17, జులై 2009, శుక్రవారం

కల నిజామాయెగా!.. కోరిక తీరెగా!

మా అమ్మాయిని LKGలో జాయిన్ చేసినప్పటినుంచీ మా ఆవిడకి ఒక కోరిక..

.. మా అమ్మాయి స్కూల్ డేనాడు జరిగే ఫంక్షనులో ప్రైజు తీసుకుంటుంటే చూసుకోవాలనీను, ఆనందభాష్పాలు (?) రాల్చాలనీను..!

ఈ విషయమేమీ ఆ చంటిదానికి తెలియకపోయినా, ప్రతీ సంవత్సరం దాని శాయశక్తులా ప్రయత్నించి అది చదువులోనో, ఆటల్లోనో, ఇంకా స్కూలువారు నిర్వహించే ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్‌లోనో ప్రయిజు(లు) తెచ్చుకుంటూ ఉండేది.
(ఇంకా తెచ్చుకుంటూనే ఉంది.. Touch wood :-) )

కాకపోతే వచ్చిన చిక్కల్లా ఏమిటంటే..

దాని స్కూల్ డే వచ్చేసరికి, మేము ఆరోజు ఏదన్నా ఊరు వెళ్లడమో, లేకపోతే చంటిదానికి ఒంట్లో బాగోకపోవడమో, ఇంకా ఏఏ కారణాలవల్ల ఐతేనేమి, మేము ఆ స్కూల్ డే ఫుంక్షనుకి వెళ్లలేకపోతూ ఉండేవాళ్లం. స్కూలువాళ్లు తర్వాత ఎప్పుడో దీనికి రావాల్సిన ప్రైజులు దీనికి ఇచ్చేస్తూ ఉండడంతో పిల్లది వాటిని చూసుకుని, అడిగినవాళ్లకీ, అడగనివాళ్లకి అందరికీ చూపించుకుని, కొన్నిరోజులపాటు వాటితోనే సహజీవనం చేస్తూ మురిసిపోయేది.

కాని..

..కన్నతల్లి కోరిక తీరనేలేదు.

ఈనేపధ్యంలో, పోయినేడాది.. మా ఆవిడ ముందునుంచే నాకు విప్ జారీచేసేసింది, చంటిదాని స్కూల్‌డే ఫంక్షను రోజుల్లో ఊరిపొలిమేరలు దాటటానికి వీల్లేదని. ఇక నానేటి అంతను.. "అయితే వాకే!!" అంతను.

ఆ తర్వాత, రకరకాల మొక్కులు మొక్కేసింది, ఇంక ఏ అవాంతరాలు రాకూడదని.

స్కూల్‌డే దగ్గరకొస్తున్నకొద్దీ మా ఆవిడకి టెన్షను.. కాళ్లూ చేతులు ఆడడంలేదు.. రాత్రుళ్లు ఏవేవో కలవరింతలు..ఇంట్లో అంతా అదోరకమైన ఉద్రిక్తత(!!?)..

సరే.. మొత్తానికి ఆరోజు రానే వచ్చింది..

సాయంత్రమెప్పుడో ఫంక్షనంటే మా ఆవిడ పొద్దున్న నాలుగింటికల్లా అలారం పెట్టుకుని తను లేచి, మమ్మల్ని లేపేసి అందరికి నలుగులు పెట్టి మరీ (ఈ నలుగు కార్యక్రమానికి నాకు మినహాయింపు దొరికిందిలెండి) తలంట్లుపోసేసి అందరినీ ఒక చోట బుద్ధిగా కూర్చోమని చెప్పి (నన్ను కూడా.. :-( ), స్కూల్‌డే స్పెషల్స్ చెయ్యటంలో ముణిగిపోయింది.

సుష్టుగా భోంచేసి కాస్త నడుం వాలుద్దామనుకుంటుంటే, "ఠ్ఠాఠ్.. ఫంక్షను మొదలైపోతుంది" అంటూ హడావిడి పెట్టేసి, మమ్మలని తయారు చేసేసి, తను గిన్నీసుబుక్కులోకి ఎక్కించాల్సినంత రికార్డు టైములో తయారయిపోయి మమ్మలనందరినీ బయలుదేరదీసేసింది.

అనుకున్నట్టుగానే మేము అక్కడకి వెళ్లేసరికి, ' సుయ్ లేదు ',' సయ్ లేదు.. '. ఇంకా కుర్చీలు, బల్లలు సర్దుతున్నారు. అలా ఒకటి, రెండు, మూడు యుగాలు గడిచిన తర్వాత ఒక్కొక్కళ్లే రావడం మొదలుపెట్టారు.

