23, మే 2020, శనివారం

జీవనచక్రం

.


తాతయ్య ఆ రోజు మమ్మల్ని వదిలి వెళ్లిపోతున్నాడు.. ఎప్పటికీ!.. ఎక్కడకో..!?

అమ్మ బంధువులకీ, కుటుంబస్నేహితులకీ ఫోను చేసి చెప్తోంది, గద్గదస్వరంతో, "ఇవాళ మధ్యాహ్నం మూడింటికి వెంటిలేటర్ తీసేస్తారు.." అని.

వారం రోజుల క్రితం..

నాన్న తాతయ్యని హాస్పిటల్‌కి తీసుకెళ్లడానికి కారు వెనకసీట్లో పడుకోపెడ్తున్నప్పుడు, కన్నీళ్లని తుడుచుకుంటూ, "అమ్మా తాతయ్యకేమయ్యింది? నెప్పి తొందరగా తగ్గిపోతుందా?" అని అడుగుతుంటే, నన్ను తనదగ్గరికి రమ్మని సైగ చేసి, నా తలమీద చెయ్యివేసి, జుట్టులోకి వేళ్లుపోనిచ్చి నిమిరాడు ఎప్పటిలాగే. ఇంతలోకే ఎడమచేత్తో గుండెమీద గట్టిగా పట్టుకుని నెప్పి తగ్గించుకునే ప్రయత్నంలో నా తలమీద ఉన్న తన కుడిచెయ్యి కిందకి జారిపోయింది. నేను అడిగిన ప్రశ్నకి తాతయ్య నాకు సమాధానం ఇవ్వనేలేదు.

తాతయ్య ఆయాసపడడం, ఊపిరి పీల్చుకోవడానికి కష్టపడడం చూస్తుంటే.. నేను నా ఇన్‌హేలర్ బళ్లో పారేసుకుని, అస్త్మా ప్రభావంతో ఊపిరి తీసుకోవడానికి కష్టపడుతుంటే.. తాతయ్య కుండపోతగా పడుతున్న వర్షంలో పరిగెత్తుకుంటూ వెళ్లి దాని కొనుక్కొచ్చింది గుర్తుకొచ్చింది.. కానీ ఇప్పుడు తాతయ్యకోసం నేను ఏమీ చెయ్యలేకపోతున్నాను.. ఏడవడంతప్ప.. అమ్మ నన్ను దగ్గరికి తీసుకుని సముదాయించింది, తాతయ్యకి తగ్గిపోతుందని.


ముందురోజు సాయంత్రం..

హాస్పిటల్ రిషెప్షన్ దగ్గర .. మొహం చేతుల్లో దాచుకుని, ఏడుస్తున్న నాన్నని సముదాయిస్తూ అమ్మ, "అంతా పైవాడివ్రాత.. మనం ఒప్పుకోవాల్సిందే.. ఏదో ఒకరోజు జరగాల్సిందే" .. ఇలా ఏవేవో అంటుంటే నాకేమీ అర్ధం కాలేదు కానీ మనసులోనే తాతయ్యకి తొందరగా తగ్గాలని దేవుడికి దణ్ణం పెట్టుకున్నాను.


ఆరోజు..

మేము మధ్యాహ్నం ఒంటిగంటకి హాస్పిటల్ చేరుకున్నాము. ఇవాళెందుకో రిసెప్షన్ దగ్గర సెక్యూరిటీ నన్ను ఆపలేదు. అమ్మ ముందు వెళ్తూంటే, వెనకాలే, తన వేగాన్నందుకోవదానికి ప్రయత్నిస్తూ, మెట్లూ అంతస్థులూ ఎక్కి తాతయ్య ఉన్న ICU దగ్గరకి చేరుకున్నాం. ఓ నర్సు మమ్మల్ని లోపలకి తీసుకెళ్లింది.

వారం రోజుల తర్వాత చూస్తున్నాను తాతయ్యని.. నా బెస్ట్ ఫ్రెండుని.. పడుకుని ఉన్నాడు బెడ్‌మీద.. చుట్టూరా చాలా మెషీన్లు.. కొన్నిటికి చిన్న చిన్న లైట్లు వెలుగుతున్నాయి.. కొన్ని "బీప్.. బీప్" అంటున్నాయి.. తాతయ్య గుండె శబ్దాల్లా..

