10, సెప్టెంబర్ 2011, శనివారం

బేకారు కబుర్లు


.. అంటే "పనికిరాని కబుర్లు" అని కాదు. అలా అని పనికొచ్చే కబుర్లు అని కూడా కాదు. గతవారం కారు సర్వీసుకెళ్లడమ్మూలాన పుట్టిన కబుర్లు.. "కారు" లేని కబుర్లు. బే"కారు" కబుర్లు.  అదన్నమాట!  :)

                         ****************               ***************
ఇక్కడో చిన్న ముందుమాట..

మనముండే స్ఠలంలో/ఏరియాలో/పేటలో ఎండ విరగకాస్తూ ఉంటుంది, కానీ పక్కపేటలో ఉండే మనవాళ్లకి ఫోను చేస్తే అక్కడ కుంభవృష్టిగా వర్షం పడుతూఉందంటారు. భాగ్యనగరవాసులకి ఇది చాలావరకు అనుభవంలో ఉన్న సంగతే!. ఇది వేరే ఊళ్లల్లో కూడా నిజమవ్వొచ్చుగాక!, అక్కడ అంత పట్టింపు లేకపోవచ్చుగాక!. కానీ మన ఆఫీసు ఊరికి ఓ చివర ఉండి, మన ఇల్లు ఇంకో చివరన ఉంటే గనక ఇది పెద్ద సంగతే!.

సరే, విషయానికొస్తే.. కారులేదని చెప్పానుగా!. ఆరోజు ద్విచక్రవాహనమ్మీద ఆఫీసుకి వెళ్లాను. సాయంత్రం ఆఫీసు దగ్గర బయలుదేరినప్పుడు అక్కడ ఆకాశం చాలా నిర్మలంగా, ప్రశాంతంగా ఉంది. ముందు చెప్పుకున్నట్టుగా ఏనిమిషానికి ఎక్కడ ఎలా ఉంటుందో తెలియదు కాబట్టి, సాధ్యమైనంత తొందరగా ఇంటికి చేరుకోవాలని అనుకుంటూ ప్రయాణం మొదలుపెట్టాను.

ఒక ఏరియాలోకి వచ్చేసరికి, అల్లంతదూరంలో నాలుగు రహదారుల కూడలిలో నాకు గ్రీన్ సిగ్నల్ కనబడుతోంది. ఎలాగూ సిగ్నల్ దగ్గరకి వెళ్లేసరికి అది ఎరుపులోకి మారటం ఖాయం కాబట్టి, నా బండి వేగాన్ని తగ్గించాను. అనుకున్నటుగానే, సిగ్నల్ ఎరుపులోకి మారింది. నేను బండిని ఆపాను. నా ముందు రెండు వరసల్లో మరి కొంత మంది ద్విచక్రవాహనచోదకులు ఆగి ఉన్నారు.

నేను చాలా తీవ్రంగా సిగ్నల్‌కేసే చూస్తున్నాను. కాసేపటికి సిగ్నలు ఆకుపచ్చలోకి మారింది. కానీ నా ముందున్న రెండువరసల ద్విచక్రవాహనచోదకులు కదలడంలేదు. నేను హారన్ కొట్టాను. ఇంతలో నావెంక ఉన్నవాళ్లు కూడా హారన్ కొట్టడం మొదలుపెట్టరు. నేను వెనక్కి తిరిగి ముందువాళ్లు కదలడంలేదన్నట్టు సైగ చేసి, మళ్లీ గట్టిగా, అసహనంగా హారన్ కొట్టాను.

అప్పుడు నా ముందు వరసలో ఉన్న ఒకతను "నువ్వెళ్లాలంటే పక్కనుండి వెళ్లు" అన్నట్టుగా చేత్తో సైగ చేసాడు. తనబండి ఏమన్నా ఆగిపోయిందేమో అనుకుంటూ అతన్ని దాటుకుని ముందుకువెళ్తే ముందువరసలో అతను కదలడే?. మళ్లీ హారన్ కొట్టాను. ఆ ముందు వాడు నావంక కాస్తంత చిరాగ్గా చూసి కొద్దిగా దారి ఇచ్చాడు.

ఆకుపచ్చ సిగ్నలు పడ్డా కదలని వాళ్ల అజ్ఞానానికి నవ్వుకుంటూ నా బండి వేగాన్ని పెంచబోయిన నాకు, ఎవరెంత జ్ఞానులో వెంటనే అర్ధమయ్యి "కస్స్.." మని బ్రేకు వేసి బండిని ఆపాను.

ఎందుకంటే..