మొత్తానికి ఫంక్షను మొదలయ్యింది.

ముందు కల్చరల్ యాక్టివిటీస్ ఉంటాయనీ, ఆ తర్వాత బహుమతి ప్రధానం ఉంటుందనీ, అందువల్ల ఈ రెంటిలో ఏదో ఒకటిగానీ, రెండింటిలోగానీ ఉన్న పిల్లలని క్లాసు టీచరుకి అప్పగించవలసినదిగా ముందే ఇచ్చిన లిఖితపూర్వక ఆఙ్నానుసారం మా అమ్మాయిని వాళ్ల టీచరుకి అప్పగించాం.

అన్నట్టు, మా అమ్మాయి ఒక నృత్యరూపకంలో కూడా పాలుపంచుకుంటొంది.

వందనాలు, భాషణాలు అయినతర్వాత కల్చరల్ యాక్టివిటీస్ మొదలైనాయి.

మా అమ్మాయి పాల్గొంటున్న నృత్యరూపకం జరుగుతున్నంతసేపూ మా బుడ్డిగాడితో పోటీ పడుతూ,చిన్నపిల్లలా ఎంజాయ్ చేసింది.

అందరు తల్లులూ అలాగే ఉంటారేమో!. కాని ఆ సమయంలో తన ఆనందాన్ని చూస్తే, చెప్పొద్దూ.. చాలా ముద్దొచ్చింది. ఆసమయంలో మా అమ్మాయితోపాటు, ఈ అమ్మాయిగారిని నేను తీసిన ఫోటోలని చూసుకుంటుంటే నా కెమేరా పనితనానికి నాకు నేనే వేలవేల వీరతాళ్లు వేసేసుకుంటూ ఉంటాను.

ఆ తర్వాత, అసలు ఘట్టం.. అదే, బహుమతి ప్రధాన కార్యక్రమం మొదలయ్యింది.

క్లాసులవారీగా, సెక్షన్లవారీగా పిలుస్తున్నారు. పిల్లలందరూ టీచర్ల దగ్గరే ఉండడంవల్ల, వరసగా పిల్లలు వస్తున్నారు.. ప్రైజులు తీసుకుంటున్నారు.. వెళ్తున్నారు. వాళ్ల వాళ్ల తల్లిదండ్రులు స్టేజీకి కొద్దిగా దగ్గరకి వెళ్లి ఫోటోలు తీసుకుంటున్నారు.

మా అమ్మాయి క్లాసు వచ్చేటప్పటికి మళ్లీ మా ఆవిడ హడావడి మొదలయ్యింది. కాదు మరీ!.. తన కోరిక తీరబోతోంది.. కల నెరవేరబోతోంది..

ఉన్నట్టుండి లేచింది.. నా చేతిలో ఉన్న కెమేరాని లాక్కుని స్టేజీ దగ్గరకి దూసుకెళ్లింది, నేను పిలుస్తున్నా వినకుండా!.

చేసేదేమీ లేక, బుడ్డిగాడిని పట్టుకుని నేను కూర్చుండిపోయాను.

మా అమ్మాయి పేరు పిలిచారు..
అది స్టేజీ మీదకి వచ్చింది..
దాని ప్రైజు తీసుకుంటోంది..
బుడ్డిగాడి ఇక్కడినుండే ' అదిగో అక్క, అదిగో అక్క ' అంటూ నాకు చూపిస్తున్నాడు.
ఇన్ని రోజులనుంచీ మా ఆవిడ ప్రభావం నా మీద పడడంవల్లనేమోగాని, నా కళ్లకి ఓ పల్చటి నీటితెర కమ్మింది.
మా అమ్మాయి నడుచుకుంటూ స్టేజీ దిగి వాళ్ల టీచరు దగ్గరకి వెళ్లిపోయింది.

ఈ హడావిడిలో మా ఆవిడగురించే మర్చిపోయాను. ఎక్కడుందా అని చూసాను. ఎన్నో సామ్రాజ్యాలు జయించిన సామ్రాఙ్నిలా తరలి వస్తోంది. తన కళ్లల్లో స్పష్టంగా కనబడుతున్న కన్నీళ్లు..నా పక్కకి వచ్చి, నా భుజమ్మీద తలవాల్చి కూర్చుంది. అంత గొడవలోనూ, మా మధ్యా, మా చుట్టూతా నిశ్శబ్ధం. కాసేపటికి సర్దుకున్నాం.

