మనలో చాలామంది చిన్నప్పుడు స్కూల్లో చదువుకునే రోజుల్లో మన ఉపాధ్యాయులు, పంతులమ్మలు స్కూలు భవనంలోగానీ, ఆవరణలో గానీ, ఆట స్థలంలోగానీ తారసపడితే వారికి వినమ్రంగా నమస్కరించేవాళ్లం.. అభివందనం చేసేవాళ్లం. ఇది స్కూలు ఆవరణ బయటగూడా కొనసాగుతూనే ఉండేది. అంటే గుళ్లో.. మార్కెట్లో.. బజారులో.. కొండొకచో సినిమా హాల్లో కూడా.. కదూ! :-)
ఆ తర్వాత కొన్ని రోజులకి (ఏళ్లకి), అంటే సుమారు 8,9 తరగతుల్లోకి వచ్చేసరికి పాదచర్యం (ఇదేదో బ్రహ్మచర్యంలా ఉంది .. అసలు ఇలాంటి పదం తెలుగులో ఉందా?!!!) అయిపోయి వాహనయోగం పడుతుంది.
అంటే ఏ 'యమహా'నో, 'పల్సరో' అనుకుంటున్నారేమో.. అలా అనుకుంటే మీరు ఆదిత్య 369 ఎక్కి 10,15 సంవత్సరాలు ముందుకు వెళ్లిపోయినట్టన్నమాట. అందువల్లచేత మీరు అలా వెళ్లిపోకుండా, నా కబుర్లని మాత్రమే వినాలని మనవి.
సరే విషయానికొస్తే.. ఇంకా గట్టిగా చెప్పాలంటే, "నూతన" వాహనయోగం అంటే వంశపారంపర్యంగా వస్తున్న "సైకిలు" మాత్రమే అని గ్రహించాలి. కొండొకచో కొందరు యువరాజులకి, అదృష్టజాతకులకి కొత్తసైకిలు కూడా సంభవించవచ్చు.
నమస్కారానికి, సైకిలుకి సంబంధం ఏమిటనుకుంటున్నారా?. అక్కడకే వస్తున్నా..
ముందు అనుకున్నట్టుగా మన ఉపాధ్యాయులు కనబడితే మనం వందనం చెయ్యాలని అనుకున్నాము కదా!. కాలినడకన ఉన్నన్నాళ్లూ దీనికి ఏమాత్రం సమస్యా ఉండేది కాదు. మరి ఇప్పుడు మనం సైకిలు మీద రివ్వుమని, తారజువ్వలా దూసుకెళ్లిపోతున్నామాయే!..
..అయితే మాత్రం ఏమిటి నీ సమస్య ఏమిటంటారా? చెప్తాను వినండి.
మనం సైకిలు మీద బజార్లో వెళ్తున్నాము. మన మాష్టారు అల్లంత దూరంలో కనబడ్డారు. అప్పుడేం చేస్తాం - బ్రేకులేసి సైకిలు ఆపి,దిగి, సైకిల్ని ఒక చేత్తో పట్టుకుని నడిపిస్తూ, "నమస్తే మాష్టారూ" అంటాం రెండో చేతిని గుండెలమీద వేసుకుని.. లేకపోతే ఇంకాస్త "పద్దతి"గా 'ఘరానా మొగుడు'లో చిరంజీవిలాగా.
అలా కాకుండా, మాష్టార్ని బాగా దగ్గరకి వచ్చినతర్వాతగానీ చూడలేదనుకోండి.. అయితే మాత్రం, మాష్టారు కనబడ్డప్పుడు నమస్కారం పెట్టాలి కదా?. అప్పుడు కొన్ని "ఫీట్లు" చెయ్యాలన్నమాట. అంటే, రెండు చేతులతో హాండిల్ బార్ని గట్టిగా పట్టుకుని, కుడికాలుని ఫెడల్ మీదనుంచి తీసి, సీటుమీదగా తీసుకొచ్చి ఎడమ ఫెడల్ మీద ఎడమకాలు దగ్గర పెట్టి .. (ఇదంతా జరుగుతున్నంతసేపూ సైకిలు వెళ్తూనే ఉంటుందన్న మాట).. ఇక్కడ రెండు చేతులూ busyగా ఉన్నాయి కాబట్టి, తల కొద్దిగా కిందకి ఒంచి "నమస్తే మాష్టారూ" అంటామన్నమాట..
ఇలా మనం ఎన్ని పిచ్చి చేష్టలు చేసినా, మన మాష్టారు/టీచరు Basicalగా Very Good Master/Teacher కాబట్టి, చిరునవ్వుతో మనకి ప్రత్యభివాదం చేసేవారు.