నాకు ఎదురుగా కనబడుతున్న ఆకుపచ్చ లైటు వెలుగుతున్న సిగ్నలు స్థంభం మొదలుకుని మేము వెళ్లాల్సిన దారి అంతా కుండపోతగా వర్షం పడుతోంది మరి!!!!

విచిత్రంగా, మేము నిల్చున్నచోట ఒక్క వర్షపు చినుకు కూడా లేదు. ఎవరో గీతగీసినట్టుగా,మేఘాలకి గోడ కట్టినట్టుగా సిగ్నల్‌కి ఆవతలపక్కనే వర్షం పడుతోంది.!!!

అలా రెండు సిగ్నళ్లు గడిచేసరికి ఆటోవాళ్లకి, కార్లవాళ్లకి, బస్సులవాళ్లకి అసహనం పెరిగిపోయింది. వాళ్లకి దారి ఇచ్చి, వర్షం ఓ మాదిరిగా శాంతించి మేము బయల్దేరేసరికి 7,8 ఆకుపచ్చ సిగ్నళ్లకోసం ఎదురుచూడాల్సొచ్చింది ఆరోజు..!

                         ****************               ***************

                         ****************               ***************

పై సంఘటన జరిగిన తర్వాత రోజు రిస్కు ఎందుకులే అని, ఆరోజుకి బాషా (ఆటోవాలా)ని ఉధ్ధరిధ్ధామని నిర్ణయించుకున్నాను. సరే, ఉదయం అలాగే ఆటోలో ఆఫీసుకి వెళ్లిపోయాను.

సాయంత్రం, ఆఫీసునుండి బయటపడేసరికి సన్నగా తుంపరలు పడుతున్నాయి. రోడ్డు మీదదాకా వచ్చి ఆటో గురించి ఎదురుచూస్తున్నాను. ఆటోలు వస్తున్నాయి, పోతున్నాయి.. వచ్చినవాటిలో అంతకుముందే జనాలు ఉండడంతో కొన్ని ఆటోలు ఆగకపోతే, ఒకటో రెండో ఖాళీ ఆటోలు నాదగ్గరకొచ్చి ఆగి, నేనెళ్లాల్సినచోటు పేరు చెప్పేసరికి రామంటూ తుర్రుమన్నాయి.

ఈలోపల వర్షం పెద్దదవుతోంది. చుట్టుపక్కలెక్కడా తలదాచుకునే స్థలం కనబడలేదు. "తాదూరకంత లేదు.." అన్నట్టు భుజమ్మీద లాప్‌టాప్ అనే డోలొకటి!.

ఇక లాభంలేదు. ఇప్పుడు ఏ ఆటోవాడు వచ్చినా వాడు ఎక్కడదాకా తీసుకెళ్తానంటే అక్కడదాకావెళ్లి, కావాలంటే అక్కడనుండి వేరే ఆటో మాట్లాడుకుని ఇంటికి వెళ్లాలని నిర్ణయించుకున్నాను.

ఇంతలో.. ఏదేవుడో వరమిచ్చినట్టుగా నాకు ఓ పది అడుగులదూరంలో ఓ ఆటో ఆగింది. అందులో ఉన్న జనాలు దిగి ఆటో అతనికి డబ్బులు ఇచ్చి వెళ్లిపోతున్నారు.

నేను ఆటోకి, ఆటోలోంచి దిగినవాళ్లకి ఎదురుగా వడివడిగా అడుగులువేసాను. ఆటోలోంచి దిగినవాళ్లలో ఒకతను నావంక చూస్తూ కాస్తంత వెటకారంగా నవ్వినట్టనిపించింది. వేరే సంధర్భంలో అయితే నేనుఎలా ప్రవర్తించి ఉండేవాడినోగానీ ఆ సమయానికి పెరుగుతున్న వర్షంలో ఆటోని అందుకోవడమే నా ధ్యేయంగా సాగుతున్న నన్ను ఆవెటకారం నవ్వు ఏమీ చెయ్యలేకపోయింది.

నేను ఆటోదగ్గరకి వచ్చేసరికి ఆటోవాలా ఏదో అంటున్నాడు. అతను ఎటువైపు వెళ్తుంటే నేను కూడా అటే వెళ్లాలని ముందే నిర్ణయించుకుని ఉండడంవల్ల, "నేనూ అటే వస్తాను పద" అంటూ లోపలకి ఎక్కబోయాను. కానీ అతను ఖంగారుగా చేతులూపుతూ ఏదో చెప్తున్నాడు. ఇంక అతను ఏమి చెప్తున్నాడో నాకు వినక తప్పలేదు.