పిల్లలని తీసుకెళ్లాలని తల్లిదండ్రులకి అనౌన్సు చేస్తుంటే, వెళ్లి అమ్మాయిని తీసుకొచ్చుకున్నాం. దానికిచ్చిన ప్రైజు చూసుకుని మురిసిపోయాం. మా ఆవిడ సంగతి వేరే చెప్పక్కర్లేదు కదా!.

ఇంటికెళ్లేటప్పుడు అడిగాను, ఎన్ని ఫోటోలు తీసావు? అని. సుమారు నాలుగైదు తీసానంది. అప్పటికప్పుడే రీలు కడిగించమని పురమాయించింది. ' దేవీ గారి చిత్తం ' అంటూ ఇంటికి దగ్గర్లో ఉన్న ఫోటో స్టూడియోలో రీలు ఇచ్చి ఇంటికొచ్చి పడ్డాం.

మొత్తానికి మా ఆవిడ హ్యాపీస్!.

ఇందులో పేద్ద గొప్పేముంది. మీ అమ్మాయి గురించి బడాయిలు చెప్పుకోకపోవడానికి కాకపోతే, దీనిగురించి మా టైమెందుకు వేస్టుచేసావంటారా?. అక్కడికే వస్తున్నాను.

మరుసటిరోజు, ఫోటోలు తీసుకురావడానికి ఫోటో స్టూడియోకెళ్లి, మనవా కాదా అని నిర్ధారణ చేసుకోవడానికి పైపైన ఒకటి రెండు ఫోటోలు చూసి, అన్నీకలిపి కవరులోపల పెట్టి ఇంటికొచ్చాను.

లోపలకొస్తున్న నా చేతిలోంచి మా ఆవిడ కవరులాక్కుంది.

కానీలే అని, లోపలకెళ్లి బట్టలు మార్చుకొచ్చాను.

హాల్లోకొచ్చేసరికి అనిపించింది.. ఏదో జరగబోతోందని..

ఎప్పుడూ వసపిట్టలా మాట్లాడుతూనే ఉండే మా ఆవిడ ( వసపిట్ట అని అనకూడదట.. గలగలా మాట్లాడుతుంది అనాలట).. నిశ్శబ్ధంగా.. భావరహితంగా.. చేతిలో ఉన్న ఫోటో వంక తీవ్రంగా, తీక్షణంగా చూస్తోంది.

నెమ్మదిగా తన పక్కన కూర్చుంటూ ఏమిటా అని చూసాను.

ముందు అర్ధం కాలేదు.. తర్వాత కొద్దిగా నవ్వొచ్చింది..
తమాయించుకోవటానికి ప్రయత్నించాను.. వల్లకాలేదు..
మళ్లీ నవ్వబోతూ, నోటికి చేతులు అడ్డుపెట్టుకున్నను.. ఊహు.. పొలమారి దగ్గొచ్చింది..
దగ్గుతూనే, మిగతా ఫోటోలన్నీ చూసాను.

అంతసేపూ, మా ఆవిడ ఉన్న చోటినుంచీ కదలలేదు.. మొహంలో ఏభావమూ లేదు.. ఒక్కటంటే ఒక్క మాటకూడా లేదు.

ఎందుకంటారా?. తను వీరావేశంతో తీసిన నాలుగైదు ఫోటోల్లో ఇదొక్కటే వచ్చింది. అదేమిటో మీరే కింద చూడండి.


అయ్యా.. అదండీ సంగతి!.

ముగింపు: ఇంత జరిగిన తర్వాతకూడా, నేను బతికి బట్టకట్టి మీకు ఇది ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నానంటే దానికి కారణం - స్కూలు యాజమాన్యం ఒక ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్‌ని పెట్టి అన్ని ఫోటోలనీ తీయించి, తగిన రుసుము(??) తీసుకుని ఎవరి ఫోటోలు వారికి అందజెయ్యడంవల్లనూ, ఆ ఫోటో మా షోకేసులో విరాజిల్లుతూండడడంవల్లనూ - అని గమనించాలి.

27, ఫిబ్రవరి 2009, శుక్రవారం

చేసిన పాపం..

చెప్తే పోతుందంటారు కదా!?. అందుకే చెప్తున్నాను.

అవ్విధంబెట్టిదనిన..