ఇంతకీ అసలు కబురు ఏమిటంటే -
నేను తెనాలిలో తాలూకా హైస్కూల్లో 8,9 తరగతుల్లో చదివేటప్పుడు మా తెలుగు మాష్టారు.. ఈయన అచ్చ'తెనుగు' మాష్టారు. రాగరంజితంగా పద్యాలు పాడేవారు. ఆయన గొంతులో మాధుర్యం ఉట్టిపడేది. ఆయన విశదీకరించి, విపులీకరించి చెప్పిన సంధులు, సమాసాలు, చందస్సులు నాకు ఇప్పటికీ గుర్తే!. ఎవరైనా మాష్టారు ఆ రోజు రావడంలేదని తెలిస్తే, మా తెలుగు మాష్టారు ఆ క్లాసు తీసుకోవడానికొస్తే బాగుండు అనుకునేవాళ్లం.. ఎందుకంటే, అలా వేరేవాళ్ల క్లాసు తీసుకోవడానికి వచ్చినప్పుడు ఆయన అసలు సిలబస్ కాకుండా వేరే వేరే పద్యాలు (పోతన భాగవతం అంతా ఈయనకి కంఠతా వచ్చని అనుకునేవారు) పాడి వాటి అర్ధాలు చెప్తుంటే ఆ పీరియడ్ అంత త్వరగా అయిపోయినందుకు తెగ బాధపడేవాళ్లం.
మళ్లీ నమస్కారంలోకి వచ్చేస్తే.. ఈ తెలుగు మాష్టారు, ఎవరైనా ఎప్పుడైనా మాష్టారికి 'నమస్కారం మాష్టారూ' అని 'విష్' చేస్తే చిరునవ్వుతో "ఒరేయ్! నమస్కారంలో 'మస్కా' ఉంటుందిరోయ్" అనేవారు. మేము నవ్వుకునేవాళ్లం..
మొన్నీమధ్యన ఒక పెళ్లికి తెనాలి వెళ్లినప్పుడు మాష్టారు అక్కడ కనపడితే, వెళ్లి పలకరించాను. పెద్దవయసువల్లగాని, వందల్లో శిష్యగణం ఉండడంవల్లగానీ నన్ను గుర్తించలేకపోయినా ఆసక్తిగా నా బాగోగులు, ఉద్యోగవివరాలు తెలుసుకుని ఆనందించారు.
ఇంతలో మా ఘటోత్కచుడు పరిగెత్తుకుంటూ నా దగ్గరకి వచ్చేసరికి వాడిని మాష్టారికి పరిచయం చేస్తూ, "తాతగారికి నమస్తే చెప్పు" అన్నాను. వాడు మరీ బుద్ధిగా "నమస్కారం తాతగారూ" అంటూ ఆయన కాళ్లమీదపడి పాదాభివందనం చేసాడు.
ఆయన వాడిని పైకి లేపి ఒళ్లో కూర్చోపెట్టుకుంటే, నేను చిన్నగా నవ్వుతూ చిన్నప్పుడు మేము "నమస్కారం" చేస్తే ఆయన ఏమనేవారో గుర్తుచేసుకుంటున్నట్టుగా ఆయనతో అన్నాను.
ఆయన దానికి అవునన్నట్టుగా పెద్దగా నవ్వి, ఒళ్లో కూర్చున్న మావాడి తల నిమురుతూ, "కానీ ఈ నమస్కారంలో ఏ 'మస్కా' లేదు నాయనా!. ఇందులో 'కారం' మాత్రమే ఉంది. నువ్వు చెప్పినమాట విని ఆచరించిన వీడికి నీపై ఉన్న మమకారం ఉంది.. పెద్దల్ని గౌరవించాలి అన్న మన సంస్కృతీ నుడికారం ఉంది." అని వాడి శిరస్సు మీద చెయ్యి ఉంచి "శతమానం భవతి శతాయుః .." అని ఆశీర్వదిస్తుంటే నా మనసు ఆనందంతో ఉబ్బితబ్బిబ్బయింది.
మరి మీరేమంటారు?....
రవి కిరణ్ గారూ!మస్కా మరియు కారం లేని నమస్కారం గురించి చాలా బాగా చెప్పి నేడు మస్కా కొట్టి పారిపోతున్న విద్యార్ధుల గుండెల్లో మస్కా కొట్టారు.చాలా చాలా బాగుంది.
రిప్లయితొలగించండి@సోమార్క గారూ: థాంక్సండీ!
రిప్లయితొలగించండిచాలా బావుంది మీ తెలుగు మేషారి చమత్-కారం. :)
రిప్లయితొలగించండి@ఆ.సౌమ్యగారు.. థాంక్సండీ!
రిప్లయితొలగించండి