"ఏమిటీ" అని రెట్టించి అడిగాను.

అతను చూపుడువేలు, మధ్యవేలు కలిపి V ఆకారంలో పెట్టి అంటున్నదేమిటంటే"భాయిసాబ్! ముఝే అర్జెంట్ నంబర్ 2 జానా హై. ఇసీలియే ఉన్ లోగోంకో భీ ఉతార్ దియా" (అన్నా! నేను అర్జెంటుగా నంబర్ 2 కి వెళ్లాలి. అందుకనే వాళ్లని కూడా దింపేసాను).

అది నాకు పూర్తిగా అర్ధమయ్యేలోపే, గన్నులోంచి బయటకి వచ్చిన బుల్లెట్టులాగా, వింటిని విడిన బాణంలాగా ఆటోతో సహా మాయమైపోయాడు.

అప్పుడు తెలిసింది నాకు ఇందాక అతని వెటాకారపు నవ్వుకి అర్ధం..

.. ఇంగ్లీషులో ఏదో అంటారు చూడండీ.. Shit Happens..!!!.. అచ్చం ఇలాగే!  :(

3, సెప్టెంబర్ 2011, శనివారం

నా "కుచేల"మిత్రుడు


పూర్తిగా అజ్ఞాతంలోకి వెళ్లిపోయి.. ఒక జ్ఞాపకంగా, గుర్తుగా మిగిలిపోయాడనుకున్న ఒక బాల్యమిత్రుడు ఎక్కడినుండో ఊడిపడ్డాడు..

.. మొన్నీమధ్యన ఫోను చేసాడు.

                               **********    *********

నాకు తెలియక అడుగుతానూ?. ఎవరైనాసరే అసలు పరిచయంలేనివాళ్లని ఎలా సంభోదిస్తారూ? "ఏవండీ","మీరు" వగైరా వగైరా కదా?. సరే, అప్పటికి ఇంకా మేము ఏడోతరగతే చదువుతున్నాం కాబట్టి, మహా అయితే "నువ్వు".. కదా?

కానీ వీడ్నేమనాలండీ..?, మొదటిరోజు క్లాసులోకి వస్తూనే పక్కన కూర్చుంటూ, ముక్కూ మొహం తెలియనివాడ్ని పట్టుకుని, "ఏరా బావా?" అనేవాడిని..??!!

తెల్లబోయి, బిక్కమొహంవేసుకుని చూస్తున్న నామొహంవైపు ఓ వంకరనవ్వు విసిరి, "ఏంట్రా? బావా అన్నానని ఫీలయ్యావా?" అంటూ పక్కవరస బెంచీల్లో కూర్చున్న అమ్మాయిలవంక చూపిస్తూ, "వాళ్లందరూ నీకు 'సిస్టర్స్' అయితే నువ్వు నాకు బావవే కదరా?" అన్నాడు కళ్లెగరేస్తూ..

అదీ, మా తొలిపరిచయం..!

                               **********    *********

మీకిప్పటికే అర్ధమైఉండాలి వాడెంత అల్లరివాడో! ఎంత ఆకతాయివాడో!. వాడి పిచ్చివేషాలకి నేను బలైన సంధర్భాలు కోకొల్లలు. అదేమంటే "మరీ అంత మెత్తగా, అమాయకంగా ఉంటే ఎలారా బావా?. నువ్వలా ఉంటే నాలాంటివాళ్లకి నిన్ను మెత్తబుద్ధేస్తది.. ఇలా ఇరికించబుద్ధేస్తది" అనేవాడు.

అయినాకూడా వాడెంతో నచ్చేవాడు నాకు.. ఎందుకంటే.. నేను చెయ్యాలనుకుని, ఇంట్లోవాళ్ల భయంవల్లగానీ, స్వతహాగా నాకు ధైర్యం లేకపోవడంవల్లగానీ చెయ్యలేకపోయిన ఎన్నో పనులు వాడు సునాయాసంగా చెయ్యగలిగేవాడు.. అందుకు!!

అప్పటికీ, వాడి సావాసంలో నేను చాలా ఘనకార్యాలు సాధించాను.. మొదటిసారి సిగరెట్టు తాగాను, అప్పుడే కిందకి దించిన కుండలో నురగలు కక్కుతున్న కల్లు రుచి చూసాను, వాడు అమ్మాయిలవెంటపడుతుంటే వాడివెనకాల నేను వెళ్లాను.. అమ్మాయిలతో చీవాట్లు తిన్నాను.. నాకున్న కొద్దిపాటి "గుడ్‌విల్" తో వాళ్ల అన్నదమ్ములతో తృటిలో దెబ్బలు తప్పించుకున్నాను. ఇలా చెప్పుకుంటూపోతే ఎన్నో!!