మొన్న సోమవారం, మహాశివరాత్రి నాడు.. మామూలుగానే కాలకృత్యాలు తీర్చుకుని, దేవుడుకి ఓ నమస్కారం పెట్టి, శివరాత్రి కాబట్టి శివుడ్ని కాస్త గట్టిగా "పట్టుకుని ఊపేసి", తయారయ్యి, నా శ్రీమతి అందించిన లంచ్ బాక్సు అనబడు చద్ది అన్నమును మూట కట్టుకుని "ఏరువాకా సాగారో.." అని పాడుకుంటూ కొలువుకి బయలుదేరాను.

ఔను.. మర్చిపోయాను.. ఆరోజు ఒక్క శివరాత్రి మాత్రమే కాదు.. ఆస్కార్ రాత్రి కూడా!!
(ఈ పై వాక్యాన్ని చిన్నప్పుడు సినిమాహాల్లో ప్రభుత్వ ప్ర్రయోజిత అడ్వర్టైజుమెంట్లలో వినిపించే వ్యాఖ్యానంలా చదువుకోవాలి!!)

కార్లో FM రేడియో రెహమాన్ మోత, ఆస్కార్ మోతతో దద్దరిల్లిపోతోంది. రేడియో మిర్చీలో హేమంత్, రేడియో సిటీలో వంశీ ఆస్కార్
కార్యక్రమానికి లైవ్ కామెంటరీ ఇచ్చేస్తూ, స్లం డాగ్ మిలీనేర్‌కి గానీ, రెహమాన్‌కి గానీ ఆస్కార్ వస్తే, హర్షాతిరేకంతో కేకలు పెట్టేస్తూ తెగ హడావిడి పడిపోతున్నారు. ఆ రెండు FM స్టేషన్లూ ఆరోజు (డబ్బింగు పాటలే అయినా కూడా) రెహమాన్ పాటలు మాత్రమే వినిపిస్తూ, పూర్తిగా రెహమాన్‌కి అంకితం అయిపోయాయి.. Only Rehaman, Rehaman all the way.

నేను కూడా రెహమాన్ స్వరాల విందుని ఆస్వాదిస్తూ, వేటూరి, రాజశ్రీల పదాలతో నంజుకుంటూ, అక్కడక్కడ పంటికింద తగులుతున్న A.M.రత్నం రాళ్లని తీ(ఊ)సిపారేస్తూ నా ప్రయాణాన్ని సాగిస్తున్నాను.

ఇంతలో..

కాస్త దూరంలో ఉన్న చౌరస్తాలో సిగ్నలు కనబడింది.. గ్రీనే!. కానీ దాని పక్కనె ఉన్న కౌంటరు 8 చూపిస్తోంది. నేను దాని దగ్గరకి వెళ్ళేటప్పటికి అది 4లోకి దిగింది. నేను సిగ్నలుని దాటిపోదామని ఆత్రంగా యాక్సిలరేటరు మీద బలాన్ని పెంచాను. కాని నా ముందు ఉన్న రెండు కార్లవాళ్లకి నా అంత ఆత్రమున్నట్టులేదు, వాళ్లిద్దరూ ఒకళ్ల తర్వాత ఒకళ్లు ' కస్స్..' అని బ్రేకువేసి ఆగారు. ఇంక తప్పక,నేను కూడా ' కస్స్.. '.

ఇక్కడ కాస్త జనరల్ నాలెడ్జ్..

ఈ మధ్యన మన హై' టెక్కు ' నగరంలో, ట్రాఫిక్ పోలీసులు నిభంధనలు అతిక్రమించిన వాళ్లని ఆపి చలాన్లు రాయడం మానేసారు.. దీనికి బదులుగా వాళ్లు మన బండి నంబరు నోట్ చేసుకుని, దాని ఆధారంగా RTA ఆఫీసునుంచి మన చిరునామా సంపాదించి, చలానుని మన ఇంటికే పంపిస్తారు. ఈ చలానాని మనం దగ్గరలో ఉన్న ఈ-సేవా సెంటరులో కానీ, పోలీసు స్టేషనులో కానీ కట్టెయ్యాలన్నమాట. కాదూ, మీరేమీ నిభధనలు అతిక్రమించలేదూ అనుకుంటే మీరు భేషుగ్గా కోర్టుకు వెళ్లొచ్చు.అందుకే మీరు గనక గమనిస్తే, సిగ్నళ్ల దగ్గర కాస్త మూలగా
ఒక పోలీసు (సాధారణంగా ఒక హోంగార్డు) ఒక పుస్తకంలో చాలా శ్రద్ధగా రాసేస్తూ ఉంటాడు. కొండొకచో డిజిటల్ కెమేరాలని పట్టుకుని ఫోటోలు తీసే పోలీసులని కూడా చూడొచ్చు.