అప్పుడు చూసాను నాన్నని.. తాతయ్యకి బాగా దగ్గరలో కూర్చోని ఉన్నాడు.. కళ్లు ఎర్రగా ఉబ్బిపోయి ఉన్నాయి.. నాన్నని ఆస్థితిలో చూసేసరికి అమ్మ కూడా తట్టుకోలేక గట్టిగా ఏడుస్తూ నేలమీద కూలబడిపోయింది. నాన్న తను కూర్చున్న చోటినించి లేచి అమ్మని లేవదీసి సముదాయిస్తూ గది బయటకి తీసుకెళ్లాడు.

నేనూ, నాకు అందరికంటే ఎంతో ఇష్టమైన తాతయ్యా మిగిలాం ఆ గదిలో. నెమ్మదిగా నడుచుకుంటూ దగ్గరకి వెళ్లి తాతయ్య మొహంలోకి చూసాను. ఎప్పటిలాగే ప్రశాంతంగా ఉంది.. ఏ నొప్పీ, ఏ బాధా లేకుండా. ముక్కులో, నోట్లో గొట్టాలున్నా కూడా తాతయ్య మొహంలో నాకు ఎప్పుడూ చెరిగిపోకుండా ఉండే చిరునవ్వు కనిపించింది. చెయ్యి చాచి తాతయ్య తల నిమిరాను. రోజూ నేను నిద్ర పోయేంతవరకూ కధలు చెప్పిన ఆ  నోరు ఒక్కసారి తెరిచి నన్ను పిలిస్తే బాగుణ్ణు అనిపించింది. నన్ను ఎప్పుడూ ప్రేమగా చూసే ఆ కళ్లు తెరిచి నన్ను ఒకసారి చూస్తే బాగుణ్ణు అనిపిఉంచింది. కానీ తాతయ్య చూడలేదు.. పడుకునే ఉన్నాడు.

నా జుట్టుని ఎప్పుడూ ప్రేమగా నిమిరే చేతివంక చూసాను. నా రెండు అరచేతుల మధ్య తీసుకుంటే, ఎప్పటిలాగే నా అరచేతి కంటే పెద్దగా ఉంది తాతయ్య అరచేయి. తన చూపుడువేలిని నా గుప్పెట్లో బిగిస్తే, ఎంతటి రద్దీ ప్రదేశంలో అయినా ఎప్పుడూ తప్పిపోవని తాతయ్య చెప్పిన మాట చెవుల్లో ప్రతిధ్వనించింది.

జేబులోంచి ఇన్‌హేలర్ తీసి దగ్గర్లో ఉన్న టేబుల్‌మీద పెట్టాను. "గుర్తుపెట్టుకో.. ఈ ఇన్‌హేలర్ ఎప్పుడూ నీ లైఫ్‌సేవర్" అని తాతయ్య నాకు ఒకప్పుడు చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ తాతయ్య చెవిలో నెమ్మదిగా చెప్పాను "ఏమీ పర్వాలేదు తాతయ్యా.. నీకు తొందరగానే తగ్గిపోతుంది.. ఇదిగో లైఫ్‌సేవర్ నీ దగ్గరే పెట్టాను .."

"అబ్బాయి!.. అబ్బాయి పుట్టాడు!!" ఆనందోత్సాహాలతో పెద్దగా అరుస్తూ అప్పుడే పుట్టిన బిడ్డని తీసుకొస్తున్న నర్సు దగ్గరకి పరుగులాంటి నడకతో వెళ్తున్న నాన్న నన్ను "ఈ రోజు" కి తీసుకొచ్చాడు.. 18 ఏళ్ల తర్వాత అదే హాస్పిటల్లో, అదే ఫ్లోర్‌లో!!

"చూడు.. చూడు..వీడు అచ్చు గుద్దినట్టు మీ తాతయ్యలాగే ఉన్నాడు.. కదా?" అని నాన్న ఆనందంతో వణుకుతున్న స్వరంతో అంటున్నాడు..

కానీ.. నాకు పుట్టిన బిడ్డలోకన్నా నాన్నలోనే కనబడ్డాడు తాతయ్య ఆ క్షణంలో..

ఇంకో తాత.. మరో మనవడు ..

 ..మరో జీవనచక్రం మొదలయ్యింది..

|| జాతస్య హి ధృవోన్మృత్యుః ధృవం జన్మ మృతస్యచ ||.