                               **********    *********

ఇంటర్మీడియట్ అయినతర్వాత నేను ఇంజనీరింగులో చేరడానికెళ్తుంటే (వాడు B.Scలో చేరాడు), నాకు వీడ్కోలు పలకడానికి వచ్చిన వాడి కళ్లల్లో నీళ్లు..!!. నాకు చాలా ఆశ్చర్యమేసింది.. ఎందుకంటే అట్లాంటి సున్నితత్వం నేను అంతకుముందెన్నడూ వాడిలో చూడని, ఎరగని కోణం.

ఈ-మెయిళ్లు,చాట్లు, సెల్ ఫోన్లు లేని ఆరోజుల్లో, కాలేజీ ఉన్న రోజుల్లో ఉత్తరాలలో,  సెలవలకి వచ్చినప్పుడు మా ఊళ్లో మా స్నేహం సాగింది. అంతలోనే వాళ్ల నాన్నగారు కాలం చెయ్యడంతో, వాళ్లు తన మేనమామావాళ్ల ఊరు వెళ్లిపోవడం, నేను థీరీలు, ప్రాక్టికల్సు, మార్కుల వెనక పరిగెడ్తూ ఉండడంలో మా మధ్య ఉత్తరాల సంఖ్య కూడా నెమ్మదిగా తగ్గిపోయి.. కొన్ని రోజులకి పూర్తిగా ఆగిపోయాయి.

                        ********** *********
ఏదైనా సినిమా చూస్తున్నప్పుడు అందులో ఏదైనా సీను నా స్కూలు రోజులని గుర్తు చేస్తే వెంటనే నాకు వాడే గుర్తొచ్చేవాడు.. మేమిద్దరం కలిసి గడిపిన సమయం గుర్తొచ్చేది.. నా పెదవులమీద చిరునవ్వు విరిసేది.

ఉద్యోగంలో చేరిన తర్వాతా, నేను పెళ్లి చేసుకోబోయేటప్పుడు, ఇంకా అనేక సంధర్భాల్లో వాడి ఆచూకీకోసం పరస్పరమిత్రుల దగ్గర చాలా ఆరాలు తీసాను. ఫలితం శూన్యం. ఇంకా చెప్పాలంటే, కొంతమంది స్నేహితులు అట్లాంటివాడు ఒకడుండేవాడని కూడా పూర్తిగా మర్చిపోయారు.. అంతలా వాడు "అంతర్ధానం" అయిపోయాడు.
                             ********** *********

అట్లాంటివాడు ఇప్పుడు మళ్లీ "ప్రత్యక్షం" అయ్యాడు..

..వాడే నాకు ఫోను చేసాడు.

"ఏరా బావా? బావున్నావా?" అని ఫోనులో వాడి పలకరింపుతో నా మనసు పులకించింది.

కానీ.. వాడి మాటల్లో, వాడి గొంతులో ఏదో తేడా..!. అంతకు ముందు మేమెప్పుడు కలిసినా వాడు "వక్త" అయితే, నేనెప్పుడూ "శ్రోత"ని. అలాంటిది ఇప్పుడు మా పాత్రలు తారుమారు అయ్యాయి. నేను ప్రశ్నలు వేస్తుంటే వాడు ముక్తసరిగా, నసుగుతున్నట్టుగా, సంకోచంగా, దాటవేసే సమధానాలు ఇస్తున్నాడు.

సడెన్‌గా నా బుర్రలో ఏదో మెరిసింది..నాకు అర్ధమయ్యింది.. వాడు అలా ఎందుకు అలా ప్రవర్తిస్తున్నాడో?. వాడు ఆర్ధికంగా బాగా ఇబ్బందుల్లో ఉన్నాడు.. Yes! That's it! He is not able to make both ends meet. అందుకని నా దగ్గరనుంచి సహాయం ఆశిస్తున్నాడు.

వాడిని ఆ స్థితిలో కలుసుకోవడం బాధగా ఉన్నా, వాడికి నేను సహాయపడగలను అన్న ఆలోచన నాకు చాలా ఆనందాన్ని కలిగించింది. కాని వాడు ఏక్కడ ఉంటున్నాడో, చిరునామా ఏమిటో తెలుసుకొనేసరికి నా తలప్రాణం తోకకొచ్చింది. ఏమో! వాడి పేదరికాన్ని నేను చూడకూడదనుకుంటున్నాడేమో?.