నా ఉద్దేశ్యం ప్రకారం, ఇలా చెయ్యడంలో పోలీసులకి ఒక సౌలభ్యం ఉంటుంది. వాళ్లు ఎవరిదైనా కారుని ఆపగానే, కారులో వాడు "నేను
ఎవరినో తెలుసా?" అంటూ చెప్పే వారి పుట్టుపూర్వోత్తరాలు వినక్కరలేదు. అలాగే, బళ్లకి అడ్డుపడి వాటిని ఆపి, తద్వారా మరింత ట్రాఫిక్ జాములు సృస్టించక్కర్లేదు.

సరే, విషయానికొస్తే.. రోజూ అదేదారిలో వెళ్లే నాకు తెలుసు అది రెండున్నర నిముషాల (150 సెకండ్ల) సిగ్నలని. ఆ కౌంటర్ని ఏమి చూస్తాంలే అనుకుంటూ, రేర్ మిర్రరులో నా అందాన్ని ఒకసారి చెక్ చేసుకుని, ముందరి అద్దాన్ని (wind sheild) ఒకసారి
శుభ్రం చేసుకుని, మళ్లీ ఇంకోసారి అందాన్ని సరి చేసుకుని, మొబైల్లో ఏమన్నా SMSలు వచ్చాయా (ఉత్తినే!.. ఏమీ రావు,
రాలేదని తెలిసినా కూడా!) అని చెక్ చేసుకుంటున్నాను.

ఇక్కడ ఓ చిన్న ట్రివియా..

సిగ్నల్ దగ్గర ఆగినప్పుడు మనం ఏమేమి పనులు చేసుకోవచ్చు?..
- అందాలని సరిదిద్దుకోవచ్చు.
- కార్లో ఉంటే, లోపలా బయటా శుభ్రపరుచుకోవచ్చు.
- SMS లు, calls చెక్ చేసుకోవచ్చు.
(ఈ మూడు నేను already చేసేసాను కదా!!. ఇంకా..)
- పక్కబళ్లవారికి సైటు కొట్టుకోవచ్చు. (తదనంతర పరిణామాలకి నేను భాద్యుడ్ని కానే కాదు!).
- పక్కనవారిని ఓ ఫైవ్ అప్పడగొచ్చు.
- పక్కవాళ్ల చీరలు, డ్రెస్సులు ఎంత బాగున్నాయో చూపించి నాకూ అట్లాంటిది కొనొచ్చుగా అని అడగొచ్చు.
- ప్రొవొకేటింగుగా ఉన్న వాల్‌పోస్టర్లనీ, హోర్డింగులనీ (ఒంటరిగా ఉంటే ధైర్యంగా, better half పక్కన ఉంటే దొంగచూపులతో)
చూడొచ్చు.
- బస్సులలో ఉన్నవాళ్లయితే తమ నోట్లో ఉన్న పాన్‌మసాలాతో పక్కన ఉన్న బళ్లవాళ్లమీదా, పక్కన నడుస్తున్నవాళ్లమీద మీదా రంగురంగుల అద్భుతాలని సృష్టించొచ్చు..
.. ఇలా చెప్పుకుంటూ పోతే, ఎన్నో!!

సరే, బాగా సైడుట్రాకు అయిపోయినట్టున్నాను. విషయానికొస్తే..

అలా నా క్రాఫుని సరిచేసుకుంటూంటే, నా కారుకి రెండుపక్కలనుంచీ ఇద్దరు ద్విచక్రవీరులు వచ్చి నా వంక కోపంగా చూస్తూ నన్ను ఏదో అంటున్నారు. నాకు ఏమీ అర్ధంకాలేదు కానీ, ఎందుకులే వాళ్లతో పెట్టుకోవడం అని ఊరుకున్నాను.

ఇంతలో ఒకతను, ఇంకా పెద్దగా అరుస్తూ, కిటికీ అద్దాలు దించమన్నట్టు సైగ చేస్తుంటే, నాలో దూర్వాసుడు మేల్కున్నాడు.

దురుసుగా అద్దాలు దించుతూ నాకు దగ్గరలో ఉన్న ఆయనతో, "ఆ!! ఏవిటీ?" అన్నాను.

అతను నాకంటే దురుసుగా, "వెనకాళ్ల వాళ్లని చూసుకునే పని లేదా?" అని అంటూ మీదమీదకి వస్తున్నాడు.

