6, ఆగస్టు 2011, శనివారం

నేను "మిష్టర్ పెళ్లాం" అయ్యాను



పోయిన శుక్రవారం నాకు శూన్య శుక్రవారం, చీకటి శుక్రవారం అంటే Black Friday అన్నమాట.

ముందు, నా లాప్టాప్ క్రాష్ అయ్యి, రిపేరుకెళ్లింది.
ఆ తర్వాత.. నా శ్రీమతి నన్నొదిలేసి వెళ్లిపోయింది.

చాలా రోజుల్నుంచీ ఏదో బెదిరిస్తోందిలే అనుకున్నా కానీ, మరి ఇక సహించలేను అనుకుందో ఏమో, వెళ్లిపోయింది.

అప్పటికీ పిల్లలగురించి బాధపడుతూనే ఉంది, అయినా సరే, నేను గాట్టిగా నొక్కి వక్కాణించి మరీ చెప్పేసా, పిల్లలని తన కంటే బాగా చూసుకోగలనని. అంతే.. ఇంక నిర్ణయం తీసేసుకుంది వెళ్లిపోవాలని.. వెళ్లిపోయింది.

అయినా, ఈ మధ్యన బాగా గమనిస్తున్నా.. మా ఇద్దరి మధ్య అంత సఖ్యత ఉండడంలేదు. ప్రతీదానికీ నామీద నాకే కంప్లైంట్లు చేస్తోంది. అవి కూడా మరీ అర్ధం పర్ధంలేని కంప్లైంట్లు..

మీరే చెప్పండి..

తనని అసలు పట్టించుకోనట.. తనమాట విననట..
.. ఇదేమన్నా భావ్యమా?.

ఏదో పేపరు చదువుకుంటూనో,  మురళిగారు పరిచయం చేసిన పుస్తకాన్ని చదువుతూనో, కంప్యూటర్లో బ్లాగులు రాస్తూనో,చదువుతూనో, కామెంటుతూనో, టీవీ చూస్తూనో ఉంటానన్నమాటేగానీ తను చెప్పినవన్నీ వింటూనే (అంటే విన్నా వినకపోయినా "ఊ.." కొడుతూనే) ఉంటానుకదా?

తనతో అంతకుముందులా మాట్లాడటంలేదుట..
.. దీనికిమించిన పచ్చి అబద్ధం ఇంకేమన్న ఉంటుందా?.

పొద్దున్నే లేవగానే కాఫీ అడుగుతానా?
"టిఫిన్ పెట్టు" అంటానా?
"సాక్సులు ఎక్కడ?" అని గట్టిగా అరుస్తానా?
"కారు తాళాలు ఎక్కడా?" అని విసుక్కుంటానా?,
అలాగే రాత్రి పూట "అన్నంలోకి రోజు విడిచి రోజు ఈ కాబేజీ కూరేంటీ?" అని చిరాకు పడతానా?
రిమోటు కనబడకపోతే "ఈ రిమోటుకి చావూ పుట్టుకా ఉండవు." అని వేదాంతాలు వల్లిస్తానా?.

వీటన్నిటినీ మాటలుకాక ఇంకేమంటారండీ? అహ.. పెద్దమనుషులు.. మీరు చెప్పండి..

అలా తను వెళ్లిపోయిందా..?

నా పరిస్థితికొచ్చేసరికి .. ఆఫీసులో ఎంత బాసుగిరీ వెలగబెట్టినా, ఇంట్లోమాత్రం "మిష్టర్ పెళ్లాం"గిరీ వెలగబెట్టలేక నా తాడుతెగుతుందన్నమాట అక్షరసత్యం.

మా అమ్మాయికి దోశలు కావాలి, బుడ్డిగాడికి ఇడ్లీలు కావాలి. సమయానుకూలంగా మా అమ్మాయి నాకు కాస్త ఉప్పందిచ్చబట్టి తెలిసింది కానీ, లేకపోతే శ్రీమతి దోశల్ని కూడా ఇడ్లీల సైజులో ఎందుకు వేస్తుంది?, అన్న ప్రశ్నకి నాకు సమాధానం ఎప్పటికీ తెలిసేదేకాదు.

మా అమ్మాయికి "స్కార్ఫ్" కనబడడంలేదంటే, వెతగ్గా వెతగ్గా కొండంత ఉన్న ఉతికిన గుడ్డలమూటలో ఎక్కడో నక్కిఉంది అది.

బుడ్డిగాడికి అన్నీ ఎడమకాలి సాక్సులే కనబడుతున్నాయి, కుడికాలి సాక్సు ఒక్కటీ కనబడి చావడంలా!.

శ్రీమతి ఉన్నప్పుడైతే వాళ్లు స్నానంచేసివచ్చేసరికి నీటుగా ఇస్త్రీ చేసిన బట్టలు రుమాలుతోసహా వాళ్ల మంచమ్మీద పెట్టి ఉండేవి.