వాడ్ని తొందర్లోనే కలుస్తానని భరోసా ఇచ్చి ఫోను పెట్టేసాను.
 
                                      ******** ************
 
ఆఫీసులో పని ఒత్తిడులవల్ల, ఆ "తొందర్లోనే" రావడానికి ఓ వారం పట్టింది. వాళ్ల ఊర్లో దిగినతర్వాత వాడి చిరునామాని చాలా సులభంగానే కనుక్కున్నాను.. కానీ..
 
.. నేను ఊహించిన దానికి, నేను చూస్తున్నదానికి "అస్స్..స్స్..సలు" పొంతనలేనేలేదు.
 
..ఎందుకంటే, నేను ఒక పే..ద్..ద్ద బంగళా ముందు నుంచోని ఉన్నాను. దాని విస్తీర్ణమంతా చూడడానికి నేను తల ఆమూలనుంచి ఈమూలదాకా తిప్పాల్సివచ్చింది. గేటు దగ్గర తచ్చాడుతున్న నన్ను చూసి వాచ్‌మ్యాన్ బయటకి వచ్చాడు. నేను నాపేరు చెప్పి, ఎవరిని కలవడానికొచ్చానో చెప్పాను. తను ఇంటర్‌కాంలో మాట్లాడి, తలఊపి నన్ను చాలా మర్యాదగా లోపలకి పంపించాడు.
 
నేను ముందుకి నడుస్తూ చుట్టూ చూసాను..సుమారు 100 అడుగులున్న "డ్రైవ్ వే"కి ఒకవైపు అంతా రంగురంగుల పూలమొక్కలుంటే, రెండోవైపంతా పచ్చటిగడ్డితో మిలమిలా మెరుస్తోంది. డ్రైవ్ వేకి ఆ చివర, ఇంటిబయట.. బట్టతలతో, బానలాంటి పేద్ద పొట్టతో, రెండుచేతులూ నడుము మీద ఉంచుకుని ఒక వ్యక్తి నుంచొని ఉండడం గమనించాను..
 
ఇంకాస్తముందుకి నడిచాను.. ఇప్పుడు అక్కడ నిల్చున్న వ్యక్తి 36 పళ్లూ బయటపెట్టి పళ్లకిచ్చలా నవ్వడం కనబడుతోంది.. కాస్త తేరిపార చూసాను..ఆ వ్యక్తిలో "వాడి" పోలికలు కనబడుతున్నాయి. వాడి పోలికలేవిటీ? అది "వాడే!!!!".. నా మొహంలో ఖంగారుని, నా హావభావాలని చూస్తూ, వాడు నామీదవేసిన ప్రాక్టికల్ జోకుని "ఎంజాయ్" చేస్తూ.. వాడే!!
 
చేతులు చాచి వాడు ముందుకి నడిచాడు. నేను కూడా వడివడిగా ముందుకి అడుగులువేసాను. మరుక్షణంలో మేమిద్దరం గాఢాలింగనంలో బంధింపబడి ఉన్నాం. మా ఇద్దరి మధ్యా ఏమీ మాటల్లేవు.. కానీ మేమిద్దరం మా స్కూలురోజుల్లోకి వెళ్లిపోయాము. నా కళ్లల్లో తడి నాకు స్పష్టంగా తెలుస్తోంది.
 
అప్పుడే బయటకి వచ్చిన తన శ్రీమతిని , "ఇదిగోరా బావా! నీ అక్కా, చెళ్లెళ్ల లిష్టులో ఇంకో చెల్లెలు.. " అని పరిచయం చేస్తూ పెద్దగా నవ్వుతుంటే, "వీడు ఏబాధల్లోనూ లేడు" అన్న నిజం నా మనసుని దూదిపింజలా తేలికచేస్తే, నేను కూడా మనసారా వాడి నవ్వుతో శృతి కలిపాను.
 
                                      ******** ************
 
తర్వాత మాటలమధ్యలో, వాడిని కలవకముందు వాడి గురించి నేను చేసిన ఆలోచనలగురించి Confess చేస్తే, "అవునురా బావా! నువ్వనుకున్నదాంట్లో ఏతప్పూలేదు. Definitely I am not able to make both ends meet.చూడు.." అంటూ నడుముమీద రెండు చేతులుపెట్టుకుని, "ఈ చుట్టుకొలతతో ఎంత పొడుగుబెల్టుపెట్టుకున్నా రెండు కొసలు అస్సలు కలవటల్లేదురా!!!" అని పెద్దగా నవ్వేసాడు.. ఏమనాలండీ వీడ్నీ??