నాకస్సలు అర్ధం కావట్లేదు.

"వెనకాలవాళ్లని నేను ఎందుకు చూసుకోవాలి?" అన్నాను నేను అమాయకంగా!.

ఇదంతా జరుగుతున్నంతసేపూ, నా కారుకు రెండో వైపు ఉన్నాయన, రెండు చేతులూ గాల్లో ఊపుతూ, ఏదో భావవిన్యాశం చేస్తూనే
ఉన్నాడు.

నాకేదో కొద్దిగా అర్ధం అయినట్టనిపించిది. ఇందాక సిగ్నలు పడ్డపుడు నేను కాస్త సడెన్ బ్రేకు వేసాను కదా. నా వెనకాల ఉన్న ఈ క్యాండేట్లు ఇద్దరూ, నాలాగా అర్జంటుగా బ్రేకు వెయ్యలేక (మరి అందరూ, నాలా Spontaneousగా ఉండరు కదా!?)కాస్త కిందామీదా అయినట్టున్నారు. మరి అది వాళ్ల తప్పుకదా? నన్నంటారేమిటి?. వాళ్లు కదా జాగ్రత్తగా ఉండాల్సింది?.

అంతే, నేను కూడా వాళ్లమీదపడి అ(క)రిచెయ్యడం మొదలుపెట్టాను.

చుట్టుపక్కల ఉన్న వాళ్లు, మమ్మలని శాంతపరచడానికి ప్రయత్నిస్తున్నారు.

ఇంతలోకి, సిగ్నలు మారడంతో, "పోరా!" అంటే "పోరా!" అనుకుంటూ బయలుదేరాం. ఆ ద్విచక్రవీరులిద్దరూ, నా ముందుకొచ్చి ఒకసారి మళ్లీ నావంక కౄరంగా చూసి, జయ్యిమని వెళ్లిపోయారు.

నేను కూడా, "శాంతి.. శాంతి.." (అమ్మాయికాదు.. Peace) అనుకుంటూ నన్నునేను చల్లబరుచుకుని వెళ్తూఉంటే..
.. మళ్లీ సిగ్నలొచ్చింది.
.. మళ్లీ ఆగాను.

ఏదో శబ్దం వినబడితే పక్కకి చూసాను. ఒక ద్విచక్రవీరుడు (ఇందాకటి ఇద్దరూ కాదు) నావైపు ఉన్న కిటికీ అద్దమ్మీద చిన్నగా కొడుతూ అద్దం కిందకి దించమని అంటున్నాడు. మళ్లీ కోపం నషాలానికంటుతూ ఉంటే, అద్దం కిందకి దించాను తాడో పేడో తేల్చుకుందామని.

కాని ఆ పెద్దమనిషి మొహంలో కోపంలేదు సరికదా, కాస్త సర్దిచెప్పేధోరణిలో ఏదో అంటున్నాడు. ఓ పక్కన "జయ హో!" తో హోరెత్తుతున్న రేడియో సౌండ్ తగ్గించి "ఏవిటీ?" అని అడిగాను.

అప్పుడు ఆయన చెప్పింది వింటూ ఉంటే నా మొహంలో రంగులు గ్యారంటీగా మారి ఉంటాయి.

ఇంతకీ ఆపెద్దమనిషి చెప్పినదాని సారాంశం ఏమిటంటే,నేను ఇందాక సిగ్నలు దగ్గర ఆగినప్పుడు కారు అద్దాన్ని (Wind Shieldని) శుభ్రం చేసేటప్పుడు, మరి alignment లో తేడానో ఏమో గాని, ఫోర్సుగా వచ్చిన నీరు నా కారు అద్దమ్మీదేకాకుండా, గాల్లో బాగా పైకిలేచి వెనకాల ఉన్నవాళ్లని పునీతులని చేసిందనీ, అదే వాళ్ల బాధ(కోపాని)కి కారణమనీ!.

ఆయన చెప్పింది పూర్తిగా విన్న తరువాత నాకు కొద్దిగా బాధేసింది .. మరి కొద్దిగా సిగ్గేసింది. బాధ - వాళ్లని అసౌకార్యానికి గురిచేసినందుకు, సిగ్గు- తప్పు నాదైనా ఎదురుతిరిగి వాళ్లనే తప్పుపట్టినందుకు.

ఇంక ఏమీ చెయ్యలేక, ఈ పెద్దమనిషికే "సారీ"లు అన్నీ సమర్పించుకుని అక్కడనుండి బయలుదేరాను.

