ్య చిరునవ్వుతో రోగి నాడిని పట్టుకుని చూస్తాడు. అనుభవఙుడైన డాక్టరులా వ్యాధిలక్షణాలని, అతని ప్రస్తుత స్థితిగతులని అడిగి తెలుసుకుంటాడు. అంతా విన్న తర్వాత, ఇంటిబయటకి నడిచి ఒక కుటుంబసభ్యునికి తన "నిర్ణయం" తెలియచేస్తాడు.

ఈ విషయంలో శివయ్యని బాగా దగ్గర్నుండి గమనించినవాళ్లు తేల్చినదాని ప్రకారం - "రోగితో మాట్లాడిన తర్వాతా, కుటుంబసభ్యునికి తన నిర్ణయం చెప్పడానికి ముందూ,  శివయ్య తనవెంట ఉన్న పుస్తకంలో ఏదైనా రాసాడూ అంటే, ఆ రోగికి నేల మీద నూకలు చెల్లినట్టే!. పుస్తకం తెరవలేదూ అంటే రోగి బతికి బట్టకట్టినట్టే!."

ఈ విషయం శివయ్యకి కూడా తెలిసినా, దాన్నిగురించి ఎప్పుడూ పట్టించుకోనూలేదు.. అలా అని తన అలవాటుని మార్చుకోనూలేదు. శివయ్య పుస్తకంలో ఏమి రాస్తాడనేది ఎవరికీ తెలియదు.. ఎవరూ అతన్ని అడిగే సాహసం కూడా చెయ్యలేదు. శివయ్య పుస్తకం తెరవగానే ఆ ఇల్లంతా దుఖసాగరంలో మునిగిపోయేది.

*****                     *****

రాజయ్య, శివయ్య చిన్ననాటి స్నేహితుడు. 55 ఏళ్ల వయసుకే రెండుసార్లు గుండెపోటు తెచ్చుకున్న రాజయ్యకి, మూడోది ఎప్పుడు వస్తుందో, అదే గనక వస్తే దాన్ని తట్టుకుని ఎన్ని రోజులు బతుకుతాడో చెప్పలేమని తేల్చేసారు డాక్టర్లు.

"వాళ్ల మొహం. ఇంకేం తెలుసట వాళ్లకి?. నిన్ను అడిగితే ఠకీమని చెప్పెయ్యవూ!" నిష్టూరమాడాడు రాజయ్య కుండలు తయారుచెయ్యడం కోసం మట్టిని తొక్కుతున్న శివయ్యతో.

"నీ చావు ఎప్పుడో తేల్చాల్సిన రోజు నాకు ఎప్పటికీ రాకూడదని రోజూ దేవుడికి దండం పెట్టుకుంటున్నాను" అన్నాడు శివయ్య మొహం చిన్నబుచ్చుకుని.

"అట్టా అంటే ఎట్టా?. నువ్వు చెప్పలేదని నా చావు ఆగిపోతాదా?.." అని ఆగి గట్టిగా గాలి పీల్చుకుని, "నువ్వో సాయం చెయ్యాలి నాకు.." అన్నాడు రాజయ్య.

మళ్లీ తనే అందుకుని, ".. విష్ణు విదేశాల్లో చదువు ఓ సంవత్సరం అయిపోయింది.. ఇంకో సంవత్సరం ఉంది.. సెలవలకని వస్తున్నాడు. ఓ నెలరోజులపాటు ఉంటాడు. వాడు ఇక్కడ ఉన్న రోజుల్లో నువ్వు నా చావు గురించి చెప్పటానికి వీల్లేదు. మాటియ్. ఒట్టెయ్యి.." అన్నాడు చెయ్యి చాచి.

"అట్టా ఎట్టా మాటివ్వగలను నేను.. నా వల్లకాదు. అయినా వాడు నీ కొడుకు. వాడికి నిజం తెలియక్కర్లా..!!" అన్నాడు శివయ్య మట్టికాళ్లు కడుక్కుంటూ.