బయటనుండి స్కూల్ బస్సువాడు హారన్‌తో నా ఢంకా బజాయించేస్తున్నాడు. బుడ్డిగాడు ఆలశ్యానికి నువ్వే భాద్యుడివి అన్నట్టు చూస్తున్నాడు నావంక.

వాళ్ల కళ్లల్లో భావాలు, చురుకుదనంలేని వాళ్ల చేతలు చూస్తుంటే.. నాకనిపించింది పిల్లలు వాళ్లమ్మని "మిస్" అవుతున్నారనీ.. తను వెళ్లిపోవడానికి భాద్యుడ్ని నేనే అనుకుంటున్నారనీ..

ఏమో!. ఆలోచిస్తుంటే నాకది నిజమేనేమో అనిపించింది. నేను "వద్దూ..!" అంటే ఉండిపోయేదేమో!.

కానీ..

నాకు గట్టినమ్మకం.. తను పిల్లల్ని వదిలిపెట్టి ఇన్నిరోజులు ఎప్పుడూ ఉండలేదు కాబట్టి తప్పకుండా తిరిగి వచ్చేస్తుంది.

....
....
....
....
....



ఇంకా చెప్పాలంటే ఈ ఆదివారం పొద్దున్న తప్పకుండా వచ్చేస్తుంది. ఎందుకంటే..

....
....
....
....
....

తనకి రిటర్న్ టిక్కెట్టు బుక్ చేసింది నేనేకదా!!!!!???😃😃😃
నాకు సెలవు కుదరక, పిల్లలకి స్కూలు పోవటం ఇష్టంలేక, వెళ్లక తప్పక,తను వెళ్లింది వాళ్లమ్మవాళ్లతో కలిసి వాళ్ల మేనమామ ఇంటికే కదా????? 😎😎😎


కానీ, ఏదో అంటారు చూడండీ.. ఏవస్తువు విలువైనా అది లేనప్పుడే తెలుస్తుందీ అని.. ఇది మాత్రం అక్షరాలా నిజం..

మరి, మళ్లీ నా లాప్టాప్ రిపేరయ్యి వచ్చేదాకా రెండు రోజులపాటు మరి నేనెంత నరకం అనుభవించాననుకున్నారూ?

13 కామెంట్‌లు:

  1. mugimpu bagundi. kani mi nija jivitam lo ee post prarambam lo la kakunda jagrata padandi

    రిప్లయితొలగించండి
  2. మీమీద మీకే కంప్లైంట్ చేస్తుందీ అంటే పాపం ఆవిడెంత అమాయకురాలో .....ఏదీ ముందావిడ ఫోన్ నంబర్ ఇవ్వండి చెప్తాను

    రిప్లయితొలగించండి
  3. ముగింపు ఇలాగే ఉంటుందని, ఉండాలని అనుకుంటూ చదివాను. అలాగే ఉంది. బాగా చెప్పారండి.

    రిప్లయితొలగించండి
  4. ముల్లూ పోయి కత్తీ వచ్చే.... పాట కనిపించేసిందండీ కళ్ళముందు.. అప్పుడప్పుడూ ఇలాంటి అనుభవాలు అవసరం.. అనుభవం అయితేనే కదా మరి, తత్త్వం బోధ పడుతుంది :))

    రిప్లయితొలగించండి
  5. @బుద్దా మురళి: ధన్యవాదాలు.. మీలాంటి శ్రేయోభిలాషులుండగా నాకేమి దిగులండీ..

    @లలిత: అంటే అది మీకలా అర్ధమైందా?. :) ధన్యవాదాలు.

    @అజ్ఞాత: ధన్యవాదాలు. వేరేవిధంగా అసలు ఊహించనుకూడాలేను సుమండీ..

    @సాయి: ధన్యవాదాలు.

    @మురళి: బాగా చెప్పారు సార్.

    నాకైతే మిష్టర్ పెళ్లాం సినిమాలో ఆ బుడ్డోడు "పుప్ప" అని గొంతు చించుకుని అరుస్తూ ఉంటాడు చూడండి (అంటే వాడికి ముందు పెరుగన్నం పెట్టాలట.. తర్వాత పప్పన్నం పెట్టాలట) ఆ సీను గుర్తొచ్చిందండి..

    @వాసవి: ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  6. అబ్బ ముందు భయపడ్డానండీ! చివరికొచ్చాక హమ్మయ్య ని ఊపిరి పీల్చుకున్నా!

    మీ మీద మీరే వేసుకున్న సెటైర్లు బావున్నాయి :)

    రిప్లయితొలగించండి
  7. @సౌమ్యగారు: నా టపాలన్నిటిమీద ఓ లుక్కేసి అభినందించినందుకు ధన్యవాదాలండీ!..

    రిప్లయితొలగించండి