అసలు ద్విచక్రవీరులిద్దరికీ, ఈ టపా ద్వారా క్షమాపణలర్పించుకుంటున్నాను.

అదండీ సంగతి!.

చెప్పేసాను.. మరి నా పాపం పోయినట్టేనా? :-)

20, ఫిబ్రవరి 2009, శుక్రవారం

నా ఇంటి(తి) కధ

అప్పుడెప్పుడో..

మా Y2K make అమ్మాయి.. అంటే 2000 సంవత్సరంలో పుట్టిందిలెండి..

దానికి కాస్త "సున్నితత్వం" ఎక్కువన్నమాట.. అంటే.. ఈ సున్నితత్వం తాలూకు లక్షణాలు మచ్చుకి కొన్ని..

వేసుకున్న కొత్తబట్టల్ని "రికార్డు టైము"లొ చింపేసుకోవడం.. ("గోనె సంచీలతో కుట్టించాలే నీకు బట్టలు.." వాళ్లమ్మ ఉవాచ!),
అప్పుడే షాపు నించి కొనుక్కొచ్చిన బొమ్మల్ని ఆనమాలు గుర్తుపట్టలేనంతగా చేసెయ్యడం ("నీ దగ్గర ఇనుముతోటీ, ఇత్తడితోటీ చేసినవైనా నిలుస్తాయో,లేదో?",మళ్లీ వాళ్లమ్మే!!)
..
..
..
అన్నిటికంటే.. ఎక్కడో చూస్తూ నడుస్తూ, పక్కనున్నవాళ్లవీ, దాని దారిలో ఉన్నవాళ్లవీ "పాదపీడనం" చేసి వాళ్లచేత "కెవ్వ్" అని కేకలు పెట్టించడం..ఇట్లాంటివన్నమాట!

ఇలా పైన ఉదహరించినవాటిలో ఏ ఒక్కటి జరిగినా, రెండు జరిగినా, నాలుగైదు ఒకేసారి జరిగినా.. అప్పుడు దాన్ని కోపంతో, ఏమీ చెయ్యలేని నిస్సహాయతతో, కాలు పచ్చడి అయిపోవడంతో కళ్ల వెంబడ నీళ్లు తిరుగుతుంటే "(మాయా)శశిరేఖా!.." అని ముద్దుగా(?) "అక్షింతలు" వేసేవాళ్లం.

మొన్నటికి మొన్న..

మా బుడ్డిగాడు.. ఎల్లికేజీ చదువుతున్నాడులెండి..(LKGని అలానే అనాలట.. వాడే చెప్పాడు).

వీడు ఈమధ్యనే సింగీతం శ్రీనివాశరావుగారి "ఘటోత్కచ" సినిమా చూసాడు. వాళ్లక్క చూపించిందిలెండి. అప్పటినుంచి చేతిలో ఏది ఉంటే దాన్ని.. పెన్సిల్ కానీ,పెన్నుకానీ, గరిటె కానీ, స్పూను కానీ.. భుజాన గదలా ధరించి, "నేనే ఘటోత్కచ..నేనే ఘటోత్కచ.." (ఆతర్వాత ఏంటో వాడికీ రాదు, నాకూ తెలియదు!) అని పాడుకుంటూ తిరిగేస్తూ ఉంటాడు.

నిన్న రాత్రి..

పడుకోవటానికి సన్నాహాలు చేస్తున్నాము.

నాకు ఒక పక్కన పడుకున్న మా బుడ్డిగాడు పడుకుని వాడిలో వాడే వాడి టైటిల్ సాంగు ("నేనే ఘటోత్కచ..నేనే ఘటోత్కచ..") పాడుకుంటున్నాడు.

"చాల్లేరా ఘటోత్కచా.. ఇంక పడుకో!" అన్నాను.

సడెన్‌గా వాడికి ఒక పెద్ద సందేహం వచ్చింది.. "నానా! ఘటోత్కచుడి వాళ్ల అక్క పేరు ఏమిటి?" అని.

వాడి థియరీ ప్రకారం, అబ్బాయిలందరికీ అక్కలుండాలి, అమ్మాయిలందరికీ తమ్ముళ్లుండాలి.

"శశిరేఖ.." కాస్త కసిగా ఒత్తిపలుకాను,అంతకుముందే నా మీదకిదూకి నా నడుము విరగ్గొట్టినంత పనిచేసి, ఇప్పుడు నంగనాచిలా నా పక్కన పడుకున్న వాళ్ల అక్కని చూపిస్తూ.