"నేను పోతాను అని తెలిస్తే వాడు మళ్లీ వెనక్కి వెళ్తాడా?. వాడికి ఇంట్లోవాళ్లమీద ఎంత ప్రేమ ఉందో, ఇక్కడ జనాలన్నా, ఈ ఊర్లన్నా అంతే అభిమానం. వాడి ఆలోచనలన్నీ ఇక్కడున్నవాళ్ల బాగుకోసమే ఉంటాయి. అక్కడ చదువుకి కూడా దీనికోసమే వెళ్లాడు. అట్టాంటిది నాగురించి వాడి చదువూ, వాడి ఆలోచనలూ ఆగిపోకూడదు.." అంటూ లేచి తుండు దులుపుకుని భుజమ్మీద వేసుకుని వెళ్లిపోయాడు రాజయ్య.

రాజయ్య వెళ్లినవైపు చూస్తుండిపోయాడు శివయ్య.

*****                     *****

నెలరోజుల సెలవలకోసం ఇంటికి వచ్చాడు విష్ణు. మూడు వారాలు ఆనందోత్సాహాలతో ఇట్టే గడిచిపోయాయి. ఇంకోవారం కూడా ఇలాగే ఏ సమస్యా లేకుండా జరిగిపోవాలని దేవుడిని ప్రార్దిస్తున్నాడు శివయ్య.

విష్ణు ప్రయాణానికి ఇంకా నాలుగురోజులుందనగా స్నానం చేస్తున్న రాజయ్య కుప్పకూలిపోయాడు. మళ్లీ స్పృహలోకి వచ్చి, పూర్తిగా తేరుకునేసరికి ఇంట్లోవాళ్లు చెప్పారు విష్ణు శివయ్యని తీసుకురావడానికి వెళ్లాడని.

ఆదుర్దాగా తన ఇంటికి వస్తున్న విష్ణుని అల్లంతదూరంలో చూడగానే శివయ్యకి తను భయపడ్డట్టే జరిగిందన్న భావనతో ఒళ్లు జలదరించింది. తప్పనిసరి పరిస్థితుల్లో విష్ణు వెంట నడిచాడు.

మంచం చుట్టూతా ఉన్న కుటుంబసభ్యులందరూ శివయ్యని చూడగానే పక్కకి తప్పుకున్నారు. ఏమాత్రం ఓపికలేని రాజయ్య నిస్సత్తువగా కళ్లుతెరిచి మంచం పక్కన కూర్చుంటున్న శివయ్యని ఒకసారి చూసి మళ్లీ కళ్లు మూసుకున్నాడు.

మంచినీళ్లు అడిగి తెప్పించుకుని తాగాడు శివయ్య.  కళ్లు మూసుకుని ప్రార్ధిద్దామన్నా మనసుని లగ్నం చెయ్యలేక అలానే కళ్లుమూసుకుని, రాజయ్య బతుకుతాడని నిర్ణయం రావాలనే ఆశతో, ఐదు నిమిషాల ప్రార్ధన అయిందనిపించాడు.

రాజయ్యని పరీక్ష చెయ్యడం మొదలుపెట్టాడు.. కనురెప్పలని విడదీసి కళ్లని చూడగానే శివయ్యకి అర్ధమైపోయింది, రాజయ్య ఎక్కువ కాలం బతకడని. వాడిపోయిన మొహంతో నాడిని పట్టుకుని చూసాడు ఆశగా, ఏమైనా "జీవం" కనబడుతుందేమో అని. సన్నటి కన్నీటిపొరతో మసకబారుతున్న కళ్లతో రాజయ్య కళ్లలోకి చూసాడు శివయ్య. రాజయ్య కళ్లలో నిజం తనకూ తెలుసునన్న భావంతోపాటుగా ఓ అభ్యర్ధన కూడా కనబడింది శివయ్యకి.

తప్పుడు "నిర్ణయం" ఇవ్వమని ఎవరైనా అడగడం అనేది శివయ్య ఇప్పటిదాకా ఎన్నడూ ఎదుర్కోని, కలలో కూడా ఊహించని పరిస్థితి. కానీ ఇప్పుడు...!!