అప్పుడే మా ఆవిడ పడకగదిలోకి వేంచేసింది.

ఇంతలో మావాడికి ఇంకో సందేహం, (అదేదో సినిమాలో, గిరిబాబు "భగవంతుడా! కూతుర్నుఇమ్మంటే, క్వశ్చన్ బ్యాంకుని ఇచ్చావా?" అన్నట్టు).

"మరి వాళ్ల నాన్న పేరు ఏమిటి?"

"భీముడు" అన్నాను నేను, కాంప్లాన్ బాయ్‌లా రెండు చేతులూ గాల్లోకి ఎత్తి బిగించి పట్టి, కండల్ని చూపిస్తూ. మా ఆవిడ మూతి ముప్పైఆరు వంకరలు తిప్పింది.

మళ్లీ మా క్వశ్చన్ బ్యాంకు అక్షయతూణీరంలోంచి ఇంకో బాణం, "మరయితే, వాళ్లమ్మ పేరు?" అని.

నా గొంతులో పచ్చివెలక్కాయ పడింది.

అప్పటికే మా ఆవిడ ముక్కుపుటాలు అదురుతున్నాయి.. చెవుల్లోంచి ఆవిరిపొగలు చిమ్ముతున్నాయి.. మూడో కన్ను తెరుచుకుంటోంది..

పరిస్థితిని గమనించి నేను గమ్మునుండిపోయాను.

"చెప్పు నాన్నా!! ఘటోత్కచుడూ వాళ్లమ్మ పేరు ఏమిటి?", ఈతడవ నా పుత్రికారత్నం.

అప్పుడొచ్చింది సునామీ..

"నేను చెప్తాను.. నువ్వు శశిరేఖవై, నీ తమ్ముడు ఘటోత్కచుడై, మీ నాన్న భీముడైతే.. అప్పుడు నేనయ్యేది ఏమిటో తెలుసా.. హిడింబి..అంటే రాక్షసి.. అదే నేను.. అర్ధమయ్యిందా?" అంటూ కోపం స్థానంలో కళ్లల్లో నీళ్లు తిరుగుతున్న నా శ్రీమతిని చూసి, పిల్లలిద్దరూ ఏమి చెయ్యాలో తోచక బల్లుల్లా నన్ను అతుక్కుపోతే, మా అవిడని బతిమాలి,బుజ్జగించి మామూలు మనిషిని చెయ్యటానికి నేను జాగారం చెయ్యాల్సిచ్చొందంటే.. మీరు నమ్మాలి!!!.

15, జనవరి 2009, గురువారం

అలవాటులో పొరపాటు!!

అలవాటులో పొరపాటు ఎన్ని 'పాట్లు 'తెస్తుందో.. కదా?

డాక్యుమెంటుని PDF Formatలోకి మార్చటానికి సులభ పద్దతి

మీ దగ్గర పత్రాల(Documents)ని PDF Foramt లోకి మార్చే software లేదా?. ఈ క్రింది సులభపద్దతిని ప్రయత్నించండి.

మీ అసలు పత్రాన్ని జతపరచి, "pdf@koolwire.com" కి ఒక టపా(mail)ని పంపించండి.

కొద్దిసేపట్లో మీరు "KoolPDF" నుంచి ఒక టపాని అందుకుంటారు.. PDF Formatలోకి మార్చబడిన మీ పత్రంతో సహా!

నమ్మబుద్ధి కావడంలేదా?. నేను ప్రయత్నించాను. నాకు పనిచేసింది. మీరూ ప్రయత్నించండి.. నమ్మండి.

కట్టడ చరిత్రలో ఒక మహాద్భుతం!!!

కట్టడ చరిత్ర(History of the Civil Engineering)లో ఒక మహాద్భుతం!!!.. చిత్తగించండి..
13, జనవరి 2009, మంగళవారం

ఎనీ టైం.. ఎనీ వేర్.. ఎనీ సెంటర్..

ఎప్పుడైనా సరే..,
ఎక్కడైనా సరే..

జీవితంలో మీరు తూలి (బొక్క బోర్లా) పడితే..
దిగులు పడకండి..
బాధ పడకండి..
ఠీవిగా, నిటారుగా లేచి నిలబడండి..

మీ స్వరం పెంచి దిక్కులు పిక్కటిల్లేలా..
...
...
...
...

"ఎవడుబే తోసిందీ..?"

అని అడగండి. ;-)