భారమైన హృదయంతో ఇంటిబయటకి నడిచిన శివయ్య దగ్గరకి వెళ్లాడు విష్ణు. అందరిలాగే శివయ్య "పద్ధతి" తెలిసిన విష్ణు తను ఏమైనా చెప్తాడా, పుస్తకం తీస్తాడా అని శివయ్య వైపు చూసాడు ఆత్రంగా. విష్ణు కళ్లల్లో, రాజయ్య గర్వంగా చెప్పిన కలలు, ఆశయాలు, కోరికలు కనబడ్డాయి శివయ్యకి.

కానీ.. ఇప్పుడు తను తప్పుడు నిర్ణయం ఇస్తే, రాబోయే రోజుల్లో తన "విద్య"ని నమ్ముకున్నవాళ్ల పరిస్థితి ఏమిటి అన్న ఆలోచన ఓ వైపు, తనకి ఈ విద్యాదానం చేసిన స్వామీజీ ఆత్మ ఎంత క్షోభిస్తుందో అన్న ఆలోచన ఇంకోవైపు..!!.

ఆలోచనలని పక్కకితోస్తూ, చేతిలో పుస్తకాన్ని తెరిచి అందులో ఏదో రాసాడు శివయ్య. భయం, దుఖం, ఉద్వేగంతో నిండిపోయిన విష్ణు మొహంలోకి చూస్తూ, తన భుజమ్మీద చెయ్యివేసి, "ఏమీ ఖంగారు పడక్కర్లేదు. నాన్నకి అంతా మంచే జరుగుతుంది. రోజురోజుకీ ఆరోగ్యం బాగుపడుతుంది. నువ్వు ఇంక దీనిగురించి ఆలోచించకుండా నీ చదువు మీద ధ్యాస పెట్టు. మీ నాన్నకి కావాల్సింది కూడా నీ చదువు పూర్తవడం, నీ ఆశయం నెరవేరడం.." అంటూ వెళ్లిపోయాడు.

విష్ణుకి అంతా అయోమయంగా అనిపించింది. అయినా, అలవాటుగా పుస్తకంలో రాయడం కంటే శివయ్య నోటితో చెప్పిన నిర్ణయమే ముఖ్యం అనుకుంటూ ఆనందంగా ఇంట్లోకి నడిచాడు.

*****                     *****

రెండు రోజుల తర్వాత విష్ణు చాలా ఆనందంగా పళ్లు తీసుకొచ్చి శివయ్యకి ఇచ్చాడు, "నాన్న ఆరోగ్యం కుదురుకుంది.. శుభ్రంగా లేచి తిరుగుతున్నాడు, తన పనులు తను చేసుకుంటున్నాడు. అంతా నువ్వు చెప్పినట్టే జరుగుతోంది. చాలా సంతోషంగా ప్రయాణమౌతున్నాను నేను" అంటూ.

*****                     *****

విష్ణు బయల్దేరివెళ్లినరోజున, "నాకేమైనా అయితే వాడికి తెలియచెయ్యకూడదు, వాడి చదువు అయ్యేంతవరకు", అని ఇంట్లోవాళ్లందరి దగ్గర మాట తీసుకున్న రాజయ్య, ఆ రాత్రి నిద్రలో ప్రాణం వదిలేసాడు.

రాజయ్య కుటుంబమంతా దుఖంలో మునిగిపోతే, ఊరంతా నివ్వెరపోయింది. వాళ్లందరికీ ఇప్పటిదాకా శివయ్య నిర్ణయం తప్పడం అనేది తెలియదాయే మరి.

ఎందుకిలా జరిగిందో తెలుసుకోవాలని శివయ్య ఇంటికి వెళ్లిన ఊరివారికి శివయ్య తన గుడిసెలో చూరుకి వేళ్లాడుతూ కనిపించాడు .. నిర్జీవంగా.

తనకి విద్య నేర్పించిన స్వామీజీ ఫొటోముందు శివయ్య చేతి పుస్తకంలో తెరిచి ఉన్న పేజీలు రెపరెపలాడుతున్నాయి. ఆ పేజీలో, రాజయ్య పేరు, శివయ్య రాజయ్య ఇంటికివెళ్లిన రోజు తేదీ, వారం .. దానికింద..

"రాజయ్య వారం రోజులు మించి బతకడు. చచ్చిపోతాడు.
.. కానీ వాడి కలలని నేను చంపలేను..
.. నన్ను క్షమించండి!!
"
    
.